పగటిపూటే పరిశ్రమలు నడపాలి

ABN , First Publish Date - 2022-04-10T08:31:44+05:30 IST

ఈ నెలాఖరుదాకా రాష్ట్రంలో కరెంటు కష్టాలు తప్పవని ఇంధన శాఖ కార్యదర్శి బీ శ్రీధర్‌ అన్నారు.

పగటిపూటే పరిశ్రమలు నడపాలి

గృహ విద్యుత్తుకు రోజుకు గంట కోత.. ఇంధన శాఖ వెల్లడి

అమరావతి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): ఈ నెలాఖరుదాకా రాష్ట్రంలో కరెంటు కష్టాలు తప్పవని ఇంధన శాఖ కార్యదర్శి బీ శ్రీధర్‌ అన్నారు. వ్యవసాయానికి మూడున్నర నుంచి నాలుగున్నర గంటల పాటు మాత్రమే పగటిపూట విద్యుత్తు ఇవ్వాలన్న సీపీడీసీఎల్‌ ఆదేశాలను నిలిపివేసి.. పగటిపూట నిరంతరాయంగా ఏడుగంటల పాటు విద్యుత్తు సరఫరా చేయాలని ఆదేశించామని తెలిపారు. ‘‘శుక్రవారం ఏకంగా రికార్డు స్థాయి లో 240 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ ఉంది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో అదే రోజున 260 మిలియన్‌ యూనిట్ల దాకా విద్యుత్తు డిమాండ్‌ ఉంది. గృహాలకు రోజుకు గంట సేపు విద్యుత్తు కోతను అమలు చేస్తాం.


పరిశ్రమలు  ఆదివారం ఎలాగూ సెలవు ఇస్తాయి. మిగిలిన ఆరు రోజుల్లో ఒకరోజు హాలీడే ప్రకటించాలి. పరిశ్రమలు పగటిపూటే నడపడం వల్ల 15 నుంచి 20 మిలియన్‌ యూనిట్ల దాకా విద్యుత్తు ఆదా అవుతుంది’’ అని వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లోనూ విద్యుత్తు సంక్షోభం తీవ్రస్థాయిలో ఉందని శ్రీధర్‌ వెల్లడించారు. ఇప్పటివరకు రూ.1,258 కోట్లు చెల్లించి 1551 మిలియన్‌ యూనిట్లు పవర్‌ ఎక్ఛ్సేంజీలో కొనుగోలు చేశాం. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఉంది. దీంతో రాష్ట్ర ఽథర్మల్‌ విద్యుత్కేంద్రాలకు ఏరోజుకారోజు బొగ్గు సరఫరా అవుతోంది. అయితే..ఈ నెలాఖరు నాటికి వ్యవసాయ అవసరాలకు వినియోగం తగ్గి.. విద్యుత్తు తిరిగి అందుబాటులోకి వస్తుంది’’ అని శ్రీధర్‌ తెలిపారు. 

Read more