ద్రావిడ వర్సిటీ హాస్టల్లో విషాహారం

ABN , First Publish Date - 2022-02-23T08:49:11+05:30 IST

చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయం అక్కమహాదేవి మహిళా వసతి గృహంలో మంగళవారం మధ్యాహ్న భోజనం చేసిన సుమారు 30మందికి పైగా విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వర్సిటీ అధికారులు..

ద్రావిడ వర్సిటీ హాస్టల్లో విషాహారం

  • 30 మందికి అస్వస్థత.. ప్రైవేటు ఆస్పత్రికి తరలింపు
  • ముగ్గురు విద్యార్థినుల పరిస్థితి విషమం
  • ఫుడ్‌ పాయిజన్‌ కాలేదంటున్న అధికారులు


కుప్పం, ఫిబ్రవరి 22: చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయం అక్కమహాదేవి మహిళా వసతి గృహంలో మంగళవారం మధ్యాహ్న భోజనం చేసిన సుమారు 30మందికి పైగా విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వర్సిటీ అధికారులు హుటాహుటిన కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. విద్యార్థినుల కథనం మేరకు.. ద్రావిడ విశ్వవిద్యాలయంలో యూజీ, పీజీ చదువుతున్న సుమారు 270 మంది విద్యార్థినులు వర్సిటీ క్యాంప్‌సలోని అక్కమహాదేవి వసతి గృహంలో ఉంటున్నారు. వీరికి నూల్‌కోల్‌, బంగాళాదుంప, క్యాలీఫ్లవర్‌ కలిపి చేసిన సాంబారుతో పాటు బీన్స్‌ తాలింపు, రసం, పెరుగు మంగళవారం మధ్యాహ్న భోజనంలో వడ్డించారు. ఈ భోజనం తిన్న కాసేపటికి కొందరికి వాంతులు ప్రారంభమయ్యాయి. ఇద్దరు సాయంత్రం ఐదు గంటల సమయంలో  స్పృహ తప్పి పడిపోయారు.


సహ విద్యార్థినులు సపర్యలు చేసినా కోలుకోకపోగా, మరికొందరు కూడా ఇదేవిధంగా వాంతులు చేసుకున్నారు. వారిలో కొందరికి ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైంది. స్పందించిన వర్సిటీ అధికారులు అస్వస్థతకు గురైన విద్యార్థినులను కుప్పం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తొలుత ఐదుగురితో ప్రారంభమైన చేరికలు రాత్రి 7 గంటల సమయానికి 23కు చేరాయి. ఆపైన మరికొందరు చేరడంతో ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిన వారి సంఖ్య 30కి పెరిగింది. వీరిలో ఇద్దరు, ముగ్గురికి శ్వాస అందకపోవడంతో ఆసుపత్రిలో వైద్యులు ఆక్సిజన్‌ అందించారు. చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు విద్యార్థినుల పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. వీరిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మిగిలినవారు అందరూ క్షేమంగానే ఉన్నట్లు చెప్పారు. దీనిపై ద్రావిడ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య తుమ్మల రామకృష్ణ, హాస్టల్‌ వార్డెన్‌ విజయవర్ధిని మాట్లాడుతూ అక్కమహాదేవి మహిళా వసతి గృహంలో ఉన్న విద్యార్థిలనులందరికీ ఒకే భోజనం వడ్డించామన్నారు. ఫుడ్‌ పాయిజనింగ్‌ వల్లనే విద్యార్థినులు అస్వస్థతకు గురైవుంటే, అందరికీ అలాగే కావాలని..  విచారణ జరిపించి వాస్తవంగా ఏం జరిగిందో తేలుస్తామని వివరణ ఇచ్చారు.


నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశం

అమరావతి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ద్రావిడ యూనివర్సిటీ హాస్టల్లో విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌ అధికారులతో మాట్లాడారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంఘటనపై నివేదిక అందజేయాలని యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ను, పూర్తి స్థాయి విచారణ జరపాలని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డిని మంత్రి ఆదేశించారు. 


ఘటనపై చంద్రబాబు ఆరా

ద్రావిడ విశ్వవిద్యాలయం ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందేలా సహాయం చేయాలని స్థానిక నేతలకు సూచించారు. విద్యార్థినులు చికిత్స పొందుతున్న కేసీ హాస్పటల్‌, మెడికల్‌ కాలేజీ వైద్యులతో చంద్రబాబు మాట్లాడారు. కలుషిత ఆహారం సరఫరాతో విద్యార్థినుల ప్రాణాల మీదకు తెచ్చిన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ వ్యవహారాన్ని అధికారులు దాచిపెట్టే ప్రయత్నం చేశారన్న సమాచారంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. 

Read more