సీఎం డౌన్‌డౌన్‌!

ABN , First Publish Date - 2022-10-03T08:27:01+05:30 IST

ఓపక్క శరన్నవరాత్రులు.. అసలే ఆదివారం. ఆపైన కనకదుర్గమ్మ జన్మనక్షత్రం ‘మూల’.

సీఎం డౌన్‌డౌన్‌!

  • కనకదుర్గమ్మ భక్తుల నినాదాలు
  • దర్శనాలు ఆపడంతో ఆగ్రహం
  • మూలా నక్షత్రం.. ఆదివారం.. సరస్వతీదేవిగా దుర్గమ్మ
  • దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే క్యూలో భక్తులు
  • ఘాట్‌ రోడ్డు నుంచి 2 కి.మీ. వరకు బారులు తీరిన వైనం
  • జగన్‌ వస్తున్నారని.. గంట సేపు దర్శనాలు బంద్‌ 
  • పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి జగన్‌


కనకదుర్గమ్మ దర్శన భాగ్యం కోసం తెల్లవారుజామునే వచ్చి క్యూల్లో నిలబడ్డారు.. రెండు కిలోమీటర్ల దూరం వరకు కిక్కిరిసిపోయారు.. కడుపులో ఆహారం లేదు.. కంటి మీద కునుకు లేదు.. నిల్చుని నిల్చుని కాళ్లు పీకేస్తున్నాయి.. నీరో, పాలో తాగి క్షుద్బాధను అణచుకుంటూ.. ఒక్కో అడుగు వేస్తూ.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్డు వరకు వచ్చారు.. అంతే.. సీఎం వచ్చారు.. గంటపాటు దర్శనాలు ఆపేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ నిర్ణయం భక్తుల్లో ఆక్రోశం రేపింది. ఆవేదన రగిల్చింది. ఇక ఆలోచించలేదు.. సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలో చోటుచేసుకున్న దృశ్యమిది.


విజయవాడ, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ఓపక్క శరన్నవరాత్రులు.. అసలే ఆదివారం. ఆపైన కనకదుర్గమ్మ జన్మనక్షత్రం ‘మూల’. అమ్మను సరస్వతీదేవిగా అలంకరించారు. ఆమెను దర్శించుకోవడానికి భక్తులు శనివారం అర్ధరాత్రికే ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. శనివారం దర్శనాలు పూర్తవగానే ఆదివారం నాటి దర్శనం కోసం క్యూలన్నీ నిండిపోయాయి. మూలా నక్షత్రం రోజున ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించడానికి సీఎం జగన్‌ మధ్యాహ్నం 3గంటలకు వస్తారని అధికారులు ముందుగానే ప్రకటించారు. ఆ సమయంలో 45 నిమిషాలపాటు సాధారణ భక్తులకు దర్శనాలను నిలిపివేస్తామని చెప్పారు. తర్వాత సీఎం ప్రధాన ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నా.. దర్శనాలకు అనుమతిస్తామని సమాచారమిచ్చారు. భక్తుల కోసం వినాయకుడి ఆలయం నుంచి మూడు క్యూలు ఏర్పాటు చేశారు. ఘాట్‌రోడ్డులోని ‘ఓం’ మలుపు వద్ద వీఐపీల కోసం మరో క్యూ ఏర్పాటు చేశారు.


 సాధారణంగా నాలుగు క్యూల ద్వారా అమ్మవారి దర్శనానికి భక్తులు వెళ్తారు. ఉచిత దర్శనానికి ఒక క్యూ, రూ.100, 300, 500(వీఐపీ) టికెట్లకు వేర్వేరు క్యూలు. అయితే మూలా నక్షత్రం రోజున భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ముందే అంచనా వేసిన అధికారులు.. అన్ని క్యూలను ఉచిత దర్శనాలుగా మార్చేశారు. వికలాంగులు, వృద్ధులకు మాత్రం దర్శన సదుపాయం రద్దు చేశారు. మధ్యాహ్నం 3గంటలకు సీఎం వస్తుండడంతో అధికారులు ఒంటిగంట నుంచే ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు. రూ.500 క్యూలో ఉన్నవారిని ఇతర క్యూల్లోకి మళ్లించారు. సీఎంను స్వాగత మర్యాదలతో తీసుకెళ్లడం కోసం ఈ క్యూ బారికేడ్లను తొలగించేశారు. ముఖద్వారం నుంచి సీఎం కాన్వాయ్‌ ఆగే ప్రదేశం వరకు రెడ్‌కార్పెట్‌ వేశారు. ఆయన మరికొద్దిసేపట్లో వస్తారనగా 3.04 గంటలకు ఉచిత, రూ.100, 300 క్యూలను నిలిపివేశారు. నాలుగు నిమిషాల తర్వాత మళ్లీ దర్శనానికి అనుమతించారు. ముఖ్యమంత్రి 3.10గంటలకు ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్నారు. దీంతో ఓం మలుపు వరకు ఉన్న భక్తులను మాత్రం దర్శనానికి పంపి.. మిగతావారిని ఆపేశారు.


 సీఎం పట్టువస్ర్తాలు సమర్పించి, వేద పండితుల ఆశీర్వచనం తీసుకుని.. 3.50 గంటలకు తిరిగి తాడేపల్లికి పయనమయ్యారు. ఆయన వెళ్లిపోయినా ఇంకొంత సేపటి వరకు భక్తులను దర్శనాలకు అనుమతించలేదు. మొత్తంగా గంటపాటు క్యూ లైన్లు ముందుకు కదల్లేదు. దీంతో భక్తుల్లో ఆగ్రహం పెల్లుబికింది. సరిగ్గా జగన్‌ కాన్వాయ్‌ ఘాట్‌రోడ్డు మొదటి మలుపు తిరిగి వెళ్తున్న సమయంలో వారు సీఎం డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. అర్ధరాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నా  సాయంత్రం 4గంటల వరకు దర్శనం జరగకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. గడచిన ఏడాది కూడా భక్తులకు ఇదే ఇబ్బంది ఎదురైంది. విజయదశమి రోజున దర్శనాలకు వీఐపీలు విరామం లేకుండా రావడంతో వారు ఆగ్రహించారు. ఈసారి సాక్షాత్తూ సీఎం ఎదురుగానే ఈ నినాదాలు చేయడం గమనార్హం. నవరాత్రుల తొలిరోజు నుంచి దేవదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ, కలెక్టర్‌ దిల్లీరావు, పోలీసు కమిషనర్‌ టి.కాంతిరాణా, మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌, ఈవో భ్రమరాంబ సంయుక్తంగా నిర్ణయాలు తీసుకుని ఎలాంటి అలజడులూ లేకుండా ఉత్సవాలు నిర్వహిస్తూ వచ్చారు. రోజూ సమీక్షలు నిర్వహించుకుని.. గుర్తించిన లోపాలను సరిచేయడానికి ప్రణాళికలు రూపొందించారు. ఆదివారం పూర్తిగా వీఐపీ దర్శనాలను కట్టడి చేయడంతో క్యూలన్నీ కదులుతూనే కనిపించాయి. కానీ గంట సేపు నిలిపివేయడంతో భక్తుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది.

Read more