సమస్యలు తీర్చేవరకూ మా కాలనీకి రావొద్దు

ABN , First Publish Date - 2022-09-08T08:46:21+05:30 IST

సమస్యలు తీర్చేవరకూ మా కాలనీకి రావొద్దు

సమస్యలు తీర్చేవరకూ మా కాలనీకి రావొద్దు

‘గడపగడప’లో కదిరి ఎమ్మెల్యేకు చేదు అనుభవం .. సమస్యలపై నిలదీసిన స్థానికులు.. సమాధానం చెప్పలేక ఇంటి బాటపట్టిన సిద్ధారెడ్డి 


కదిరి, సెప్టెంబరు 7: శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ కేంద్రంలో బుధవారం ‘గడపగడప’కు కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ‘మీ అపార్టుమెంట్లకు నాలుగు లైన్ల రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. మా వార్డులో కనీసం మురుగునీటి కాలువలు కూడా ఏర్పాటు చేయలేరా?’ అని ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని మహిళలు నిలదీశారు. వర్షాలకు కాలనీలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని, వాటిపై ఎలా తిరగాలని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించేవరకూ తమ కాలనీలోకి రావొద్దంటూ ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. దీంతో పట్టణంలోని 3 వార్డు సైదాపురంలో ఉద్రిక్తత నెలకొంది. బాధితులకు టీడీపీ నేతలు, కార్యకర్తలు మద్దతుగా నిలిచారు. దీంతో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు టీడీపీ వారిని పక్కకు నెట్టివేశారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వకుండా ముందుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఎమ్మెల్యేపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదే కాలనీలో ముందుకు వెళ్లిన ఎమ్మెల్యేకి తాగునీరు, విద్యుత్‌ సమస్యపై ప్రజలు ప్రశ్నలు గుప్పించారు. ‘ఎస్సీలను ఉద్ధరిస్తామని, కాలనీలో సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అయ్యాక మళ్లీ ఇప్పుడు కనిపిస్తున్నారు’ అని ముఖంమీదే అనడంతో ఆయన కంగుతిన్నారు. ఎక్కడికి వెళ్లినా జనం సమస్యలపై నిలదీయడంతో వారికి సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే తూతూమంత్రంగా గడపగడపకు ముగించి వెనుదిరిగారు. 


వైసీపీ కార్యకర్తల్లా పోలీసులు 

కదిరిలో నిర్వహించిన గడపగడపలో సీఐ మధు వైసీపీ కార్యకర్తగా మారారు. ఎమ్మెల్యే కంటే ముందుగానే ఇళ్ల వద్దకు వెళ్లి,  ఎమ్మెల్యేకి వినతిపత్రాలు ఇవ్వాలని, వాటిని ఆయన పరిష్కరిస్తారని ‘ప్రచారం’ చేశారు. సమస్యలపై కొందరు వైసీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో ‘సొంత పార్టీలో ఆందోళన చేయడం సరికాదు’ అని హితవు పలికారు. సీఐ తీరు చూసి అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులే నివ్వెరపోయారు. ఎమ్మెల్యే గన్‌మన్‌ కూడా ముందే ఇంటింటికీ వెళ్లి ఇలాగే హడావుడి చేశారు.  ఎమ్మెల్యే రక్షణ బాధ్యతలు చూడకుండా, ఇక్కడ మీకేం పని అని జనం ఆయన్ను ప్రశ్నించారు. ఎమ్మెల్యేని జనం నిలదీస్తున్న ఘటనలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులను ఆయన సొంత సోషల్‌ మీడియా కార్యకర్తలు అడ్డుకున్నారు. వీడియోలు తీయవద్దని బెదిరించారు. 

Updated Date - 2022-09-08T08:46:21+05:30 IST