డర్టీ పిక్చర్‌ అసలైందే!

ABN , First Publish Date - 2022-08-14T08:00:39+05:30 IST

డర్టీ పిక్చర్‌ అసలైందే!

డర్టీ పిక్చర్‌ అసలైందే!

మాధవ్‌ నగ్న వీడియోలో మార్పుచేర్పులు, మార్ఫింగ్‌ లేవు

అమెరికా ఫోరెన్సిక్‌ నిపుణుడి నివేదిక

బయటపెట్టిన తెలుగుదేశం పార్టీ

జగన్‌ సర్కారు పరీక్షకు పంపదనే

మేం ఫ్లోరిడా ల్యాబ్‌కు వీడియో పంపాం

నిజమని తేలితే చర్యలని సజ్జలతో చెప్పించారుగా

ఇప్పుడు సీఎం ఏం చెబుతారు?.. పట్టాభి, అనిత ఫైర్‌


అమరావతి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన నగ్న వీడియో అసలైందేనని అమెరికాకు చెందిన ప్రముఖ ఫోరెన్సిక్‌ నిపుణుడు జిమ్‌ స్టాఫోర్డ్‌ నిర్ధారించారు. అందులో మార్పుచేర్పులు కూడా లేవని తన నివేదికలో పేర్కొన్నారు. దీనిని శనివారమిక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విడుదల చేశారు. జగన్‌ ప్రభుత్వం ఈ వీడియోను ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపిస్తుందన్న నమ్మకం లేక తమ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశానుసారం తాము అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న ప్రముఖ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఎక్లి్‌ప్సకు దీనిని పంపామని.. అక్కడ ఉంటున్న తమ బంధువు పోతిని ద్వారా ఈ నెల 9న ల్యాబ్‌కు ఈ వీడియోను అందచేశామని పట్టాభి తెలిపారు. 11న ల్యాబ్‌ నుంచి నివేదిక అందిందన్నారు. డిజిటల్‌ ఫోరెన్సిక్‌ పరీక్షల్లో ఈ వీడియో అసలైందేనని.. అందులో ఎటువంటి మార్పుచేర్పులూ లేవని స్టాఫోర్డ్‌ నివేదిక ఇచ్చారని వెల్లడించారు. వీడియోను ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపిస్తున్నామని, నిజమని తేలితే కఠిన చర్యలు ఉంటాయని మొదటి రోజు తన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో చెప్పించిన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని పట్టాభి ప్రశ్నించారు. ‘తన పార్టీకి చెందిన ఒక ఎంపీ పరమ అసహ్యంగా ప్రవర్తిస్తే వ్యవస్థలను, ఖాకీ యూనిఫారాలను సీఎం తన గుప్పిట్లో పెట్టుకుని కాపాడాలని ప్రయత్నిస్తున్నారు.  వీడియోను ఫోరెన్సిక్‌ పరీక్షకు అసలు పంపకుండానే అది మార్ఫింగ్‌, ఎడిటెడ్‌ వీడియో అని ఎస్పీతో చెప్పించారు. ఇలాంటి అబద్ధాలు చెప్పకుండా ఆపడానికే మేం ఈ వీడియోను అమెరికాలోని ఫోరెన్సిక్‌ పరీక్షలు జరిపే సంస్థకు పంపి పరీక్ష చేయించాం. ఈ సంస్థ ఫ్లోరిడాలోని సెయింట్‌ అగస్టీన్‌లో ఉంది. కావాలంటే వెళ్లి విచారించుకోవచ్చు. ముఖ్యమంత్రికి ఇది సరిపోతుందా? ఇంకా ఏమైనా కావా లా? ఇంకా ఎన్ని రోజులు తప్పించుకుంటారు? మహిళల గౌరవానికి భంగం కలిగితే గన్‌ కంటే ముందు జగన్‌ వస్తాడని రోజక్క సినిమా డైలాగులు చెప్పారు.. మరి వచ్చాడా? ఈ నివేదిక వచ్చిన తర్వాత మాధవ్‌కు ఒక్క నిమిషం కూడా ఆ పదవిలో ఉండే నైతిక హక్కు లేదు. ఇంకా సిగ్గు లేకుండా అనంతపురంలో హోర్డింగ్స్‌ పెట్టుకుంటున్నాడట. ఈ నివేదికను పెట్టుకోమనండి’ అని ఎద్దేవా చేశారు. మాధవ్‌పై చర్యలు తీసుకోకుండా ముఖ్యమంత్రికి 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకం ఎగురవేసే అర్హత కూడా లేదన్నారు. సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న వీడియోనే తాము పరీక్షకు పంపి నివేదిక తెప్పించామని, అదే వీడియోను కేంద్ర ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు ఎందుకు పంపలేకపోతున్నారని  ప్రశ్నించారు. జంతువులా ప్రవర్తించిన ఎంపీ సిగ్గులేకుండా కులాల పేర్లెత్తి తప్పించుకోవాలని చూస్తున్నాడని, తన చర్యలతో కురబ కులం ప్రతిష్ఠను దిగజారుస్తున్నాడని పట్టాభి విమర్శించారు. కాగా, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని 60 ఏళ్ల మహిళలతో సహా అనేక మందిపై పోలీసులు కేసులు పెట్టారని, అసలైన వీడియోలుంటేనే వారిపై కేసులు పెట్టారా అని అనిత ప్రశ్నించారు. ‘వీడియోను ఏ పరీక్షకు పంపకుండానే పోలీసు ఎంపీకి క్లీన్‌ చిట్‌ ఇచ్చేసింది. ఆశాఖ అసమర్థత తెలియాలనే మేం ఆ వీడియోను అమెరికాలో ప్రఖ్యాత ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపి నివేదిక తెప్పించాం. మీరు చేయలేని పని మేం చేశాం. దాని గురించి మాట్లాడే దమ్ము పోలీసు శాఖకు, ప్రభుత్వానికి ఉందా? లేకపోతే ఆ నివేదిక కూడా ఎవరో కమ్మోళ్లు రాశారని చెప్పి దులుపుకొని తిరుగుతారా? దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిందని గర్వపడాలో.. లేక ఇంతకాలం తర్వాత కూడా మహిళలను అవమానపరిచే ఇటువంటి దౌర్భాగ్యులు బోర విరుచుకుని తిరుగుతున్నారని బాధపడాలో  అర్థంకావడం లేదు. జగన్‌రెడ్డి ఇప్పటికైనా స్పందిస్తారా లేక ఇంకా పబ్జీ ఆడుకుంటూ కూర్చుంటారా? కనీసం రికార్డెడ్‌ ప్రెస్‌మీట్‌ అయినా పెట్టి మాట్లాడాలని మా విజ్ఞప్తి’ అని ఆమె అన్నారు. పెద్ద పోర్న్‌ స్టార్‌ అనుకుని మాధవ్‌ అనంతపురంలో హోర్డింగులు పెట్టించుకుంటున్నారని, ప్రజలు చెప్పులతో స్వాగతం పలకాలని అన్నారు. తాను మహిళల గౌరవాన్ని కాపాడేందుకు ఉన్నాడో.. లేక తమ ఎంపీని కాపాడడానికి ఉన్నాడో ముఖ్యమంత్రి తేల్చుకోవాలని అనిత సూచించారు. 


జిమ్‌ స్టాఫోర్డ్‌ ఏం చెప్పారు..? 

‘వీడియో ఫోరెన్సిక్స్‌, ఇమేజ్‌ అనాలిసి్‌సలో నేను సర్టిఫైడ్‌, కోర్ట్‌ క్వాలిఫైడ్‌ నిపుణుడిని. మొబైల్‌ డివైజ్‌ ఫోరెన్సిక్స్‌లో కూడా సమాన స్ధాయి నిపుణుడిని. ఇటువంటి ఎన్నో కేసుల్లో ు పనిచేశాను. ఒక్క ఈ ఏడాదిలోనే నలభై కేసులపై పనిచేశాను. ఈ నెల తొమ్మిదో తేదీన పోతిని అనే వ్యక్తి నుంచి నాకు ఈ వీడియో అందింది. ఇది నిజమైందేనా.. ఇందులో ఏమైనా మార్పుచేర్పులు, ఎడిటింగ్‌ చేశారా అని ఆయన నన్ను అడిగారు. ఇది వీడియో కాల్‌ను రికార్డు చేసిన వీడియో. ఒక పురుషుడు తన జననాంగాలను ఒక మహిళకు చూపుతున్నట్లుగా ఉంది. ఆ మహిళ కూడా ఒక మూల వీడియోలో కనిపిస్తున్నారు. ఒక స్మార్ట్‌ ఫోన్‌లో ప్లే అవుతుండగా ఈ వీడియో రికార్డు చేశారు. యాంప్డ్‌ ఫైవ్‌ వీడియో ఫోరెన్సిక్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా దీనిని పరీక్షించాం. నేను చేసిన డిజిటల్‌ ఫోరెన్సిక్‌ పరీక్షల్లో తేలిన ప్రకారం ఈ వీడియో అసలైందే. అందులో ఎటువంటి మార్పుచేర్పులూ లేవు.’Read more