దసరాకూ కందిపప్పు కట్‌!

ABN , First Publish Date - 2022-10-03T09:21:36+05:30 IST

దసరా పండగకూ పేదలకు కందిపప్పు, పంచదార ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. సెప్టెంబరు నెలలో వినాయక చవితి పండగకు రేషన్‌ షాపుల్లో రాయితీపై ఇవ్వాల్సిన కందిపప్పు, పంచదార ఇవ్వలేదు. ఇప్పుడు దసరాకూ పంపిణీ చేసేది సందేహమే.

దసరాకూ కందిపప్పు కట్‌!

అక్టోబరు కోటాలో పేదలకు సరఫరా డౌటే 

పంచదార పంపిణీదీ అదే పరిస్థితి 

2 నెలలుగా సబ్సిడీపై అందని సరుకులు 

కాంట్రాక్టర్లకు కోట్లలో బకాయిలు 

టెండర్లు పిలిచినా స్పందన కరువు

గోదాముల్లో నిండుకున్న నిల్వలు 


(ఆంధ్రజ్యోతి - అమరావతి) : దసరా పండగకూ పేదలకు కందిపప్పు, పంచదార ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. సెప్టెంబరు నెలలో వినాయక చవితి పండగకు రేషన్‌ షాపుల్లో రాయితీపై ఇవ్వాల్సిన కందిపప్పు, పంచదార ఇవ్వలేదు. ఇప్పుడు దసరాకూ పంపిణీ చేసేది సందేహమే. అక్టోబరు నెల కోటా కింద కిలో రూపాయి బియ్యం మాత్రమే పంపిణీ చేయనున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంక్రాంతి, రంజాన్‌ పండగలకు కార్డుదారులందరికీ ఉచితంగా రేషన్‌ సరుకులు పంపిణీ చేసేవారు. అలాగే ప్రతి పండగకు రేషన్‌కార్డుదారులందరికీ బియ్యం, కందిపప్పు, పంచదార, గోధుమపిండి, జొన్నలు, రాగులు తదితర నిత్యావసర సరుకులను సగం రాయితీపై అందించేవారు. దాంతో ప్రతి పండగను నిరుపేదలు కూడా ఆనందంగా జరుపుకొనేవారు. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం రేషన్‌ బియ్యం మినహా మిగిలిన అన్ని సరుకులకు మంగళం పాడుతూ పేదల నోట్లో మట్టి కొడుతోందంటూ విమర్శలు వస్తున్నాయి. 


పేరుకుపోయిన బకాయిలు 

రాష్ట్రంలో ఉన్న 1.45 కోట్ల రేషన్‌కార్డుదారులకు కిలో రూపాయి బియ్యంతో పాటు ప్రతి నెలా కేజీ కందిపప్పు, అరకేజీ పంచదారను ప్యాకెట్లలో సరఫరా చేయాల్సి ఉంది. కందిపప్పు, పంచదారను ప్యాకెట్లలో సరఫరా చేసేందుకు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఇ-ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా స్వల్పకాలిక టెండర్లు పిలుస్తోంది. గత కొంతకాలంగా కందిపప్పును నాఫెడ్‌ ద్వారా సేకరిస్తున్నది. ఇప్పటి వరకు పంచదార సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయి. దీంతో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ పలుమార్లు టెండర్లు ఆహ్వానిస్తున్నా పంచదార సరఫరా చేసే కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. బిల్లులు వస్తాయో రావోనన్న భయంతో కాంట్రాక్టర్లు బిడ్లు దాఖలు చేయడం లేదు. సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌కు కందిపప్పును సరఫరా చేస్తున్న నాఫెడ్‌ పరిస్థితి కూడా ఇదేనని చెబుతున్నారు. 


రెండు నెలలుగా బంద్‌

గత మూడు నెలల్లో నాలుగైదుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో పౌర సరఫరాల సంస్థకు చెందిన మండల స్థాయి నిల్వ కేంద్రాల్లో పంచదార, కందిపప్పు నిల్వలు నిండుకున్నాయి. దీంతో గత రెండు నెలలుగా కందిపప్పు, పంచదార కోటాను సక్రమంగా పంపిణీ చేయట్లేదు. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో సబ్సిడీ ధరకు కందిపప్పు, పంచదారను కార్డుదారులందరికీ సరఫరా చేయకపోవడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతకాలంగా బహిరంగ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో కందిపప్పు రూ.120 నుంచి రూ.140 వరకు, పంచదార కిలో రూ.40కి పైగా అమ్ముతున్నారు. రేషన్‌ షాపుల ద్వారా అయితే సబ్సిడీపై పేదలకు కిలో కందిపప్పు రూ.67కు, పంచదార రూ.20కు లభించేవి. 


ఆరు నెలలుగా అరకొర పంపిణీ 

రాష్ట్రంలోని 1.45 కోట్ల రేషన్‌కార్డుదారులకు కిలో చొప్పున నెలకు 14 వేల టన్నుల కందిపప్పును సరఫరా చేయాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ దగ్గర 1800 టన్నుల కందిపప్పు మాత్రమే అందుబాటులో ఉంది. దీనిని కార్డుదారులకు ఎలా పంపిణీ చేయాలో అర్థంకాక సివిల్‌ సప్లయిస్‌ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గత ఆరు నెలలుగా 50 శాతం కార్డులకు కూడా కందిపప్పు ఇవ్వడం లేదు. దసరా పండగ నేపథ్యంలో ఈ అక్టోబరు నెలలో కనీసం సగం మంది కార్డుదారులకైనా పంచదార, కందిపప్పు అందించేందుకు సరుకును సరఫరా చేయాలని కాంట్రాక్టర్లతో మంతనాలు జరుపుతున్నారు. కాంట్రాక్టర్లకు పాత బకాయిలు కొంత చెల్లించి వారి ద్వారానే అక్టోబరు  కోటాలో కందిపప్పు, పంచదారను సరఫరా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పంచదార, కందిపప్పు కోసం ఇప్పుడు డీలర్లు డీడీలు కట్టినా దసరా పండగకు కార్డుదారులకు అందించడం కష్టమే.  

Read more