Indrakiladri: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనార్థం పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2022-10-05T18:31:18+05:30 IST

ఇంద్రకీలాద్రి (Indrakiladri)పై దుర్గమ్మ దర్శనార్థం భక్తులు (devotees) పోటెత్తారు. రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో భక్తులకు దుర్గమ్మ దర్శనమిచ్చారు.

Indrakiladri: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనార్థం పోటెత్తిన భక్తులు

విజయవాడ: ఇంద్రకీలాద్రి (Indrakiladri)పై దుర్గమ్మ దర్శనార్థం భక్తులు (devotees) పోటెత్తారు. రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో భక్తులకు దుర్గమ్మ దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనార్థం వేలాదిగా భవానీ భక్తులు తరలివస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి 5 గంటలకుపైగా సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఉచిత దర్శనాలు కల్పిస్తున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు చండీహోమం, పూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు జమ్మిదొడ్డి నుంచి దుర్గామల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా దుర్గాఘాట్‌కు తీసుకెళ్తారు. అక్కడ ఉన్న హంసవాహనంపై పూజలు చేస్తారు. వరద ఉధృతి కారణంగా నదీ విహారాన్ని రద్దు చేశారు. ఈ ఏర్పాట్లను కలెక్టర్‌ దిల్లీరావు, కమిషనర్‌ కాంతిరాణా, ఈవో భ్రమరాంబ, రివర్‌ కన్జర్వేటర్‌ కృష్ణారావు పరిశీలించారు. తెప్పోత్సవంలో వేదపండితులు, అర్చకులు, అధికారులు, ప్రజాప్రతినిధులే పాల్గొంటారు. భక్తులను అనుమతించబోరు.


భారీగా చేరుతున్న భవానీలు

భవానీ మాలధారుల రాకతో ఇంద్రకీలాద్రిపై రద్దీ బాగా పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భవానీ భక్తులు ఘాట్ల వద్ద స్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు. గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర, కర్నాటక, ఒడిశా నుంచి భవానీలు అధిక సంఖ్యలో వస్తున్నారు. మొత్తంగా దసరా నాటికి 5 లక్షల మంది భవానీలు వస్తారని అంచనా. వందల కిలోమీటర్ల దూరం నుంచి విజయవాడ వచ్చే భవానీలతో 16వ నెంబరు జాతీయ రహదారి ఎరుపెక్కింది. చాలామంది కాలినడకన, కొంతమంది సైకిళ్లు, మోటార్‌ సైకిళ్లపై వస్తున్నారు. నడిచి వచ్చే వారిలో మహిళలు, పిల్లలు కూడా అధికంగా ఉన్నారు. కాళ్లు నొప్పులు, బొబ్బలు కట్టినా లెక్కచేయకుండా దీక్షగా ముందుకు సాగారు. మార్గంమధ్యలో దేవాలయాలను దర్శించుకున్నారు. 

Updated Date - 2022-10-05T18:31:18+05:30 IST