అక్రమాల నిగ్గు తేల్చండి!

ABN , First Publish Date - 2022-10-11T09:10:25+05:30 IST

అడ్డదిడ్డంగా సాగుతున్న ‘భూయజ్ఞం’పై లోకాయుక్త దృష్టి సారించింది. గత మూడు రోజులుగా ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురిస్తున్న వరుస కథనాలపై స్పందించి సోమవారం సుమోటోగా కేసు నమోదు

అక్రమాల నిగ్గు తేల్చండి!

‘భూయజ్ఞం’పై సుమోటోగా లోకాయుక్త కేసు

2 నెలల్లో నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌కు ఆదేశం

అనుమతుల్లేకుంటే ప్లాట్లు రిజిస్టర్‌ చేయొద్దు


విశాఖపట్నం, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): అడ్డదిడ్డంగా సాగుతున్న ‘భూయజ్ఞం’పై లోకాయుక్త దృష్టి సారించింది. గత మూడు రోజులుగా ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురిస్తున్న వరుస కథనాలపై స్పందించి సోమవారం  సుమోటోగా కేసు నమోదు చేసింది. ఇందులో అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ను రెస్పాండెంట్‌గా పేర్కొంది. ఈ విషయంలో మొత్తం ఏడు అంశాలపై విచారణ చేసి రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను ఆదేశిస్తూ ఈ కేసును వచ్చే ఏడాది జనవరి 6వ తేదీకి వాయిదా వేసింది. ‘‘ప్రకృతి వనరులను కాపాడాలని సుప్రీంకోర్టు, హైకోర్టులు అనేక కేసుల్లో తీర్పులు ఇచ్చాయి. ఆయా గ్రామాల్లో జరుగుతున్న విధ్వంసం అందుకు భిన్నంగా ఉంది.


అందువల్ల దీనిని విచారణకు  తీసుకుంటున్నాం’’ అని లోకాయుక్త తెలిపింది. ఆ భూముల్లో వీఎంఆర్‌డీఏ నుంచి సరైన అనుమతులు తీసుకోకుండా ప్లాట్ల అమ్మకాలు చేపట్టి ఉంటే... వాటిని రిజిస్టర్‌ చేయకుండా జిల్లా, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. అనధికార లేఅవుట్లలో ప్లాట్లు, భవనాలు కొనవద్దని ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేయాలని ఆదేశించింది.


ఏం తేల్చాలంటే...

ఆ మూడు గ్రామాల్లో భూములను రైతుల నుంచి బలవంతంగా తీసుకున్నారా?

ఆయా సర్వే నంబర్లు రెవెన్యూ రికార్డుల్లో అనధికారికంగా బ్లాక్‌ లిస్టులో ఉన్నాయా? 

ఆ భూముల్లో నీటి వాగులను కప్పేసి, కొండలను తవ్వేసి, చెట్లను కొట్టేసిన మాట వాస్తవమేనా? 

వింటేజ్‌ మౌంట్‌ విల్లాల పేరుతో ముద్రించిన బ్రోచర్లలో పేర్కొన్న నిర్మాణాలకు అనుమతులున్నాయా?

‘వింటేజ్‌’ ప్రాజెక్టు ఏపీ రెరా చట్టం కింద నమోదైందా? లేదా? 

ఈ భూముల వివాదంపై గతంలో నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికపై చర్యలు తీసుకున్నారా?

Updated Date - 2022-10-11T09:10:25+05:30 IST