సుబ్బారావు గుప్తాపై అట్రాసిటీ కేసు

ABN , First Publish Date - 2022-03-18T08:32:52+05:30 IST

అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ రెబల్‌గా గుర్తింపు తెచ్చుకున్న వైసీపీ నాయకుడు సుబ్బారావుగుప్తాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు..

సుబ్బారావు గుప్తాపై అట్రాసిటీ కేసు

కులంపేరుతో తిట్టాడని ఒంగోలు మేయర్‌ ఫిర్యాదు


ఒంగోలు(క్రైం), మార్చి 17: అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ రెబల్‌గా గుర్తింపు తెచ్చుకున్న వైసీపీ నాయకుడు సుబ్బారావుగుప్తాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అయితే దీని వెనుక ప్రభుత్వంలో కొందరు పెద్దల హస్తమున్నట్లు చెప్పుకొంటున్నారు. పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా బుధవారం గుప్తాతో పాటు మరికొంతమంది ఒంగోలులో మేయర్‌ గంగాడ సుజాత చాంబర్‌లోకి వెళ్లారు. ఇక్కడ పొట్టిశ్రీరాములు విగ్రహం ఉండాలి, దానికి పాలాభిషేకం చేయాలంటూ హడావుడిచేశారు.  అయితే, ఇక్కడ విగ్రహం ఉందా, అమ్మేసుకున్నారా.. అంటూ ఇష్టారీతిన దుర్భాషలాడారని, దళిత మహిళనని చెప్పినా వినకుండా తన మనసు గాయపడే విధంగా దూషణలకు దిగారని మేయర్‌ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు గుప్తాపై ఎస్సీ, ఎస్టీ కేసుతోపాటు మరో 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఒంగోలు వన్‌టౌన్‌ సీఐ సుభాషిణి గురువారం తెలిపారు. అయితే గుప్తాను కేసు లో ఇరికించడానికి గతంలో జరిగిన ఉదంతాలను స్థానికులు ప్రస్తావిస్తున్నారు. గతంలో మంత్రులు కొడాలి నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు తదితరులపై సుబ్బారావుగుప్తా ఘాటైన వ్యాఖ్యలు చేయడం, తర్వాత జగన్‌ పుట్టినరోజున కేక్‌ కటింగ్‌.. దీంతో సమస్య సద్దుమణిగి రాజీపడడం జరిగాయి. కానీ, ఇటీవలే గుప్తా వైసీపీలో రెబల్‌గా అవతారమెత్తి ఢిల్లీ జంతర్‌ మంతర్‌లో దీక్షచేయడంతోపాటు ఎంపీ రఘురామతో దోస్తీ కట్టారు. రెండు రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మంత్రి బాలినేనితో పాటు ఆయన తనయుడు ప్రణీత్‌రెడ్డిని తిట్టడమే కాకుండా వారి ఉదంతాలను చూపి స్తూ సినిమా కూడా తీస్తానని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలోనే కొందరు పెద్దలు గుప్తాను అట్రాసిటీ కేసులో ఇరికించారని తెలుస్తోంది. 

Read more