ఖైదీల విడుదలలో.. ప్రభుత్వానికి అపరిమిత అధికారాలున్నాయా?

ABN , First Publish Date - 2022-09-21T09:35:04+05:30 IST

జీవిత ఖైదీలకు క్షమాభిక్ష విషయంలో రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన విధానంపై కోర్టు పలు సందేహాలు లేవనెత్తింది. ఖైదీల విడుదలలో ప్రభుత్వానికి అపరిమిత అధికారాలు ఉంటాయా..

ఖైదీల విడుదలలో.. ప్రభుత్వానికి అపరిమిత అధికారాలున్నాయా?

ఒకవేళ ఉన్నా ఆరు నెలలకే జీవిత ఖైదీని రిలీజ్‌ చేయొచ్చా?

14ఏళ్లు శిక్ష అనుభవించాలన్న నిబంధన పాటించక్కర్లేదా?: హైకోర్టు

 

అమరావతి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): జీవిత ఖైదీలకు క్షమాభిక్ష విషయంలో రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన విధానంపై కోర్టు పలు సందేహాలు లేవనెత్తింది. ఖైదీల విడుదలలో ప్రభుత్వానికి అపరిమిత అధికారాలు ఉంటాయా.. తాను అనుకున్నప్పుడు జీవిత ఖైదు పడిన వ్యక్తిని విడుదల చేయొచ్చా.. కనీసం 14ఏళ్లు శిక్ష అనుభవించాలన్న నిబంధన పాటించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర హోంశాఖ వాదనలు ఆలకించేందుకు విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ మంగళవారం ఆదేశాలిచ్చారు.


తన భర్త పార్థమరెడ్డిని హత్య చేసిన కేసులో జీవిత ఖైదుపడిన 8 మంది నేరస్థులు పుచ్చలపల్లి నరేశ్‌రెడ్డి, కొండూరు దయాకర్‌రెడ్డి, పుచ్చలపల్లి శ్రీనివాసులరెడ్డి, పుచ్చలపల్లి నిరంజన్‌రెడ్డి, పుచ్చలపల్లి సుబ్రహ్మణ్యంరెడ్డి, యల్లసిరి మస్తాన్‌, కలత్తూరు సుధాకర్‌రెడ్డి, చెన్నూరు వెంకటరమణారెడ్డిలను ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా క్షమాభిక్ష పెట్టి విడుదల చేయడాన్ని సవాల్‌ చేస్తూ నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మెట్టు గ్రామానికి చెందిన ముడి నవనీతమ్మ హైకోర్టులో అనుబంధ పిటిషన్‌ వేశారు. ప్రభుత్వం ఆగస్టు 14న జారీ చేసిన జీవో 121ని రద్దు చేయాలని.. వారిని తిరిగి జైలుకు పంపించేలా ఆదేశాలివ్వాలని కోరారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపించారు. జీవిత ఖైదు పడిన వ్యక్తి కనీసం 14 సంవత్సరాలు శిక్ష అనుభవిస్తేనే క్షమాభిక్షకు అర్హులని పేర్కొన్నారు. ‘కనీస శిక్ష అనుభవించకుండానే నేరస్థులను విడుదల చేశారు.


మరణశిక్ష పడి.. పదేళ్లు జైలుశిక్ష అనుభవించినవారి శిక్షను జీవిత ఖైదుగా మార్చే అధికారం గవర్నర్‌కు ఉందని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పింది. విడుదలైన నేరస్థులు క్షమాభిక్షకు అర్హులు కాదు. ప్రభుత్వ పాలసీ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉంది. రాజ్యాంగంలోని 161వ అధికరణ ప్రకారం ఖైదీలను విడుదల చేసే అధికారం గవర్నర్‌కు మాత్రమే ఉంది.  అయితే 14 ఏళ్లు శిక్ష అనుభవించకుండానే ఖైదీలను విడుదల చేస్తున్నామనే విషయాన్ని గవర్నర్‌ దృష్టికి ప్రభుత్వం తీసుకురాలేదనే అనుమానం కలుగుతోంది’ అని తెలిపారు. ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 175 మంది ఖైదీలను విడుదల చేశామని హోం శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది మహేశ్వర్‌రెడ్డి అన్నారు. కనీసం 14 ఏళ్లు జైలుశిక్ష అనుభవించాలన్న నిబంధన పాటించాల్సిన అవసరం లేదని తెలిపారు. సత్ప్రవర్తన కలిగి.. పాలసీ నిబంధనలకు అర్హత సాధించినవారినే విడుదల చేశామన్నారు.


న్యాయమూర్తి స్పందిస్తూ.. ఖైదీల విడుదలకు సంబంధించి ప్రభుత్వానికి ఉన్న అధికారాల విషయంలో ఎలాంటి వివాదం లేదని స్పష్టం చేశారు. అయితే అధికారం ఉంది కదా అని జీవిత ఖైదుపడిన వ్యక్తిని ఆరు నెలలకే విడుదల చేయవచ్చా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తన అధికారాన్ని ఐపీసీ, సీఆర్‌పీసీ సెక్షన్లకు అనుగుణంగానే వినియోగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఐపీసీ సెక్షన్‌ 2(ఓ), సీఆర్‌పీసీ సెక్షన్‌ 433 ప్రకారం 14 ఏళ్లు జైలుశిక్ష పూర్తి చేసినవారే క్షమాభిక్షకు అర్హులని గుర్తుచేశారు. కోర్టు సమయం ముగియడంతో ప్రభుత్వ న్యాయవాది వాదనలు కొనసాగించేందుకు విచారణను ఈ నెల 26కి వాయిదా వేశారు.

Read more