-
-
Home » Andhra Pradesh » CM Jagan will present silk clothes-NGTS-AndhraPradesh
-
బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం
ABN , First Publish Date - 2022-09-26T08:32:59+05:30 IST
తిరుమలేశుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం అంగరంగ వైభవంగా అంకురార్పణ జరగనుంది. ఇందులో భాగంగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన విష్వక్సేనుడు రాత్రి 7గం టలకు ఆలయం నుంచి

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడే అంకురార్పణ
రేపు ధ్వజారోహణం, పెద్దశేష వాహన సేవ
పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
తిరుమల, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): తిరుమలేశుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం అంగరంగ వైభవంగా అంకురార్పణ జరగనుంది. ఇందులో భాగంగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన విష్వక్సేనుడు రాత్రి 7గం టలకు ఆలయం నుంచి ఊరేగింపుగా బయల్దేరి పడమర మాడవీధి నైరుతి మూలలో ఉన్న వసంత మంటపానికి వేంచేస్తారు. అక్కడ అర్చకస్వాములు నవపాలికల్లో పుట్టమన్నును సేకరించి మిగిలిన మాడవీధుల మీదుగా ఊరేగుతూ ప్రదక్షిణగా ఆలయానికి వస్తారు. యాగశాలలో కైంకర్యాలతో పాటు పాలికలలోని పుట్టమన్నులో నవధాన్యాలను మొలకెత్తింపజేసే అంకురార్పణ (బీజవాపం) ప్రక్రియను వైదికంగా నిర్వహిస్తారు. దీంతో బ్రహ్మోత్సవాలకు నాంది పలికినట్లవుతుంది. మంగళవారం సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి పెద్దశేష వాహనాలతో వాహన సేవలు ప్రారంభమవుతాయి.
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి సీఎం జగన్ పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. మంగళవారం సాయంత్రం అలిపిరికి చేరుకుని విద్యుత్ బస్సులను ప్రారంభిస్తారు. అక్కడినుంచి తిరుమలలోని పద్మావతి అతిథిగృహానికి చేరుకుంటారు. రాత్రి 7గంటలకు ఆలయానికి చేరుకుని పట్టువస్త్రాలను సమర్పించి, మూలవర్లను దర్శించుకుంటారు. ఆ తర్వాత పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు. రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు. బుధవారం ఉదయం మరోసారి శ్రీవారిని దర్శించుకుని వెంగమాంబ నిత్యాన్నప్రసాద భవనం పక్కనే నిర్మించిన నూతన పరకామణి భవనంతో పాటు బాలాజీనగర్ సమీపంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి నిర్మించిన నూతన విశ్రాంతి భవనాన్ని సీఎం ప్రారంభిస్తారు. తిరిగి పద్మావతి అతిథిగృహానికి చేరుకుని కొంతసమయం విశ్రాంతి తీసుకుని, తిరుపతికి తిరుగు ప్రయాణమవుతారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల విద్యుత్ వెలుగుల్లో కాంతులీనుతోంది. మిరుమిట్లు గొలిపే అలంకరణలతో కొండ శోభాయమానంగా కనిపిస్తోంది. భక్తులను ఆకట్టుకునేలా ప్రధాన కూడళ్లలో భారీ కటౌట్లు, రోడ్లకు ఇరువైపులా ఎల్‌ఈడీ విద్యుత్‌దీపాలంకరణ ఏర్పాటు చేశారు.