పంపిణీ చేసేది పాతిక శాతమే!

ABN , First Publish Date - 2022-11-24T01:23:35+05:30 IST

పుత్తూరులో టిడ్కో ఇళ్ల కేటాయింపులు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి గతంలో అధికారులు ఇచ్చిన ఇళ్ల లెక్కలకు ప్రస్తుతం పంపిణీ చేస్తామంటున్న లెక్కలకు పొంతన లేకుండా పోయింది.నిర్మాణాలు పూర్తయిన ఇళ్ల రిజిస్ట్రేషన్లకు కలెక్టర్‌ అనుమతి అవసరమవడంతో భూమి వర్గీకరణ మార్పు కోసం స్థానిక అధికారులు ఎదురు చూస్తున్నారు.

పంపిణీ చేసేది పాతిక శాతమే!
టిడ్కో ఇళ్ల సముదాయాలు

అప్పగింతకు టిడ్కో ఇళ్లను సిద్ధం చేస్తున్న యంత్రాంగం జూ భూమి వర్గీకరణ మార్పు కోసం ఆగిన రిజిస్ట్రేషన్లు

పుత్తూరు : పుత్తూరులో టిడ్కో ఇళ్ల కేటాయింపులు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి గతంలో అధికారులు ఇచ్చిన ఇళ్ల లెక్కలకు ప్రస్తుతం పంపిణీ చేస్తామంటున్న లెక్కలకు పొంతన లేకుండా పోయింది.నిర్మాణాలు పూర్తయిన ఇళ్ల రిజిస్ట్రేషన్లకు కలెక్టర్‌ అనుమతి అవసరమవడంతో భూమి వర్గీకరణ మార్పు కోసం స్థానిక అధికారులు ఎదురు చూస్తున్నారు.

1008 ఇళ్లలో ఎన్నింటిని పంపిణీ చేస్తారు?

పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని వినాయకపురం వద్ద పేద, మధ్య తరగతి కుటుంబాల కోసం గత టీడీపీ ప్రభుత్వం మూడు కేటగిరీల కింద 1008 గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.ఉచితంగా నిర్మించే 300 చదరపు అడుగుల ఇళ్లకు 500 రూపాయలను డిపాజిట్టుగా నిర్ణయించింది. ఈ కేటగిరి కింద 576 మంది రూ.2.88 లక్షలను ప్రభుత్వానికి చెల్లించారు.365 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించే ఇళ్లకు రూ.50 వేల చొప్పున 140మంది 44.99 లక్షలు ప్రభుత్వానికి చెల్లించారు. మూడవ కేటగిరీ కింద 430 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించనున్న ఇళ్లకు లక్ష రూపాయల చొప్పున 288 మంది రూ.2 కోట్ల 54 లక్షల 75 వేలను ప్రభుత్వానికి చెల్లించారు. ఈ డిపాజిట్లకు వాయిదాల వెసులుబాటు వుండడంతో లబ్ధిదారులు ఆశతో అధిక వడ్డీలకు అప్పు తెచ్చి శక్తి మేరకు ప్రభుత్వానికి కట్టారు.1008మంది లబ్ధిదారులకు 21 బ్లాకుల్లో అపార్టుమెంట్లను నిర్మించేందుకు ప్రభుత్వం ఉపక్రమించింది. వీటిలో ఏడు బ్లాకులు పూర్తి కాగా మరో రెండు బ్లాకులు రెండంతస్థుల వరకు పూర్తయ్యాయి. మిగిలిన 12 బ్లాకులు పునాదుల వరకు లేచాయి. ఈ నేపథ్యంలో మూ డేళ్లక్రితం ప్రభు త్వం మారడంతో నిర్మాణా లు ఆగిపోయాయి. దీంతో నిర్మితమైన ఆ భవనాలు బూజు పట్టాయి. పునాదులకు వేసిన ఇనుప కమ్మీలు తుప్పు పట్టాయి.ఇళ్లను అప్పగించాలని లబ్ధిదారులు అనేకసార్లు ఆందోళనలు చేసినా ప్రయోజనం లేకపోయింది.పూర్తయిన టిడ్కో ఇళ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించడంతో మున్సిపల్‌ అధికారుల్లో చలనం వచ్చింది.పునాదులు వరకు వేసిన 12 బ్లాకులను రద్దు చేసి తొమ్మిది బ్లాకుల్లో నిర్మితమైన 432 ఇళ్లను పంపిణీకి సిద్ధం చేస్తున్నారు.ఒకటవ కేటగిరిలో 576 ఇళ్లకు 384 ఇళ్లను, 3వ కేటగిరిలో 48 ఇళ్లను పంపిణీ చేయనున్నారు. 2వ కేటగిరిలోని 144 ఇళ్లను పూర్తిగా రద్దు చేశారు.గత ప్రభుత్వం నిర్మించిన 1008 ఇళ్లలో నాలుగో వంతు మాత్రమే పంపిణీ చేయనున్నారు. అయితే గతంలో తాము చెల్లించిన డిపాజిట్ల మొత్తం రూ.3 కోట్ల రెండు లక్షల 62 వేలు ఏమయ్యాయంటూ లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.ఇళ్ల కేటాయింపు లేనప్పుడు ఆ సొమ్మును వాపసు చేయాలిగదా అంటున్నారు.

పట్టాలు ఇచ్చారు ... స్థలం మరిచారు

టిడ్కో ఇళ్లను ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసిందనే ప్రచారం ఈ మధ్య లబ్ధిదారుల్లో ఆందోళన రేపింది. ప్రత్యామ్నాయంగా జగనన్న కాలనీల్లో ఇళ్లను కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో లబ్ధిదారులు ఆశగా అటువైపు మొగ్గారు. రెవిన్యూ అధికారులు జగన్‌ బొమ్మలతో ముద్రించిన ఇళ్ల పట్టాల పుస్తకాలను అందించారు కానీ ఆ పట్టాలకు స్థలాలను ఇప్పటికీ చూపించలేదు..

22ఏ భూమి వర్గీకరణ మారిస్తేనే రిజిస్ట్రేషన్లు

మూడేళ్ల తర్వాత ప్రభుత్వం టిడ్కో ఇళ్లకు మోక్షం కలిగించింది.డిసెంబరు నెలాఖరులోగా ఇళ్లను పంపిణీ చేయాలని ఆదేశించింది. అంటే మరో ఐదు వారాల్లో రిజిస్ట్రేషన్లు పూర్తి కావాల్సి వుంది. అయితే టిడ్కో నిర్మించిన అపార్టుమెంట్‌ స్థలం 22ఏ కింద వుండడంతో రిజిస్ర్టేషన్లకు వీల్లేకుండా పోయింది. ఈ భూమి వర్గీకరణను కలెక్టర్‌ స్థాయిలో మార్చాల్సి వుండడంతో ఆయన అనుమతి కోసం స్ధానిక అధికారులు ఎదురు చూస్తున్నారు.ఈ విషయమై పుత్తూరు మున్సిపల్‌ కమిషనర్‌ కేఎల్‌ఎన్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశం ప్రకారం టిడ్కో ఇళ్లలో చిన్నపాటి మరమ్మతులు చేపట్టామన్నారు. తలుపులు, కిటికీలు, విద్యుత్‌, నీటి సరఫరా పనులు చేయిస్తున్నామని చెప్పారు. రిజిస్ట్రేషన్లకు భూమి వర్గీకరణ మారాల్సి వుందని, కలెక్టర్‌ అనుమతి వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపడతామన్నారు.

Updated Date - 2022-11-24T01:23:38+05:30 IST