నత్తనడకన అగ్రి ల్యాబ్‌

ABN , First Publish Date - 2022-08-01T06:41:29+05:30 IST

రైతులకు మరింత మెరుగైన సేవలందించేందుకు వీలుగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అగ్రి ల్యాబ్‌ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. బిల్లుల మంజూరులో జాప్యం, విద్యుత్తు సౌకర్యం, అధికారుల ఉదాశీనవైఖరి వంటి కారణాలతో అగ్రి ల్యాబ్‌ల నిర్మాణ పనుల్లో మరింత జాప్యం జరుగుతోంది.

నత్తనడకన అగ్రి ల్యాబ్‌

  • నెమ్మదిగా సాగుతున్న సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలల నిర్మాణం
  • ఏడాది అవుతున్నా పూర్తికాని పనులు
  • బిల్లులు మంజూరు లేక జాప్యం

సర్పవరం జంక్షన్‌, జూలై 31: రైతులకు మరింత మెరుగైన సేవలందించేందుకు వీలుగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అగ్రి ల్యాబ్‌ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. బిల్లుల మంజూరులో జాప్యం, విద్యుత్తు సౌకర్యం, అధికారుల ఉదాశీనవైఖరి వంటి కారణాలతో అగ్రి ల్యాబ్‌ల నిర్మాణ  పనుల్లో మరింత జాప్యం జరుగుతోంది. వరిసాగు చేసే రైతులకు విత్తనాల నాణ్యత, భూ సారం పరీక్ష, విత్తన శుద్ధి, పంట సమయంలో తీసుకోవాల్సిన మెరుగైన యాజమాన్య పద్ధతులు వంటి వాటిపై అవగాహన, ఉచిత పరీక్షలు అందించే అగ్రిల్యాబ్‌ల నిర్మాణాన్ని సత్వరంగా పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.

అసంపూర్తిగా సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలలు

వరిసాగు తీవ్ర నిర్వహణాభారంగా మారడం, పంట బాగా పండినా పంట చేతికొచ్చే తరుణంలో ప్రకృతి విపత్తులు, వర్షాలు, వరదలతోపాటు నకిలీ విత్తనాలు, అధిక ఎరువుల వినియోగం, క్రిమిసంహారక మందుల మోతాదువల్ల పంటకు నష్టం వాటిల్లుతోంది. దీంతో రైతులు వరిసాగు కోసం పెట్టిన పెట్టుబడి వెనక్కి రావడం లేదు. వీటినుంచి అన్నదాతలను గట్టేక్కించేందుకు నియోజకవర్గానికో అగ్రిల్యాబ్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. వరిసాగులో నిర్వహణ భారాన్ని తగ్గించి రైతులకు పెట్టుబడులు తగ్గించి అధిక ఆదాయం సమకూర్చేందుకు ప్రభుత్వం వైఎస్సార్‌ సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలలు(అగ్రి ల్యాబ్‌)లను మంజూరు చేసింది. ప్రతి నియోజకవర్గానికో సమీకృత వ్యవసాయ ప్రయోగశాల ఉండేలా కాకినాడ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ఏడు అగ్రి ల్యాబ్‌లను ప్రభుత్వం మంజూరు చేసింది. వ్యవసాయ, సహకారశాఖా మంత్రి కురసాల కన్నబాబు కాకినాడ రూరల్‌ మండలం వాకలపూడి బీచ్‌ ప్రాంతంలో అగ్రి ల్యాబ్‌ను మంజూరు చేశారు. రైతులకు మరిన్ని సేవలందించేందుకు 2021, జూన్‌ 13న రూ.55లక్షల నిధులతో అగ్రిల్యాబ్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ల్యాబ్‌లో నిర్వహించే ఉచిత పరీక్షల కోసం పరికరాల కొనుగోలుకు మరో రూ.26లక్షలు మంజూరు చేశారు. భవన నిర్మాణ పనుల బాధ్యతలను ప్రభుత్వం పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌కు అప్పగించింది. ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు ప్రారంభోత్సవం నాటికి భవన నిర్మాణ పనులు పూర్తి చేసి ల్యాబ్‌లో పరికరాలు సైతం అందుబాటులో ఉంచాల్సి ఉంది. ప్రయోగశాల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉన్నా నిధుల కొరత, విద్యుత్తు సౌకర్యం, అధికారుల ఉదాశీనవైఖరి కారణంగా భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటికే భవనం సగం నిర్మాణం మాత్రమే పూర్తి చేశారు. ల్యాబ్‌కు సంబంధించిన పరికరాలు, సామాగ్రి కొనుగోలు చేసిన దాఖలాలు లేవు.

లభించే సేవలివిగో...

విత్తనాల ఎంపిక, విత్తన నాణ్యత పరీక్షలు ఈ ల్యాబ్‌లో ఉచితంగా పరీక్ష చేస్తారు. మట్టి నమూనాల పరీక్షలు, తేమ పరీక్షలు చేస్తారు. ఎరువులకు సంబంధించి నైట్రోజన్‌, పాస్ఫరస్‌, పొటాషీయం కాంప్లెక్స్‌, మైక్రో న్యూట్రియంట్‌తోపాటు మార్కెట్‌లో లభించే పలు రకాల ఎరువుల మందుల నాణ్యతపై అధికారులు ఉచితంగా పరీక్షలు నిర్వహి స్తారు. అధిక వర్షాలు, విపత్తులు, పంట సమాల్లో రైతులు పాటించాల్సిన ఉత్తమ యాజమాన్య ఆచరణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తారు. రైతులకు విక్రయించిన విత్తనాలు నకిలీ విత్తనాలు, క్రిమి సంహారక మందులు అని పరీక్షల్లో తేలితే ప్రభుత్వం వీటిని స్వాధీనం చేసుకుని సంబంధిత విత్తనాలు, క్రిమి సంహారక తయారీదారులు, వ్యాపారులపై చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకుంటుంది.

Updated Date - 2022-08-01T06:41:29+05:30 IST