తిరుమలలో సీఎం

ABN , First Publish Date - 2022-09-28T08:35:27+05:30 IST

తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రి శ్రీవేంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు.

తిరుమలలో సీఎం

శ్రీవారికి పట్టువస్ర్తాల సమర్పణ

టీటీడీ 2023 కేలెండర్‌, డైరీ ఆవిష్కరణ

అనంతరం బియ్యంతో తులాభారం

అలిపిరిలో ఎలక్ట్రిక్‌ బస్సులకు శ్రీకారం


తిరుమల/తిరుపతి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రి శ్రీవేంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. తాడేపల్లి నుంచి సాయంత్రం 5.15 గంటలకు తిరుపతి విమానాశ్రయంలో దిగిన ఆయన.. అక్కడ నుంచి రోడ్డు మార్గాన తొలుత తిరుపతి చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆహ్వానం మేరకు తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి సారె సమర్పించి పూజలు జరిపారు. అటు తర్వాత అలిపిరి చేరుకుని ఎలక్ట్రిక్‌ బస్సు సర్వీసులను ప్రారంభించి.. తిరుమల పద్మావతి గృహానికి చేరుకున్నారు. కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత సంప్రదాయ వస్త్రధారణతో బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. అర్చకులు సీఎం తలకు పరివట్టం చుట్టి శేషవస్త్రాన్ని మెడలో ధరింపజేశారు. అనంతరం నూతన పట్టువస్త్రాలను తలపై పెట్టుకుని బాజాభజంత్రీల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. మూలవర్లను దర్శించుకుని బలిపీఠం, ధ్వజస్తంభానికి మొక్కుకుని రంగనాయకుల మండపం చేరుకోగా.. వేదపండితులు ఆశీర్వాదం పలికారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఈవో ధర్మారెడ్డి ఆయనకు తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా  టీటీడీ ముద్రించిన 2023 కేలెండర్‌ను, డైరీని సీఎం ఆవిష్కరించారు.


అనంతరం తన బరువుకు సమానంగా బియ్యంతో తులాభారం తూగి మొక్కు చెల్లించుకున్నారు. రాత్రి 8.50 గంటలకు వాహన మండపం చేరుకున్నారు. సీఎం అక్కడుండగానే కాసేపు విద్యుత్‌ సరఫరా ఆగిపోవడంతో అధికారులు హైరానాపడ్డారు. రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహన సేవలో పాల్గొని ఉత్సవమూర్తులను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి, సత్యనారాయణ, వేణుగోపాలకృష్ణ, రోజా తదితరులు పాల్గొన్నారు.


ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రారంభించిన సీఎం

రాష్ట్రంలో తొలిసారిగా ఎలక్ట్రిక్‌ బస్సు సర్వీసులను ముఖ్యమంత్రి మంగళవారం సాయంత్రం తిరుపతిలో ప్రారంభించారు. తిరుపతి-తిరుమల మధ్య నడిచే పది ఎలక్ర్టిక్‌ ఏసీ బస్సులను ఆయన అలిపిరి టోల్‌గేట్‌ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. 

Read more