ఏసీబీకి చిక్కిన పి.గన్నవరం ఎంపీడీవో

ABN , First Publish Date - 2022-09-13T06:23:10+05:30 IST

బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం ఎంపీడీవో కేఆర్‌ విజయ సోమవారం రూ.40వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు.

ఏసీబీకి చిక్కిన పి.గన్నవరం ఎంపీడీవో

రూ.40 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం
పి.గన్నవరం, సెప్టెంబరు 12: బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం ఎంపీడీవో కేఆర్‌ విజయ సోమవారం రూ.40వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు. ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ సీహెచ్‌ సౌజన్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పి.గన్నవరం మండలం రాజులపాలెం గ్రామ పంచాయతీ పరిఽధిలోని శ్మశానవాటిక,  కమ్యూనిటీహాల్‌, సీసీ రోడ్ల నిర్మాణం తదితర పనులు కోసం రూ.1.15 కోట్ల ఎంపీ ల్యాడ్స్‌ నిధులకు సంబంధించి 10 శాతం మండలపరిషత్‌ నిధుల కోసం అనుమతులు ఇవ్వాలని రాజులపాలెం గ్రామ ఉపసర్పంచ్‌ ఎన్‌.విజయలక్ష్మి ఎంపీడీవో కేఆర్‌ విజయను కోరారు. అయితే ఈ పనిచేయడానికి రూ.50 వేలు లంచం ఇవ్వాలని ఎంపీడీవో విజయ డిమాండ్‌ చేశారు. దీని ప్రకారం ఈనెల 6న రూ.10 వేలను ఎంపీడీవోకు ఉపసర్పంచ్‌ ఇచ్చారు. అనంతరం ఈనెల10న ఎంపీడీవోపై  ఏసీబీకి  ఉప సర్పంచ్‌ ఫిర్యాదు చేశారు. మిగిలిన రూ.40 వేలు ఇవ్వాలని ఎంపీడీవో డిమాండ్‌ చేయగా మండలపరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో కేఆర్‌ విజయకు సోమవారం ఉపసర్పంచ్‌ విజయలక్ష్మి రూ.40వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ సీహెచ్‌ సౌజన్య ఎంపీడీవోను పట్టుకున్నారు.   ఫైల్‌ను సీజ్‌ చేసి ఎంపీడీవోను అదుపులోకి తీసుకున్నట్లు అడిషనల్‌ ఎస్పీ తెలిపారు. రాత్రి వరకు రికార్డులు, కంప్యూటర్ల తనిఖీలు కొనసాగాయి. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు వి.పుల్లారావు, బి.శ్రీనివాస్‌, వై.సతీష్‌, ఎస్‌ఐ ఎస్‌.విల్సన్‌, సిబ్బంది పాల్గొన్నారు. జూలై 8న ఆమె మండలంలో ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టగా, రెండు నెలలకే ఆమె ఏసీబీకి చిక్కడం గమనార్హం.

Read more