కుప్పం బ్రాంచ్‌ కెనాలల్‌పూర్తయ్యేదెప్పటికి?

ABN , First Publish Date - 2022-09-30T07:35:29+05:30 IST

కుప్పం బ్రాంచి కాలువ పనులు 18 శాతం పెండింగులో ఉన్నాయి. దీనికి తక్షణం రూ.117 కోట్లు కావాలి. ఇక, కోర్టుకెళ్లిన 24 మందితో చర్చించి భూ వివాదాలను పరిష్కరించాలి.

కుప్పం బ్రాంచ్‌ కెనాలల్‌పూర్తయ్యేదెప్పటికి?
హంద్రీనీవా కుప్పం బ్రాంచి కెనాల్‌

మూడున్నరేళ్లుగా 

నయా పైసా ఇవ్వని వైనం

ఆరు నెలల్లో పూర్తి చేస్తామని

తాజాగా సీఎం హామీ

‘పుంగనూరు’ విస్తరణ పనులకు

 ఖరారైన టెండర్లు

చిత్తూరు, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కుప్పం బ్రాంచి కాలువ పనులు 18 శాతం పెండింగులో ఉన్నాయి. దీనికి తక్షణం రూ.117 కోట్లు కావాలి. ఇక, కోర్టుకెళ్లిన 24 మందితో చర్చించి భూ వివాదాలను పరిష్కరించాలి. ఇవన్నీ జరిగి, పనులు మొదలైతే పూర్తికావడానికి ఏడాదిపైనే పడుతుందని ఇంజనీరింగ్‌ అధికారులు అంటున్నారు. మూడేళ్లుగా కుప్పం బ్రాంచి కాలువను పట్టించుకోని సీఎం జగన్‌.. ఇప్పుడేమో ఆరు నెలల్లో పూర్తి చేస్తానంటూ హామీ ఇచ్చారు. 

కృష్ణా నదీ జలాలతో ఉమ్మడి జిల్లాలోని పడమటి మండలాలకు సాగు, తాగునీరు అందించేలా హంద్రీనీవా ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. కర్నూలు జిల్లా మాల్యాల వద్ద హంద్రీ నీవా ప్రధాన కాలువ ప్రారంభమై అనంతపురం జిల్లాలోని జీడీపల్లె రిజర్వాయర్‌ మీదుగా చిత్తూరు ఉమ్మడి జిల్లా కేవీపల్లె మండలంలోని అడవిపల్లె రిజర్వాయర్‌ వద్ద (554 కిలోమీటర్లు) ముగుస్తుంది. అనంతపురం జిల్లాలోని ప్రధాన కాలువకు సంబంధించి 400వ కిలోమీటరు నుంచి పుంగనూరు బ్రాంచి కెనాల్‌ ప్రారంభమై, 74వ కిలోమీటర్లు వద్ద చిత్తూరు ఉమ్మడి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. దీని పొడవు 224.50 కిలోమీటర్లు. పుంగనూరు బ్రాంచి కెనాల్‌కు చెందిన 207.90 కిలోమీటరు వద్ద కుప్పం బ్రాంచి కెనాల్‌ ప్రారంభమై 127 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. పుంగనూరు, కుప్పం బ్రాంచి కాలువలు పూర్తయితే ఉమ్మడి జిల్లాలోని తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం, పీలేరు నియోజకవర్గాల్లోని 2 లక్షల ఎకరాలకు సాగు.. 12 లక్షల మందికి తాగునీరు అందుతుంది. ఈ కాలువ వెంబడి వెంబడి 105 వరకు పెద్ద చెరువులకూ నీళ్లు నింపనున్నారు. 

కుప్పం బ్రాంచి కాలువ పరిస్థితి ఇదీ 

పుంగనూరు బ్రాంచి కెనాల్‌కు చెందిన 207.90 కిలోమీటరు నుంచి కుప్పం బ్రాంచి కాలువ ప్రారంభమై 127 కిలోమీటర్లు ఉంటుంది. రూ.575 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన ఈ కాలువ నిర్మాణం రూ.475 కోట్లతో 80శాతానికిపైగా పూర్తయింది. ఆరు కిలోమీటర్ల మేర కాలువ తవ్వకం, మొత్తం ఆరింట్లో ఇంకా మూడు లిఫ్టుల నిర్మాణం, 50 చోట్ల బ్రిడ్జిలు వంటి నిర్మాణాలు, భూవివాదాలతో 24 మంది కోర్టుకెళ్లడం.. వంటి కారణాలతో కుప్పం బ్రాంచి కెనాల్‌ పనులు నిలిచిపోయి ఉన్నాయి. మిగిలిన రూ.100 కోట్లకు, ప్రస్తుత ధరలకు అనుగుణంగా రూ.17 కోట్ల ఎక్సలేషన్‌ ఛార్జె్‌సతో కలిపి మొత్తం రూ.117 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పం బ్రాంచి కాలువ కోసం నయా పైసా కూడా విడుదల చేయలేదు. ఇప్పుడు ఆరు నెలల్లో కాలువ పూర్తి చేస్తానని సీఎం జగన్‌ చెబుతున్నారు. అవసరమైన బడ్జెట్‌ను విడుదల చేసి, ప్రత్యేక దృష్టి సారిస్తే ఒకటిన్న ఏడాదిలో కుప్పం బ్రాంచి కెనాల్‌ పూర్తవుతుందని ఇరిగేషన్‌ అధికారులు అంటున్నారు.

రూ.1219 కోట్లతో  పుంగనూరు బ్రాంచి కెనాల్‌ విస్తరణ

ఇది వరకు పుంగనూరు బ్రాంచి కెనాల్‌ 380 క్యూసెక్కుల కెపాసిటీతో ఉండేది. తాజాగా దాన్ని మూడు రెట్లు పెంచుతూ 1180 క్యూసెక్కులు చేశారు. విస్తరణకు రూ.1219.93 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేసేందుకు ఇటీవల టెండర్లు ఖరారయ్యాయి. ఈ పనులను హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ దక్కించుకుంది. కాలువ వెడల్పుతో పాటు దాని వెంబడి స్ట్రక్చర్లు, లిఫ్టులు, పంప్‌హౌ్‌సలు, అండర్‌ పాసేజ్‌లు తదితర నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న.. 18 శాతం పెండింగులో ఉన్న కుప్పం బ్రాంచి కాలువను మాత్రం ప్రభుత్వం పట్టించుకోలేదు. కుప్పానికి నీళ్లు ఇస్తే చంద్రబాబుకు మంచి పేరు వస్తుందన్న భావనతో ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్నట్లు టీడీపీ ఆరోపిస్తోంది. 

Updated Date - 2022-09-30T07:35:29+05:30 IST