అమరావతినే.. ఏకైక రాజధానిగా ప్రకటించండి

ABN , First Publish Date - 2022-12-13T03:25:05+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగుతుందని ప్రకటించాలని ప్రధాని మోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు టీడీపీపీ నేత గల్లా జయదేవ్‌ విజ్ఞప్తి చేశారు.

అమరావతినే.. ఏకైక రాజధానిగా ప్రకటించండి

మూడేళ్లుగా రాజధాని రైతుల నిరసన

పోలవరం సవరించిన అంచనాలను ఆమోదించండి

విభజన హామీలను అమలు చేయండి.. ప్రధానికి గల్లా వినతి

న్యూఢిల్లీ, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగుతుందని ప్రకటించాలని ప్రధాని మోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు టీడీపీపీ నేత గల్లా జయదేవ్‌ విజ్ఞప్తి చేశారు. అమరావతిలో అన్ని అభివృద్ధి ప్రాజెక్టులూ నిలిచిపోయినందున.. రాజధాని అభివృద్ధికి నిధులివ్వాలని కోరారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అనుబంధ పద్దులపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘అమరావతి అభివృద్ధి కోసం 29 గ్రామాల రైతులు 33 వేల ఎకరాల భూములు ఇచ్చారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని, కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ 2019 డిసెంబరు నుంచి గత మూడేళ్లుగా రైతులు నిరసనలు తెలుపుతున్నారు. తమ హక్కుల కోసం రైతులు ఇంత సుదీర్ఘకాలంగా ఆందోళన సాగించడం దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అలాగే రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే రాష్ట్రం పంటలతో కళకళలాడుతుండడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తాగునీరు అందుతుంది. కాబట్టి సవరించిన పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.55,548 కోట్లకు ఆమోదం తెలపాలి. విభజన చట్టంలోని హామీల అమలుకు విధించిన పదేళ్ల గడువు పూర్తి కావస్తోంది. కాబట్టి 2024లోపు చట్టబద్ధంగా ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలి.

అందుకు వచ్చే బడ్జెట్‌ మాకు చాలా ముఖ్యం. ఐదు కోట్ల ఆంరఽధులకిచ్చిన అన్ని హామీలనూ అమలు చేయాలి’ అని అభ్యర్థించారు. ఎరువుల సబ్సిడీకి రూ.2.5 లక్షల కోట్లు అవసరమని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని అన్నారని.. బడ్జెట్‌లో రూ.1.05 లక్షల కోట్లను అందుకు కేటాయించారని, ఇప్పుడు మరో రూ.1.09 లక్షల కోట్లను ప్రతిపాదించారని, మొత్తం కలిపి రూ. 2.14 లక్షల కోట్లే అవుతాయని.. మరి మిగతా రూ.36 వేల కోట్లను ఎలా పూడ్చుతారని ప్రశ్నించారు. 60 శాతం ఎల్‌పీజీ అవసరాలను విదేశాల నుంచే దిగుమతి చేస్తున్నారని, ఆంధ్రలో 1,000 కిలోమీటర్ల తీరప్రాంతం ఉందని, ఏపీ తీరంలో 27 బిలియన్‌ క్యుబిక్‌ మీటర్ల సహజ వాయువు నిల్వలు ఇంకా వెలికి తీయాల్సి ఉందని ప్రస్తావించారు. దిగుమతులు తగ్గించడానికి కాకినాడ-వైజాగ్‌-శ్రీకాకుళం.. కాకినాడ-విజయవాడ- నెల్లూరు గ్యాస్‌ పైపులైన్‌ ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరారు.

Updated Date - 2022-12-13T03:25:06+05:30 IST