రేపే చలో సీఎంవో

ABN , First Publish Date - 2022-04-24T09:22:06+05:30 IST

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎ్‌స)ను తక్షణం రద్దు చేయాల్సిందేనని..

రేపే చలో సీఎంవో

సీపీఎస్‌ రద్దు చేయాల్సిందే.. ఎన్నికల హామీని జగన్‌ నిలబెట్టుకోవాలి

కమిటీలతో కాలయాపన చేయడం తగదు: యూటీఎఫ్‌


విజయవాడ, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎ్‌స)ను తక్షణం రద్దు చేయాల్సిందేనని ఏపీ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.వెంకటేశ్వర్లు, కేఎ్‌సఎస్‌.ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ రద్దు కోసం తమ పోరాటంలో భాగంగా ఈ నెల 25న సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. శనివారం విజయవాడలో వారు విలేకరులతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎ్‌సను రద్దు చేస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్‌రెడ్డి.. మూడేళ్లయినా రద్దు చేయటం లేదన్నారు. సీపీఎస్‌ రద్దు కోసం కమిటీలు, సమావేశాల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. సీపీఎ్‌సపై చర్చలు జరుపుతామని తేదీలు కూడా ప్రకటించారని, ఆతర్వాత చర్చల కోసం సమావేశాల తేదీలను పదేపదే వాయిదా వేస్తూ చివరికి ఆ సమావేశాన్నే రద్దు చేశారని తెలిపారు. రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ర్టాలు సీపీఎ్‌సను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తున్నట్టు ప్రకటించాయన్నారు. ఆ రాష్ర్టాల్లో కూడా ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నాయని, అయినప్పటికీ ఉద్యోగుల ప్రయోజనాల రీత్యా సీపీఎ్‌సను రద్దు చేసినట్టు చెప్పారు. సీపీఎస్‌ రద్దు కోసం ఏప్రిల్‌ 18న రాష్ట్రం నలుమూలల నుంచి ప్రారంభమైన బైక్‌ ర్యాలీలు ఏప్రిల్‌ 25 నాటి కి విజయవాడ చేరుకుంటాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా.. బైక్‌ ర్యాలీలు విజయవాడ చేరుకునేలోపు సీపీఎ్‌సను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాలన్నారు. లేనిపక్షంలో ఏప్రిల్‌ 25న సీఎంఓను ముట్టడిస్తామని చెప్పారు.


ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డిసహా యూటీఎఫ్‌ నాయకులు అరెస్టు

దర్శి, పాలకోడేరు, ఏప్రిల్‌ 23: సీపీఎ్‌సను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ‘పోరుగర్జన’ బైక్‌ ర్యాలీని దర్శిలో శనివారం పోలీసులు అడ్డుకున్నారు.  ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, యుటీఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, యూటీఎఫ్‌ పత్రిక సంపాదకులు బాబురెడ్డి సహా యూటీఎఫ్‌ నాయకులు, ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు అక్కడే ఉంచి, ఆతర్వాత 21 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేసి తహశీల్దార్‌ వద్ద హాజరుపరిచారు.


ఇచ్ఛాపురం ర్యాలీని మోగల్లులో అడ్డుకున్న పోలీసులు

శ్రీకాకుళం జిల్లా రాష్ట్ర సరిహద్దున ఉన్న ఇచ్ఛాపురం నుంచి ఈ నెల 18న ప్రారంభమైన ‘పోరుగర్జన’ మోటార్‌ సైకిల్‌ ర్యాలీ శనివారం పశ్చిమ గోదావరి జిలా మోగల్లు చేరుకుంది. 50 మందికిపైగా పాల్గొన్న ఈ ర్యాలీని మోగల్లులో పోలీసులు అడ్డుకున్నారు.  

Updated Date - 2022-04-24T09:22:06+05:30 IST