ఓట్లేసి గెలిపించింది ఇందుకేనా?

ABN , First Publish Date - 2022-10-05T06:15:02+05:30 IST

‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామికి గ్రామంలో కొందరి నుంచి నిరసన వ్యక్తమైంది.

ఓట్లేసి గెలిపించింది ఇందుకేనా?
డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మోహన్‌రెడ్డి మధ్య వాగ్వాదం

‘గడప గడపకు మన ప్రభుత్వం’లో 

డిప్యూటీ సీఎంను నిలదీసిన యువకులు

పెనుమూరు, అక్టోబరు 4: ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామికి గ్రామంలో కొందరి నుంచి నిరసన వ్యక్తమైంది. మంగళవారం ఆయన ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ విజయానందరెడ్డితో కలిసి పెనుమూరు మండలం ఉగ్రాణంపల్లె పంచాయతీలో పర్యటించారు. తాము ఓట్లేసి గెలిపించింది వివక్ష చూపడానికేనా అని కొందరు యువకులు డిప్యూటీ సీఎంను ప్రశ్నించారు. తమకు శ్మశానవాటిక లేక రోడ్డుపక్కనే శవాలను దహనం చేస్తున్నామని దళితవాడవాసులు చూపించారు. డ్రైనేజీ లేక రోడ్డుపైనే మురుగు పారుతోందని, విద్యుత్‌ స్తంభాలూ లేవంటూ సమస్యలు ప్రస్తావించారు. అనంతరం సచివాలయం పక్కనే ఏర్పాటు చేసిన నూతన ట్రాన్స్‌ఫార్మరును ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లకు బిల్లులు ఆపేశారని వాటిని ఇప్పించాలని వళ్లెమ్మ కోరారు. ‘నా కొడుకు సహా పలువురు యువకులు రాత్రి పగలు కష్టపడి వైసీపీకి పనిచేశారు. అలాంటిది ఇప్పుడు మీతో తిరుగుతున్న నాయకులే బెదిరిస్తున్నారు. నా బిడ్డకు ఏమైనా జరిగితే వారే కారణం’ అంటూ నారాయణ స్వామితో ఓ మహిళ వాగ్వాదానికి దిగారు. ఎవరో చెబితే వచ్చి ఇలా ఫిర్యాదులు చేసుకొని ఒకే పార్టీకి చెందిన వ్యక్తులు గొడవ పడడం సబబు కాదని నారాయణస్వామి అన్నారు. వీటిని తానూ సహించనని చెప్పారు. ఆరు నెలలుగా రాకుండా ఇప్పుడు వచ్చారంటూ సామిరెడ్డిపల్లికి చెందిన మోహన్‌రెడ్డి డిప్యూటీ సీఎంని ప్రశ్నించారు. ఈ క్రమంలో వాదోపవాదాలు జరిగాయి. తనను వాడు అని అంటే వాతలు పెడతానంటూ నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తంచేశారు. వాడు అని అంటే ఆయన్ను లోపల వేయండంటూ పోలీసులకు చెప్పారు. తాను వాడు అని అనలేదని మోహన్‌రెడ్డి చెప్పారు. పోలీసులు ఆయన్ను అక్కడ నుంచి పక్కకు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, యశిదారెడ్డి, విజయ్‌రెడ్డి, సర్పంచులు మురళీరెడ్డి, జయచంద్రారెడ్డి, మధురెడ్డి, కమలాకర్‌రెడ్డి ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఎంపీపీ, జడ్పీటీసీ, మరికొందరు నేతలు హాజరు కాలేదు. కాగా, కొద్దిరోజులుగా నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ప్రభుత్వ ఎన్నారై సలహాదారు జ్ఞానేంద్రరెడ్డి వర్గీయుల మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. 

Read more