సీపీఎస్‌ను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-05-18T08:33:53+05:30 IST

పదో తరగతి స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రాల ఎదుట ఉపాధ్యాయులు పెద్దఎత్తున నిరసనలు తెలిపారు.

సీపీఎస్‌ను రద్దు చేయాలి

పాఠశాలల విలీనం ఆపాలి

టెన్త్‌ స్పాట్‌ కేంద్రాల ఎదుట ఉపాధ్యాయుల నిరసనలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): పదో తరగతి స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రాల ఎదుట ఉపాధ్యాయులు పెద్దఎత్తున నిరసనలు తెలిపారు. ఫ్యాప్టో పిలుపు మేరకు విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడికక్కడ ధర్నాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్పాట్‌ కేంద్రాల ఎదుట మంగళవారం ఆందోళనలు కొనసాగాయి. వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా ధర్నాల్లో పాల్గొన్నారు. జగన్‌రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులకు కల్పిస్తామన్న సౌకర్యాలను అధికారంలోకి వచ్చాక విస్మరించడం తగదని కర్నూలు జిల్లాలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు కర్నూలు జిల్లాలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మచిలీపట్నంలోని స్పాట్‌ కేంద్రం ఎదుట మోకాళ్లపై కూర్చుని ఎస్‌టీయూఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్‌.తిమ్మన్న, ఫ్యాప్టో నేతలు నిరసనలు తెలిపారు. ఆప్టా రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.ప్రకాశ్‌రావు కర్నూలులో, బీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్‌రావు ప్రకాశం జిల్లాలో, స్కూల్‌ అసిస్టెంట్ల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు శౌరిరాయలు గుంటూరులో, ప్రధాన కార్యదర్శి నరోత్తంరెడ్డి చిత్తూరులో, ఎస్‌టీయూ అధ్యక్షుడు సాయి శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ ఏలూరులో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లైనా సీపీఎస్‌ రద్దు చేస్తామన్న హామీని అమలు చేయలేదని విమర్శించారు. ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతుల విద్యార్థులను ఉన్న త పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల పేద, బడుగు, బలహీనవర్గాల పిల్లలు చదువులకు దూరమవుతారన్నారు. స్పాట్‌ వాల్యుయేషన్‌ రేట్లు పెంచాలని, జూన్‌లో బదిలీలు, పదోన్నతులు చేపట్టాలన్నారు. ఏలూరు, మచిలీపట్నంలలో స్పాట్‌ కేంద్రాల వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. 


సీపీఎస్‌ రద్దు చేసి.. ‘గడప’కు రండి 

సీపీఎ్‌సను రద్దు చేసి.. గడపగడపకు  రావాలని ఓ టీచర్‌ ఇంటి ముందు బోర్డు ద్వారా ప్రజాప్రతినిధులకు స్పష్టం చేశా రు. నంద్యాల జిల్లా డోన్‌ పట్టణం కొత్తపేటలో నివాసముంటున్న చిన్నపరెడ్డి ఎస్టీ యూ సీపీఎస్‌ సాధన జిల్లా కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఇంటి ముందు పెట్టిన బోర్డు ఆవేదనను వెల్లడిస్తోంది.

Read more