వైసీపీపై ఈసీకి ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-10-11T09:44:04+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు అధికార వైసీపీ ఓటర్ల జాబితాను తారుమారు చేస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేశ్‌ నాయుడు ఆరోపించారు. విజయవాడలోని రాష్ట్ర బీజేపీ

వైసీపీపై ఈసీకి ఫిర్యాదు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడ్డగోలు విజయానికి వలంటీర్లతో ప్రయత్నాలు

జగన్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత: నాగోతు రమేశ్‌


అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు అధికార వైసీపీ ఓటర్ల జాబితాను తారుమారు చేస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేశ్‌ నాయుడు ఆరోపించారు. విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘వలంటీర్ల ద్వారా అడ్డదారిలో గెలిచేందుకు ప్రయత్నిస్తోన్న వైసీపీపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు బీజేపీ తరఫున ఫిర్యాదు చేయబోతున్నాం. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ చర్య తీసుకోకపోతే జాతీయ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం. ఇంటా.. బయటా.. ప్రతి చోటా వ్యతిరేకత మూటగట్టుకున్న ముఖ్యమంత్రి జగన్‌ను ఓటర్లు విశ్వసించే అవకాశమే లేదు. ఎన్నికల ముందు అమరావతి ఒక్కటే రాజధాని అంటూ మద్దతిచ్చి ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో మోసం చేసిన జగన్‌ను కోస్తాలో, తన అనుయాయులతో భూ కబ్జాలు, దోపిడీకి తెరలేపిన విశాఖలో, కనీసం తాగునీరు కూడా సరిగా అందించలేనందుకు రాయలసీమలో ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు, ప్రజలపై అక్కసు, ప్రగతి విధ్వంసం వైసీపీ నైజం.


ఉత్తుత్తి రాజీనామాతో డ్రామాలాడుతోన్న మంత్రి ధర్మాన ప్రసాదరావుకు దమ్ముంటే స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేయాలి. ఉత్తరాంధ్రలోని తన పార్టీ ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి ఉద్దేశ పూర్వకంగా రెచ్చగొడుతున్నారు. అమరావతి రాజధాని విషయంలో రాష్ట్ర ప్రజలకు బీజేపీ శ్రీరామరక్షగా నిలుస్తుంది. గ్రామాలకు ప్రధాన సేవకులైన సర్పంచ్‌లను జగన్‌ బిక్షగాళ్లుగా మార్చారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న జగన్‌ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు’’ అని నాగోతు మండిపడ్డారు. 

Read more