ఎంత పని చేశారయ్యా.. శివయ్యా

ABN , First Publish Date - 2022-09-26T06:01:34+05:30 IST

వైసీపీ సభ కోసం వేసిన టెంట్‌ను బిగదీసే తాడును ఓ గుడిలో శివలింగం పానమట్టంకు కట్టడం వివాదాస్పదమైంది.

ఎంత పని చేశారయ్యా.. శివయ్యా
శివలింగం పానమట్టంకు కట్టిన తాడు

శివలింగం పానమట్టంకు తాడు

 వివాదాస్పదమైన వైసీపీ సభ

 టెంట్‌ నిర్వాహకుడిపై కేసు  


 రాజమహేంద్రవరం, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి) : వైసీపీ సభ కోసం వేసిన టెంట్‌ను బిగదీసే తాడును ఓ గుడిలో శివలింగం పానమట్టంకు కట్టడం వివాదాస్పదమైంది.చివరకు టెంట్‌హౌస్‌ నిర్వాహకుడిపై పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేసే వరకూ వచ్చింది. కానీ ఇక్కడ సభ నిర్వహించిన వైసీపీ నేతలు మాత్రం చేతులు దులుపేసుకున్నారు.బిక్కవోలు మండల కేంద్రమైన బిక్కవోలులో పురాతన గోలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. శనివారం మధ్యాహ్నం జగనన్న చేయూత పథకం చెక్కుల పంపిణీ మండల స్థాయి సమావేశాన్ని ఆలయ ఆవరణలో ఏర్పాటు చేశారు. దీని కోసం టెంట్‌ ఏర్పాటు చేశారు. టెంట్‌కు సంబంధించిన ఓ తాడును బిగదీసి గుడిలోపల ఉన్న శివలింగం పానమట్టంకు కట్టారు. దీనిని ఎవరో వీడియో తీసి, సోషల్‌మీడియాలో పోస్టుచేశారు. అది విస్తృతం గా వైరల్‌ కావడంతో పాటు వైసీపీ సభ కోసం శివయ్యను అవమానించారా అంటూ విమర్శలు ఊపందు కున్నాయి. చివరికి దేవుడిని కూడా వైసీపీ సభకు వాడేసుకుని, అవమాన పరిచారనే చర్చ మొదలైంది. ఈ సభలో అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఎంపీపీ కొవ్వూరి జోతిర్మయి, జడ్పీటీసీ రొంగల పద్మావతి, ఎంపీడీవో జేఏ శాంతి,వైసీపీ నేతలు పాల్గొన్నారు. శివలింగానికి తాడు కట్టడం వివాదాస్పదం కావడంతో అందరూ అప్రమత్తమయ్యారు. ఆదివారం ఆలయ ఈవో ఏఎస్‌డీహెచ్‌సీ రామలింగం ఫిర్యాదు మేరకు బిక్కవోలు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసరు కేసు నమో దు చేశారు. ఇక్కడ నిర్వహించిన సభ కోసం శ్రీసత్యశ్రీ టెంట్‌హౌస్‌ ఓనర్‌ చంటి, అక్కడ పనిచేసే వర్కర్‌ వీరబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.


Read more