టీచర్లపై కక్షేల?

ABN , First Publish Date - 2022-08-17T06:53:47+05:30 IST

ఉదయం పాఠశాలలో ఉపాధ్యాయుడు అడుగు పెట్టినప్పటి నుంచి మరుగుదొడ్ల ఫొటోల అప్‌లోడింగ్‌.. విద్యార్థుల హాజరు ఆన్‌లైన్‌ నమోదు.. మధ్యాహ్న భోజన ఫొటోల అప్‌లోడింగ్‌..

టీచర్లపై కక్షేల?
మొబైళ్లు చూపుతున్న కుప్పం ప్రాంత ఉపాధ్యాయులు

 అటెండెన్స్‌ కోసం కొత్త యాప్‌ తెరపైకి

ఇప్పటికే అనేక యాప్‌ల భారంతో ఒత్తిడి

సమయమంతా బోధనేతర పనులతోనే సరి

ఇప్పటికే వివిధ రకాల యాప్‌ల నిర్వహణతో బోధనకు దూరంగా ఒత్తిడికి గురవుతున్న టీచర్లు, తాజాగా విద్యాశాఖ తీసుకొచ్చిన ఫేస్‌ ఐడెంటిఫికేషన్‌ అటెండెన్స్‌ యాప్‌పైన తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. న్యాయబద్ధంగా తమకు రావాల్సిన పీఆర్సీ ఫిట్‌మెంట్‌, సీపీఎస్‌ రద్దు తదితర అంశాల్లో ఉద్యమించడం పట్ల ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నట్లుగా భావించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


తిరుపతి/చిత్తూరు, ఆంధ్రజ్యోతి 

ఉదయం పాఠశాలలో ఉపాధ్యాయుడు అడుగు పెట్టినప్పటి నుంచి మరుగుదొడ్ల ఫొటోల అప్‌లోడింగ్‌.. విద్యార్థుల హాజరు ఆన్‌లైన్‌ నమోదు.. మధ్యాహ్న భోజన ఫొటోల అప్‌లోడింగ్‌.. విద్యార్థుల నమోదు, చిక్కీలు, కోడిగుడ్లు వివరాల నమోదు.. జగనన్న విద్యాకానుకకు సంబంధించి తల్లిదండ్రుల వేలిముద్రల నమోదు.. నాడు- నేడు పనుల వివరాల నమోదు.. ఆన్‌లైన్‌లో మార్కుల నమోదు.. తదితర పనులన్నింటికీ వివిధ యాప్‌లతో కుస్తీ పడుతున్నారు. 80శాతం సమయాన్ని బోధనేతర పనులకే వెచ్చించ్చాల్సిన అనివార్య పరిస్థితుల్లో అసంతృప్తి దాచుకుని విధులు నిర్వహిస్తున్నారు. వీటి నుంచి తమకు విముక్తి కల్పించి పూర్తిగా బోధనకే పరిమితమయ్యేలా చర్యలు తీసుకోవాలని చాలాకాలంగా ఉన్నతాధికారులకు విన్నవిస్తున్నారు. అధికారులు ఈ విజ్ఞప్తులను పట్టించుకోకపోగా అటెండెన్స్‌ కోసమంటూ కొత్తగా మరో యాప్‌ను తెరపైకి తీసుకొచ్చారు. దీనిపై ఉపాధ్యాయులు తీవ్ర ఆసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే విఫలమైన ‘బయోమెట్రిక్‌’ విధానం

 ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది హాజరుకు గతంలో బయోమెట్రిక్‌ విధానం అమలు చేశారు. చాలాచోట్ల సిగ్నల్స్‌ లేకపోవడం, పాడైన వాటిని బాగు చేయకపోవడం, నిర్వహణ నిధులు కేటాయించకపోవడంతో ఇవి అటకెక్కాయి. కోట్ల రైపాయలు వృథా అయిన ఆ ప్రక్రియను బుట్టదాఖలు చేసిన ప్రభుత్వం.. కొత్తగా ఫేషియల్‌ రికగ్నేషన్‌ అటెండెన్స్‌ యాప్‌ను తెరపైకి తీసుకొచ్చింది.ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకునే క్రమంలో టీచర్ల వ్యక్తిగత వివరాల సేకరణకు తప్పనిసరిగా అనుమతిస్తేనే అది పనిచేసేలా రూపొందించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. తమ బ్యాంకు ఖాతాల వివరాలు, మెయిల్స్‌ తదితర వివరాలు చోరీకి గురైతే ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.ఏ శాఖకూ లేనివిధంగా టీచర్లకు మాత్రమే ఇటువంటి అసంబద్ధ నిబంధనల అమలు వెనుక వేరే ఉద్దేశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. సాంకేతిక సమస్యలు పక్కన పెడితే ఇది పూర్తిగా టీచర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా ఉందంటున్నారు. 

పర్యవేక్షక వ్యవస్థ పటిష్టత అవసరం

ఇదివరకు ఉపాధ్యాయుల హాజరును ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, డీవైఈవో, డీఈవో సహా సర్వశిక్ష అభియాన్‌ సెక్టోరియల్‌ అధికారులు పరిశీలిస్తూ పర్యవేక్షించేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఇన్‌చార్జులతో నడుస్తున్నాయి. ఈ ఖాళీలను భర్తీచేసి పర్యవేక్షక వ్యవస్థను పటిష్ఠం చేయాలన్నది టీచర్ల డిమాండ్‌. ఇక, పనివేళలతో సంబంధం లేకుండా ఉన్నత పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 9 గంటలకు ఒక నిమిషం ఆలస్యమైనా గైర్హాజరు నమోదయ్యేలా సాఫ్ట్‌వేర్‌ రూపొందించడంపై వారు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. 

తొలిరోజు 30 శాతం మంది హాజరు నమోదు

రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచీ ఉపాధ్యాయులకు నూతనంగా ప్రవేశపెట్టిన హాజరు నమోదు విధానం జిల్లాలో తొలిరోజే విఫలమైంది. కేవలం 30 శాతం మంది టీచర్లు మాత్రమే ఈ కొత్త యాప్‌ ద్వారా తమ హాజరును నమోదు చేయగలిగారని క్షేత్ర స్థాయి సమాచారం. మిగిలిన 70 శాతం మంది పలు రకాల కారణాలు, సమస్యలతో తాము స్కూళ్ళకు హాజరైనా అటెండెన్స్‌ను మాత్రం ప్రభుత్వానికి అప్‌లోడ్‌ చేయలేకపోయినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఎలాంటి ముందస్తు ఏర్పాట్లూ చేయకుండా హడావిడి నిర్ణయం తీసుకోవడమే ఈ పరిస్థితికి కారణమని ఉపాధ్యాయులు తేల్చేస్తున్నారు. కాగా పరికరాలను ప్రభుత్వమే సరఫరా చేయడంతో పాటు ముందస్తు శిక్షణ, ఇతర సదుపాయాలు కల్పించాకే దీన్ని అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

తొలిరోజు ‘యాప్‌’ కష్టాలెన్నో? 

కోట మండలంలో 74 పాఠశాలలకు గానూ కేవలం 20పాఠశాలల్లో పనిచేసే 40 మంది ఉపాధ్యాయుల హాజరు మాత్రమే తీసుకున్నట్టు ఎంఈవో తెలిపారు. ఉదయం 8.30 గంటల నుంచీ సర్వర్‌ పనిచేయలేదని, దీంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారని సమాచారం.

- గూడూరు మండలంలో 346 మంది టీచర్లు పనిచేస్తుండగా 30శాతం మంది మాత్రమే తొలిరోజు కొత్త యాప్‌ ద్వారా అటెండెన్స్‌ అప్‌లోడ్‌ చేయగలిగారు.

- వెంకటగిరి మండలంలోనూ ఉదయం 8.30 గంటల నుంచీ సర్వర్‌ పనిచేలేదు. దీంతో టీచర్లు తమ అటెండెన్స్‌ అప్‌లోడ్‌ చేయడానికి వీల్లేకుండాపోయింది.


టీచర్ల హాజరు అప్‌డేట్‌ కాలేదు!

జిల్లాలో కొత్త యాప్‌ విధానంలో ఉపాధ్యాయుల హాజరు మంగళవారం అప్‌డేట్‌ కాలేదు. విద్యార్థుల హాజరు మాత్రం 75 శాతం నమోదైంది.

- శేఖర్‌,డీఈవో 

పరికరాలు ప్రభుత్వమే అందించాలి!

 హాజరు నమోదుకు వినియోగించే పరికరాలను ప్రభుత్వమే అందజేయాలి. ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించడంతో పాటు సర్వర్‌ సామర్ధ్యం పెంచాలి. అటెండెన్స్‌ అప్‌లోడ్‌ చేయడంపై శిక్షణ ఇచ్చాకే కొత్త యాప్‌ విధానాన్ని అమల్లోకి తేవాలి.  

- బాబు, ఏపీటీఎఫ్‌ జిల్లా శాఖ అధ్యక్షుడు


ప్రభుత్వానికి మేం వ్యతిరేకం కాదు!

టీచర్లు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళితే ఆశించిన ఫలితాలు వస్తాయి. పరికరాలు అందజేసి, ఇంటర్నెట్‌ సదుపాయం కల్పిస్తే మాకెలాంటి అభ్యంతరం లేదు.

- భీమినేని మునికృష్ణనాయుడు, 

ఎస్టీయూ జిల్లా ఆర్థిక కార్యదర్శి.


వ్యక్తిగత ఫోన్ల వినియోగం వద్దు!

యాప్‌ల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేకంగా డివైస్‌ ఇవ్వాలి. టీచర్లు వ్యక్తిగత ఫోన్లు వినియోగిస్తే వారి వ్యక్తిగత సమాచారం బయటకు వచ్చే ప్రమాదముంది.

- బండి మధుసూదన్‌రెడ్డి, 

యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి


Read more