డ్యాంలు.. యమ డేంజర్‌!

ABN , First Publish Date - 2022-05-18T07:51:25+05:30 IST

శ్రీశైలం, నాగార్జున సాగర్‌, పులిచింతల జలాశయాలకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని..

డ్యాంలు.. యమ డేంజర్‌!

శ్రీశైలం స్పిల్‌ వే వద్ద 40 మీటర్ల లోతున గుంత

తక్షణమే పూడ్చకుంటే తీవ్ర నష్టం

రూ.800 కోట్లు ఖర్చవుతుంది

సాగర్‌లో భారీగా సీపేజ్‌ రంధ్రాలు

కుడి కాలువ గేట్లు కూడా దెబ్బతిన్నాయి

పులిచింతలలో నిర్వహణ లోపం

గేటు దెబ్బతిని ఏడాదైనా రిపేర్‌ చేయలేదు

శ్రీశైలంలో ముందుచూపు లేకుండా 

విద్యుదుత్పత్తి.. దీంతో తాగునీటికి కటకట 

కేఆర్‌ఎంబీ ఆగ్రహం


అమరావతి, మే 17 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం, నాగార్జున సాగర్‌, పులిచింతల జలాశయాలకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలను కృష్ణా నదీ యాజమాన్య సంస్థ (కేఆర్‌ఎంబీ) హెచ్చరించింది. తక్షణమే వీటికి మరమ్మతులు చేయకుంటే తీవ్ర నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేసింది. ఈ నెల 6వ తేదీన జరిగిన 16వ సర్వసభ్య సమావేశం ఎజెండా అంశాలను బోర్డు మంగళవారం విడుదల చేసింది. ఈ మూడు రిజర్వాయర్లలో నిర్వహణ లోపాలు భారీగా ఉన్నాయని తెలిపింది. ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా..


ముందుచూపు లేకుండా ఇబ్బడిముబ్బడిగా జల విద్యుత్‌ ఉత్పత్తి చేయడంతో శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు పడిపోయి.. తాగునీటికి కటకటలాడాల్సిన పరిస్థితి కనిపిస్తోందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ ఏడాది మార్చి 24 నాటికి 803.4 అడుగుల ఎత్తులో.. కేవలం 30.70 టీఎంసీల నిల్వ మాత్రమే ఉందని పేర్కొంది. ప్రస్తుత నీటి సంవత్సరంలో 1,092 టీఎంసీల జలాలు వచ్చినా.. నిర్వహణ లోపం కారణంగా 30.70 టీఎంసీలే మిగిలాయని ఆక్షేపించింది. పైగా జలాశయం స్పిల్‌ వే వద్ద 40 మీటర్ల మేర గుంత పడిందని.. తక్షణమే పూడ్చాలని రెండు రాష్ట్రాల జల వనరుల అధికారులకు స్పష్టం చేసింది. ఇందుకోసం రూ.800 కోట్ల దాకా వ్యయమవుతుందని తెలిపింది. నాగార్జున సాగర్‌కు కూడా ముప్పు పొంచి ఉందని.. సీపేజ్‌ రంధ్రాలు భారీగా ఏర్పడ్డాయని, కుడి కాలువ గేట్లు దెబ్బతిన్నాయని వెల్లడించింది. పులిచింతల ప్రాజెక్టు గేటు గత ఏడాది దెబ్బతిందని.. దానిని ఇప్పటికీ మరమ్మతు చేయకపోవడంపై ఆంధ్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. ఈ ప్రాజెక్టుకు కూడా దీర్ఘకాలిక యాజమాన్య నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది.  


కేఆర్‌ఎంబీ విశాఖకు తరలడంపై సందిగ్ధత..

రాష్ట్ర విభజన తర్వాత జీఆర్‌ఎంబీ ప్రధాన కార్యాలయం తెలంగాణలో, కేఆర్‌ఎంబీ ఏపీలోనూ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. కేఆర్‌ఎంబీ మాత్రం విజయవాడలో కావాలని కోరింది. కేఆర్‌ఎంబీ ఆంధ్రకు తరలించాలనడంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనివల్ల తమ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చా క పరిపాలనా రాజధాని విశాఖకు తరలివెళ్లనుందని.. అందువల్ల కేఆర్‌ఎంబీ ప్రధా న కార్యాలయం అక్కడే ఏర్పాటు చేయాలని రాష్ట్ర జల వనరుల శాఖ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు కేఆర్‌ఎంబీ కూడా మొగ్గు చూపింది. ప్రస్తుతం రాజధాని పై స్తబ్ధత నెలకొనడంతో.. కేఆర్‌ఎంబీ తరలింపుపై మరోసారి చర్చించనున్నారు.

Read more