మత్స్యకార సంఘాలతో చర్చించాకే అమలు

ABN , First Publish Date - 2022-02-23T08:12:31+05:30 IST

రాష్ట్రంలోని 27,363 చెరువుల్లో 100 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన 582 చెరువులకు తప్ప, మిగిలిన చెరువులకు జీవో నంబరు-217 వర్తించదని మత్స్యశాఖ కమిషనర్‌ కె.కన్నబాబు చెప్పారు. మంగళవారం

మత్స్యకార సంఘాలతో చర్చించాకే అమలు

జీవో 217పై శాఖ కమిషనర్‌ కన్నబాబు


అమరావతి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 27,363 చెరువుల్లో 100 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన 582 చెరువులకు తప్ప, మిగిలిన చెరువులకు జీవో నంబరు-217 వర్తించదని మత్స్యశాఖ కమిషనర్‌ కె.కన్నబాబు చెప్పారు. మంగళవారం అమరావతి సచివాలయంలో ఆయ న మాట్లాడుతూ ఆ 582 చెరువుల్లో 337 చెరువులను 255 మత్స్యకార సహకార సంఘాలకు లీజుకు ఇస్తున్నామని తెలిపారు. దళారుల వల్ల మత్స్యకార సంఘాలకు ఈ చెరువుల్లోని మత్స్య సంపదపై ఆదాయం ఏడాదికి రూ.10వేలు కూడా దక్కడం లేదన్నారు.


అందుకే ఆయా సంఘాలతో చర్చించి, పారదర్శకంగా చేపల వేలం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వేలంలో మత్స్యకార సంఘాల సభ్యులు కూడా పాల్గొనవచ్చని చెప్పారు. ముందుగా నెల్లూరు జిల్లాలో 27 చెరువులను పైలట్‌ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్నామన్నారు. వీటి ఫలితాలను బట్టి తర్వాత మత్స్యకార సంఘాలతో చర్చించి, రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానం అమలుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ 27చెరువులు తప్ప, రాష్ట్రంలోని మిగిలిన చెరువుల్లో పాత పద్ధతిలో లీజు ప్రాతిపాదికన చేపలు పెంచుకుని, ఆదాయం పొందే హక్కు ఆయా మత్స్యకార సంఘాలకు ఉంటుందన్నారు. జీవో 217 వల్ల మత్స్యకార సంఘాలకు నష్టం జరుగుతుందనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రాష్ట్రంలోని మత్స్య ఉత్పత్తుల్లో 30ు స్థానికంగా వినియోగించడానికి హబ్‌ అండ్‌ స్పోక్‌ మోడల్‌ ద్వారా దేశీయ మత్స్యమార్కెట్‌ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ‘ఫిష్‌ ఆంధ్రా-ఫిట్‌ ఆంధ్రా’పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 70 ఆక్వా హబ్‌లు, 14వేల రిటైల్‌ అవుట్‌లెట్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పోషక విలువలు కలిగిన సముద్ర ఉత్పత్తులు, చెరువుల్లో పెంచే చేపలు, రొయ్యలను ఈ హబ్‌ల్లో ప్రాసెస్‌ చేసి, శుభ్రత, నాణ్యతతో ప్యాకేజ్డ్‌ ఉత్పత్తులను విక్రయించడం ద్వారా మత్స్యకారులకు అదనపు ఆదాయం దక్కేలా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.


ఉపాధి హామీ నిధులు రూ. 90.44 కోట్లతో రాష్ట్రంలో 340 ఫిష్‌ల్యాండ్‌ సెంటర్లలో మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రతిపాదించామని, రూ.86.95 కోట్లతో మంచినీళ్లపేట, చింతపల్లి, భీమిలి, రాజయ్యపేటలో ఫిష్‌ల్యాండ్‌ సెంటర్లను చేపడుతున్నట్లు చెప్పారు.  ఉప్పాడ, జువ్వలదిన్నె, మచిలీపట్నం, నిజాంపట్నంలో ఫిషింగ్‌ హార్బర్ల పనులు చేపట్టామని, మరో 5 టెండర్ల దశలో ఉన్నాయన్నారు. ఈ 9 ఫిషింగ్‌ హార్బర్లు 2023 మార్చినాటికి ప్రారంభిస్తామన్నారు. చేపల వేటలో మరణించిన జాలర్ల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం అందిస్తున్నట్లు వివరించారు. సమావేశంలో సమాచారశాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. 

Read more