ఇసుక తవ్వకాలను అడ్డుకున్న మహిళలు

ABN , First Publish Date - 2022-01-23T05:40:19+05:30 IST

నగరి మండలం ఓజీకుప్పంలో శనివారం ఇసుక తవ్వకాలను మహిళలు అడ్డుకున్నారు.గ్రామస్తుల కథనం మేరకు.

ఇసుక తవ్వకాలను అడ్డుకున్న మహిళలు
ఇసుక తోడేందుకు వచ్చిన హిటాచిని అడ్డుకున్న మహిళలు

పుత్తూరు, జనవరి 22: నగరి మండలం ఓజీకుప్పంలో శనివారం ఇసుక తవ్వకాలను మహిళలు అడ్డుకున్నారు.గ్రామస్తుల కథనం మేరకు.... కుశస్థలి నది నుంచి ఇసుకను తరలించేందుకు శనివారం ఉదయం హిటాచీతో కాంట్రాక్టరు వెళ్ళారు. అయితే ఇసుక తవ్వకాల వల్ల వ్యవసాయ బోర్లు దెబ్బతిని పంటలు నష్టపోతున్నామంటూ మహిళలు అడ్డుతగిలారు. తీవ్ర వాగ్వాదం తరువాత వెనక్కి వెళ్లిపోయిన కాంట్రాక్టరు సాయంత్రం తిరిగి రావడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.గ్రామంలో ఇసుక రీచ్‌ లేకున్నా ఇరవై రోజుల క్రితం ఇసుకను నాలుగు రోజులు తవ్వారని గ్రామస్తులు ఆరోపించారు.ఇసుక తీయడం వల్ల బోర్లు ఎండి పోయి పంటలు దెబ్బతినే ప్రమాదం ఉండడంతో హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి తవ్వకాలు జరపకుండా ఆదేశాలు తీసుకొచ్చామన్నారు.శనివారం ఉదయం ఇసుకను తీసుకెళ్లే ప్రయత్నాలను అడ్డుకోవడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వలంటీర్లను దబాయించి అడ్డుకున్న మహిళల పేర్లు రాసుకున్నారు. పదిమందిని బలవంతంగా జీపులో ఎక్కించడంతో మిగిలిన మహిళలంతా జీపును చుట్టుముట్టడంతో వదిలేసి వెళ్లిపోయారు. మళ్ళీ సాయంత్రానికల్లా నదిలోకి హిటాచీని తీసుకొచ్చి ఇసుకను తరలించేందుకు ప్రయత్నాలు చేశారు. జగనన్న ఇళ్ళ నిర్మాణం పేరుతో ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో ఇసుక రీచ్‌ లేకున్నప్పటికీ నాగలాపురం మండలం నందనం ఇసుక రీచ్‌ పేరును బిల్లులో చూపిస్తూ రోజుకు 150 నుంచి 200 ట్రాక్టర్ల ఇసుక తీసుకెళుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ విషయమై సీఐ మద్దయ్యఆచారిని వివరణ కోరగా ఇసుక రీచ్‌కు కలెక్టర్‌ పర్మిషన్‌ ఉందని చెప్పారు. ఒక వేల రైతులు హైకోర్టు ఉత్తర్వులను తీసుకొచ్చి ఉంటే కలెక్టర్‌ పర్మిషన్‌ రద్దు చేస్తే సరిపోతుందన్నారు. ఇందులో తమ పాత్ర ఏమీ లేదని తెలిపారు.

Read more