చట్ట సవరణ తర్వాతే సహకార ఎన్నికలు!

ABN , First Publish Date - 2022-09-13T08:44:50+05:30 IST

చట్టసవరణలు చేశాకే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది.

చట్ట సవరణ తర్వాతే సహకార ఎన్నికలు!

  • వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లులు
  • పీఏసీఎస్‌ల్లో క్రమం తప్పకుండా ఆడిటింగ్‌
  • థర్డ్‌ పార్టీతో స్వతంత్ర విచారణ
  • ఆప్కాబ్‌, డీసీసీబీల్లో నిపుణుల నియామకం
  • బోర్డుల్లో మూడో వంతు డైరెక్టర్లు వారే
  • ప్రతి రెండున్నరేళ్లకు సగం మంది విరమణ
  • సంఘాల్లోకి వ్యవసాయ సహాయకులు
  • పలు మార్పులకు ప్రభుత్వ ప్రతిపాదనలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి): చట్టసవరణలు చేశాకే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. పర్సన్‌ ఇన్‌చార్జి కమిటీల గడువును వచ్చే జనవరి వరకు పొడిగించినందున ఈలోగా సహకార చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. సహకార వ్యవస్థలో అనేక మార్పులను ప్రతిపాదించింది. ఈ నెల 15 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సవరణ బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా 45ు పీఏసీఎ్‌సలు, పలు డీసీసీబీలు బాగా నష్టాల్లో ఉండటం, సగం మండలాలకు డీసీసీబీల నెట్‌వర్క్‌ అనుసంధానం కాకపోవడం వల్ల రుణాలు ఎక్కువగా ఇవ్వలేకపోతున్నామని అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. అందువల్ల చట్టానికి కొన్ని సవరణలు చేసేందుకు సహకార అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎ్‌స)ల్లో క్రమం తప్పకుండా ఆడిటింగ్‌ జరపాలని.. రిపోర్టుల్లో వ్యత్యాసం కనిపిస్తే, థర్డ్‌పార్టీతో స్వతంత్రంగా విచారణ చేయించాలని.. ఇందుకోసం ఆప్కాబ్‌, డీసీసీబీల్లో నిపుణులను నియమించాలని.. వ్యవసాయ, బ్యాంకింగ్‌, ఆర్థిక అకౌంటెన్సీల్లో నిపుణులైన వారిని బోర్డుల్లోకి తీసుకోవాలని ప్రతిపాదిస్తున్నారు. ఆప్కాబ్‌, డీసీసీబీ, పీఏసీఎస్‌ బోర్డుల్లో మూడింట ఒక వంతు మంది నిపుణులను డైరెక్టర్లుగా నియమించాలని, సగం మంది ప్రతి రెండున్నరేళ్లకు విరమించేలా చట్ట సవరణ చేయాలని భావిస్తున్నారు. గ్రామ సచివాలయల్లోని వ్యవసాయ సహాయకులను పీఏసీఎస్‌ సభ్యులుగా తీసుకురావడం.. సహకార రంగంలో సమగ్ర బ్యాంకింగ్‌ సేవల కోసం ఆప్కాబ్‌, డీసీసీబీలు, పీఏసీఎ్‌సలను వచ్చే నెలలో కంప్యూటరీకరణ చేయడం.. వచ్చేఏడాది నుంచి క్రెడిట్‌ సేవలతో పాటు నాన్‌ క్రెడిట్‌ సేవలు కూడా అందించడం.. పీఏసీఎ్‌సల నెట్‌వర్క్‌ను మరింత విస్తరించడం.. ప్రతి మూడు ఆర్బీకేలకు  ఒక పీఏసీఎ్‌సను అనుసంధానం చేయడం.. డీసీసీబీల్లో రుణాలు ఎవరికి, ఎలా ఇవ్వాలనే దానిపై నిర్దిష్ట విధానాలు (ఎస్‌వోపీ) రూపొందించడం.. సహకార బ్యాంకుల మార్కెట్‌ షేర్‌ను 20ు పెంచడం.. ఆర్బీకేలకు ఆర్థికంగా అండగా ఉండేలా, ఫుడ్‌ ప్రొసెసింగ్‌ చేసే ఎంఎ్‌సఎంఈలకు దన్నుగా ఉండేలా డీసీసీబీ రుణ ప్రణాళికలు రూపొందించడానికి అవసరమైన సవరణలు చేపట్టాలని ప్రభుత్వ పెద్దలు ప్రతిపాదించినట్లు సమాచారం.


ఎమ్మెల్యేల చేతికి డిఫాల్టర్స్‌ జాబితాలు!

ప్రభుత్వం ఓవైపు సహకార చట్టాల సవరణలకు సన్నాహాలు చేస్తుంటే.. మరో వైపు అధికారులు సహకార ఎన్నికల ప్రక్రియకు చర్యలు చేపట్టారు. సహకార సంఘాల్లో ఎంత మంది అర్హులైన ఓటర్లున్నారు.. కొవిడ్‌ సమయంలో ఎంత మంది సభ్యులు మరణించారు.. పీఏసీఎ్‌సల్లో పంట రుణాలు, ఇతరత్రా రుణాలు తీసుకున్న వారిలో సకాలంలో రుణాలు చెల్లించని డిఫాల్టర్స్‌ ఎంత మంది అనే వివరాలను సేకరిస్తున్నారు. ఇందుకోసం ఒక ప్రొఫార్మాను రూపొందించి క్షేత్రస్థాయి అధికారులకు పంపిన ఉన్నతాధికారులు.. డిఫాల్టర్స్‌ జాబితాలను స్థానిక ఎమ్మెల్యేలకు అందజేయాలని డివిజనల్‌ సహకార అధికారులను ఆదేశించినట్లు సమాచారం. డిఫాల్టర్స్‌తో క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించి రుణాలు వసూలు చేయడం.. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ స్కీమ్‌ను తెచ్చేందుకు డిఫాల్టర్స్‌ జాబితాలను ఎమ్మెల్యేలకు ఇవ్వాలని ఉన్నత స్థాయిలో నిర్ణయించినట్లు చెబుతున్నారు.


అయితే డిఫాల్టర్స్‌కు ఓటు హక్కు తొలగించేందుకు రాజకీయంగా వ్యూహాలు రూపొందించేందుకు ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యేలకు డిఫాల్టర్స్‌ జాబితాలు ఇవ్వనున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కాగా.. సహకార ఎన్నికలు నిర్వహించే క్రమంలో హెచ్‌ఆర్‌ పాలసీ ప్రకారం పీఏసీఎస్‌ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బదిలీలకు సంబంధించిన ఉద్యోగుల జాబితాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈనెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సమాచారం. అయితే పీఏసీఎస్‌ ఉద్యోగుల బదిలీలకు కూడా చట్ట సవరణ అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. కేవలం జీవో ద్వారా హెచ్‌ఆర్‌ పాలసీ తెచ్చి, ఉద్యోగుల బదిలీలు చేపట్టడం చట్టరీత్యా సాధ్యం కాదని చెబుతున్నారు. 

Read more