పంచాయతీలపై పంజా!

ABN , First Publish Date - 2022-04-10T08:10:32+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ గ్రామ పంచాయతీలపై ఉక్కుపాదం మోపడం మొదలైంది.

పంచాయతీలపై పంజా!

  • గ్రామాల్లో సర్పంచ్‌ల అధికారాలకు కత్తెర 
  • ’ఆర్థిక సంఘం నిధులు ఖజానాకు మళ్లింపు 
  • గ్రామ సచివాలయాలతో సమాంతర వ్యవస్థ 
  • పనులు చేయలేక... ప్రజలకు చెప్పలేక... 
  • ఉత్సవ విగ్రహాలుగా మారిన సర్పంచ్‌లు 
  • ఖాతాలు ఖాళీ కావడంతో నిస్సహాయత
  • నిధులు, విధులు లాగేసుకున్న సర్కారు 
  • దీర్ఘకాలం బిల్లుల పెండింగ్‌తో కుదేలు 
  • గ్రామ స్వరాజ్య లక్ష్యానికి దూరంగా పాలన


రాష్ట్రంలో గ్రామ పంచాయతీల వ్యవస్థ నిర్వీర్యమైంది. సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాలుగా మిగిలారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడం, పంచాయతీల నిధులను సర్కారు ఖజానాకు మళ్లించడంతో గ్రామాల్లో పాలన గాడి తప్పింది. పంచాయతీలకు సమాంతరంగా తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ... అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ పథకాలకు సర్పంచ్‌లను దూరం చేసి, వారిని డమ్మీలుగా మార్చింది. మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ్య లక్ష్యానికి సుదూరంగా గ్రామాల్లో పాలన సాగుతోంది.


(అమరావతి-ఆంధ్రజ్యోతి) : వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ గ్రామ పంచాయతీలపై ఉక్కుపాదం మోపడం మొదలైంది. సర్పంచ్‌లకు ఉన్న స్వయం నిర్ణయాధికారాన్ని, స్వపరిపాలనను హరించేందుకు పావులు కదిపింది. పంచాయతీలను పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకునే దిశగా అడుగులు వేసింది. గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో, సంక్షేమ పథకాల అమలులో సర్పంచ్‌లను దూరం చేయడంతో ఏం చేయాలో అర్థంకాక సతమతమవుతున్నారు. పంచాయతీల ఖాతాల్లో నిధులు అందుబాటులో  లేకపోవడంతో వీరంతా నిస్సహాయులవుతున్నారు. బయట కనిపిస్తే చాలు జనం ఏదో ఒక సమస్య గుర్తు చేస్తున్నారని, దీంతో గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఇతర పార్టీల సర్పంచ్‌లు ప్రభుత్వంపై నెపం వేస్తున్నా, అధికార పార్టీకి చెందినవారి పరిస్థితి దారుణంగా ఉంది. తప్పును ప్రభుత్వంపై వేయలేక, ప్రజలకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు.


‘ఉపాధి’ బిల్లుల పెండింగ్‌ 

వైసీపీ సర్కారు వచ్చిన వెంటనే అప్పటి వరకు గ్రామాల్లో ఉపాధి పథకం ద్వారా చేపట్టిన మెటీరియల్‌ పనులకు నిధులు నిలిపేశారు. అప్పటి వరకు పంచాయతీల్లో మంజూరైన పనులన్నీ రద్దు చేశారు. మాజీ సర్పంచ్‌లు చేపట్టిన పలు పనులకు బిల్లులు పెండింగ్‌ పెట్టారు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. కేంద్రం విడుదల చేసిన నిధులను పంచాయతీలకు ఇవ్వకుండా ఇతర అవసరాలకు వాడుకున్నారు. మాజీ సర్పంచ్‌లు కోర్టుకెక్కడంతో ఆయా పనులపై విజిలెన్స్‌ తనిఖీలు చేపట్టి వేధించారు. చివరకు కోర్టు ఆదేశాలతో 75శాతం మాత్రమే బిల్లులు చెల్లించారు. ఇంకా 25శాతం పెండింగ్‌లోనే ఉన్నాయి. బిల్లులు సకాలంలో రాకపోవడంతో పనులు చేసిన మాజీ సర్పంచ్‌లు అప్పుల పాలయ్యారు. కొంతమంది ఆస్తులు అమ్ముకోగా, మరికొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉపాధి హామీ పథకాన్ని పంచాయతీల ఆధ్వర్యంలో చేపట్టాలని కేంద్రం నిర్దేశించినా గ్రామ సచివాలయాలు, ప్రైవేట్‌ సిబ్బందితోనే కొనసాగిస్తున్నారు. 


సచివాలయాలతో సమాంతర పాలన 

గ్రామ, వార్డు సచివాలయాల పేరుతో గ్రామాల్లో సర్పంచ్‌ల పాత్ర లేకుండా సమాంతర వ్యవస్థను రంగంలోకి దించారు. 50 కుటుంబాలకు ఒకరు చొప్పున 2.5లక్షల మంది వైసీపీ కార్యకర్తలను వలంటీర్లుగా నియమించారు. గ్రామ పంచాయతీలు నిర్మించుకున్న పంచాయతీ భవనాలను సచివాలయాలుగా మార్చారు. 500కు పైబడి సేవలందిస్తామని చెప్పి మీసేవ కేంద్రాల్లో అందించే సాధారణ సేవలకే  పరిమితమయ్యారు. సచివాలయాల్లో పనిచేసే సిబ్బందిపై సర్పంచ్‌కు నియంత్రణ ఉంటుందని మార్గదర్శకాల్లో చెప్పడమే తప్ప ఎక్కడా అమలు చేయలేదు. పంచాయతీ నిధులను సచివాలయాల నిర్వహణకు వినియోగించుకుంటూ సర్పంచ్‌కు, పంచాయతీలకు ఎలాంటి అధికారాలు లేకుండా లాగేసుకున్నారు. గ్రామ పంచాయతీల నుంచి తీర్మానాలు మాత్రమే తీసుకుని పనులన్నీ ప్రభుత్వమే నిర్వహిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైనా సర్పంచ్‌తో సంబంధం లేకుండానే వలంటీర్లు దరఖాస్తులు స్వీకరించి ప్రాసెస్‌ చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులతో ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం బాటలో పంచాయతీల్లో నాటిన మొక్కలను 80శాతం బతికించలేకపోతే సర్పంచ్‌లపై చర్యలు తీసుకుంటామని చట్టం తీసుకొచ్చారు. 


నిధులన్నీ బొక్కేశారు 

గ్రామ పంచాయతీలకు ఒక్క పైసా ఇవ్వకపోగా... కేంద్రం విడుదల చేస్తున్న 14, 15వ ఆర్థిక సంఘం నిధులపై రాష్ట్ర ప్రభుత్వం కన్నేసింది. మొదట్లో విద్యుత్‌ బకాయిల పేరిట పంచాయతీల నుంచి భారీ మొత్తంలో ఆర్థిక సంఘం నిధులు మినహాయించుకున్నారు. ఆ తర్వాత 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయకుండా నేరుగా పీడీ ఖాతాల్లో జమ చేసుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు ఉద్యమ బాట పట్టాయి. ఆర్థిక సంఘం నిధులతో పాటు గ్రామ పంచాయతీలు పన్నుల రూపంలో వసూలు చేసుకున్న నిధులను కూడా లాగేసుకోవడంతో సర్పంచ్‌లు ఆందోళనకు దిగాల్సి వచ్చింది. 


వలంటీరుకున్న విలువ కూడా లేదు 

వలంటీరుకు ఉన్న విలువ కూడా సర్పంచ్‌కు లేకుండా పోయింది. పథకాల అమలు, అభివృద్ధి పనుల్లో వారికే పెద్దపీట వేస్తున్నారు. వారి నెల వేతనం కూడా మాకంటే ఎక్కువ. ప్రజల ఓట్లతో గెలుపొందిన మాకు కనీస గౌరవం లేకుండా పోతోంది. రేషన్‌కార్డులు, పింఛన్ల మంజూరులో కూడా మా ప్రమేయం లేకుండా చేస్తున్నారు. 

- మజ్జి రాంబాబు, సర్పంచ్‌, 

మిర్తివలస, విజయనగరం జిల్లా


పంచాయతీల మనుగడకు ముప్పు

వైసీపీ అసమర్థ పాలనతో పంచాయతీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. గ్రామాల్లో అభివృద్ధి  మందగించింది. రాష్ట్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా, ఆర్ధికసంఘం నిధులు తీసుకోవటం దుర్మార్గం. రాజకీయాలకు అతీతంగా సర్పంచ్‌లు ఐకమత్యంతో పోరాటం చేయాలి. లేకుంటే పంచాయతీల మనుగడ చాలా కష్టం. 

- ముల్లంగి రామకృష్ణారెడ్డి, జాతీయ 

పంచాయతీ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

Read more