IAS Social media: ఏమిటిది ఆఫీసర్‌?

ABN , First Publish Date - 2022-11-21T02:50:07+05:30 IST

గతంలో ఎన్నడూ లేని విధంగా... స్వరం మార్చిన అధికారుల పేరు పెట్టి మరీ, ‘అప్పుడు అలా అన్నారు. ఇప్పుడు ఇలా చేస్తున్నారెందుకు?’ అని ప్రశ్నిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు కూడా ప్రత్యక్షమవుతున్నాయి. మరీ ముఖ్యంగా

IAS Social media: ఏమిటిది  ఆఫీసర్‌?
సోషల్‌ మీడియా

ఐఏఎస్‌లపై సోషల్‌ మీడియాలో సూటి ప్రశ్నలు

నాడు వద్దు వద్దంటూ గత ప్రభుత్వానికి అడ్డంకులు

అసైన్డ్‌పై హక్కులు, భూ సర్వేకు ‘నో’ అన్న ఐఏఎస్‌లు

నేడు అవే అంశాల అమలు కోసం పరుగులు

సంచలనంగా మారుతున్న ట్వీట్లు, పోస్టులు

ఒకటే నిర్ణయం! వారే అధికారులు! అప్పుడు... కాదూ కాదని మొండికేశారు. ఇప్పుడు ‘ఎస్‌ బాస్‌... ఎస్‌ బాస్‌’ అని తలలూపుతున్నారు. పాలకుడు మారేసరికి అధికారుల తీరూ మారడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

గతంలో ఎన్నడూ లేని విధంగా... స్వరం మార్చిన అధికారుల పేరు పెట్టి మరీ, ‘అప్పుడు అలా అన్నారు. ఇప్పుడు ఇలా చేస్తున్నారెందుకు?’ అని ప్రశ్నిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు కూడా ప్రత్యక్షమవుతున్నాయి. మరీ ముఖ్యంగా అసైన్డ్‌ భూములపై హక్కులు, భూముల రీసర్వే అంశాలపై గత ప్రభుత్వమూ సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. కానీ... ఆ నిర్ణయాలను అధికారులు వ్యతిరేకించారు. అసైన్డ్‌ భూములపై హక్కులు ఇవ్వడం సరికాదని... మొత్తం భూములను రీ సర్వే చేయడం అనవసరమని చెప్పారు. అదే అధికారులు ఇప్పుడు ఆ నిర్ణయాలనే అమలు చేస్తున్నారు. అసైన్డ్‌ భూములపై హక్కులు ఇచ్చేద్దామని చంద్రబాబు ప్రభుత్వంలో ఒక ప్రతిపాదన వచ్చింది. దీనిపై రెవెన్యూశాఖ అనేక సంప్రదింపులు జరిపింది. అలా చేయడం పీఓటీ చట్టానికి పూర్తి విరుద్ధమని అధికారులు కలెక్టర్ల సదస్సులో గట్టిగా చెప్పారు. దీనికి సహేతుక కారణమూ ఉంది. అసైన్డ్‌ భూములను ఎవరూ కొనకూడదు. వాటిని లబ్ధిదారులే అనుభవించాలి. అలాకాదని... విక్రయానికి అనుమతిస్తే పేదలను మాయ చేసో, మభ్యపెట్టో, బెదిరించో ఇతరులు వాటిని సొంతం చేసుకునే ప్రమాదముంది. భూములు అమ్ముకున్న తర్వాత వారు మళ్లీ భూమిలేని పేదలుగానే మిగిలిపోతారు. భూ పంపిణీ, అసైన్డ్‌ చట్టం ఉద్దేశం దెబ్బతింటుంది. ఈ విషయాన్ని అధికారులు గట్టిగా నొక్కి వక్కాణిస్తూ... అసైన్డ్‌ భూములపై హక్కులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రతిపాదనను నాటి సర్కారు పక్కన పెట్టింది. ఇప్పుడు ప్రభుత్వం మారింది. జగన్‌ సర్కారు అసైన్డ్‌ భూములపై హక్కులు ఇచ్చే అంశాన్ని గట్టిగా పరిశీలిస్తోంది. మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో అసైన్డ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. మారిందల్లా ప్రభుత్వమే. అధికారులు వారే. గతంలో సీఎంఓలో ఉన్న అధికారే ఇప్పుడు ‘అసైన్డ్‌’ వ్యవహారంపై పని చేస్తున్నారు. ‘అసైన్డ్‌ భూములపై హక్కులు ఇవ్వడం సరికాదు. దీనివల్ల చట్టం ఉద్దేశమే దెబ్బతింటుంది’ అని ఒక్క అధికారీ చెప్పేందుకు సాహసించడంలేదు. అప్పుడు తప్పనుకున్న విషయాలు ఇప్పుడు ఒప్పు ఎలా అవుతున్నాయి? అప్పుడు అడ్డొచ్చిన అంశాలేమిటి? ఇప్పుడు కలిసిసొస్తున్న విషయాలేమిటి? ప్రభుత్వ పెద్దల ‘మూడ్‌’ ముఖ్యమా... చట్టం ముఖ్యమా? అని అధికారులను సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

భూముల రీసర్వేపై...

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనూ భూముల రీ సర్వే చేయాలన్న ఆలోచనలు, ప్రతిపాదనలు వచ్చాయి. అప్పుడు ఇదే అంశంపై నాటి ముఖ్యమత్రి చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్లతో మాట్లాడారు. కానీ... కొందరు అధికారులు ముఖ్యమంత్రి ఆలోచన, ప్రతిపాదన సరికాదని వెనక్కి లాగారు. ‘‘రీ సర్వే వల్ల కొత్త సమస్యలు వస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిజామాబాద్‌ జిల్లాలో చేపట్టిన భూ భారతి, కృష్ణా జిల్లా తక్కెళ్లపాడులో నిర్వహించిన పైలట్‌ సర్వేలు విఫలమయ్యాయి. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టినా ఫలితం లభించలేదు’’ అని నివేదించారు. దీంతో కేవలం భూ వివాదాలున్న చోట మాత్రమే సర్వేలు చేసి ‘కేస్‌ టు కేస్‌’ పరిష్కరించాలని నాటి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆ తర్వాత భూములకు ‘ఆధార్‌’ తరహాలో విశిష్ట సంఖ్యను కేటాయించేందుకు ‘భూదార్‌’ ప్రాజెక్టు తీసుకొచ్చింది. ప్రభుత్వం మారగానే భూదార్‌ను పక్కనపెట్టేశారు. రీ సర్వేను తెర మీదకుతెచ్చారు. ఇక్కడ మారిందల్లా ప్రభుత్వమే. అధికారులు వారే. నిజానికి తక్కెళ్లపాడులో చేపట్టిన పైలట్‌ సర్వే ఫలితాలు విస్మయపరిచాయి. సరిగ్గా 2వేల ఎకరాలున్న గ్రామంలోనే ఆశించిన ఫలితాలు రాకుంటే రాష్ట్రమంతా పక్కాగా రీ సర్వే ఎలా చేస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఈ సందేహాలు, సమస్యలేవీ ఇప్పుడు అధికారులకు గుర్తుకు రాలేదు. ఇప్పుడు రీసర్వేలో నిత్యం సమస్యలే ఎదురవుతున్నాయి.

సోషల్‌ మీడియాలో ప్రశ్నలు

అప్పుడొకలా, ఇప్పుడొకలా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌ స్టాగ్రామ్‌ వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూముల రీ సర్వే, అసైన్డ్‌ భూముల వ్యవహారంతోపాటు... పట్టాదారు పాస్‌పుస్తకాలు, నిషేధ భూముల జాబితా, కడప, విశాఖ భూముల కుంభకోణాలను ప్రస్తావిస్తూ అధికారుల వైఖరిని సోషల్‌ మీడియాలో సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు అధికారుల పేర్లను నేరుగా ప్రస్తావిస్తూ వరుస ట్వీట్లు వెలువడుతున్నాయి. ఈ పరిణామం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటి వరకు రాజకీయ నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం చూశాం. కానీ... తొలిసారిగా అధికారులను టార్గెట్‌ చేస్తున్నారు. సోషల్‌మీడియాలో టార్గెట్‌ అయిన వారు గత ప్రభుత్వంలో సీఎంఓలో, ఇతర కీలక పదవుల్లో పనిచేసిన వారే. ‘‘ఒక అధికారి తమ వద్ద ఎలా పనిచేశారు? తమ రాజకీయ ప్రత్యర్థి వద్ద ఎలా ఉన్నారన్న విషయం పార్టీ లు గమనిస్తున్నాయని దీంతో స్పష్టమవుతోంది’’ అని పరిపాలనా రంగ నిపుణుడు రామయ్య అభిప్రాయపడ్డారు.

Updated Date - 2022-11-21T03:37:52+05:30 IST

Read more