అనంత ఎస్పీ నుంచి ప్రాణహాని

ABN , First Publish Date - 2022-09-08T08:21:11+05:30 IST

అనంత ఎస్పీ నుంచి ప్రాణహాని

అనంత ఎస్పీ నుంచి ప్రాణహాని

డీఐజీకి డిస్మిస్డ్‌ ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఫిర్యాదు 


అనంతపురం క్రైం, సెప్టెంబరు 7: అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప నుంచి తనకు, తన పిల్లలకు, సాక్ష్యం చెప్పిన మహిళ లక్ష్మికి ప్రాణాపాయం ఉందని డిస్మిస్డ్‌ ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో అనంతపురం రేంజ్‌ డీఐజీ రవిప్రకాశ్‌ను బుధవారం కలిసి.. ఎస్పీ ఫక్కీరప్ప, ఏఆర్‌ ఏఎస్పీ హనుమంతు, సీసీఎస్‌ డీఎస్పీ మహబూబ్‌బాషాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రకాశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. డీఐజీ రవిప్రకాశ్‌ తనకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటారనే నమ్మకం ఉందని, ఖచ్చితంగా వారిని అరెస్ట్‌ చేస్తారని, ఉద్యోగం నుంచి తొలగిస్తారని అన్నారు. ఎస్పీ ఫక్కీరప్పపై రూ. కోట్లు దోచుకోవడం, కల్లు దుకాణం, పేకాట కేంద్రాల ద్వారా అక్రమ సంపాదన ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. వాటి సమాచారం సేకరించి డీఐజీ సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని, తాను పెట్టిన కేసు నుంచి తప్పించుకోవడానికి అనంతపురం టూటౌన్‌ పోలీసులను కర్ణాటకలోని ఎస్పీ సొంత ఊరుకు, ఏఎస్పీ సొంత ఊరు పుంగనూరుకు పంపి క్యాస్ట్‌ సర్టిఫికెట్లు తెప్పించుకున్నారని ఆరోపించారు. కర్ణాటకలో ఎస్పీ ఫక్కీరప్ప కులం ఎస్టీ అని, ఏపీలో ఆయన బీసీ కిందకు వస్తారని తెలిపారు. తాను పెట్టిన కేసులో సాక్షిగా ఉన్న లక్ష్మిని పోలీసులు టార్గెట్‌ చేస్తున్నారని ప్రకాశ్‌ తెలిపారు.  తాను పది కేసుల్లో నిందితుడినని, వాటిని పరిగణనలోకి తీసుకుని తనను ఉద్యోగం నుంచి తొలగించామని అడిషనల్‌ ఎస్పీ నాగేంద్రుడు చెప్పారని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఓ ప్రముఖ రాజకీయనాయకుడు 30 కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని, ఆయనను అధికారం నుంచి తొలగించకుండా పోలీసు అధికారులు, న్యాయస్థానాలు ఎందుకు సెల్యూట్‌ కొడుతున్నాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో 358 మంది కానిస్టేబుళ్లను తప్పుడు కేసుల కారణంగా డిస్మిస్‌ చేశారని ప్రకాశ్‌ ఆరోపించారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ను కాపాడేందుకు ఎస్పీ ఫకీరప్ప చొరవచూపుతుండడం బాధాకరమని అన్నారు. 

Read more