నాటు తుపాకీతో ఇద్దరు యువకుల హల్‌చల్‌

ABN , First Publish Date - 2022-09-13T06:31:13+05:30 IST

ఆర్సీపురం మండలం కుప్పంబాదూరు ఉన్నత పాఠశాలలో ఇద్దరు యువకులు ఓ నాటు తుపాకీతో హల్‌చల్‌ చేశారు.

నాటు తుపాకీతో ఇద్దరు యువకుల హల్‌చల్‌
తాళం, తలుపులను పరిశీలిస్తున్న పోలీసులు - బడి ఆవరణలో పోలీసులు

కుప్పం బాదూరు ఉన్నత పాఠశాల హెచ్‌ఎం గది తాళాలు ధ్వంసానికి యత్నం

భయాందోళనలో విద్యార్థులు, ఉపాధ్యాయులు 


రామచంద్రాపురం, సెప్టెంబరు 12: ఆర్సీపురం మండలం కుప్పంబాదూరు ఉన్నత పాఠశాలలో ఇద్దరు యువకులు ఓ నాటు తుపాకీతో హల్‌చల్‌ చేశారు. విచక్షణారహితంగా గోడలపై కాల్పులు జరిపారు. ఈ సంఘటనతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాఠశాలకు రెండ్రోజులు సెలవు కావడంతో ఆదివారం రాత్రి ఇద్దరు యువకులు ప్రహరీ దాటి లోపలకు ప్రవేశించారు. హెచ్‌ఎం గది తాళాలు పగలగొట్టేందుకు విఫలయత్నం చేశారు. తర్వాత ఉన్మాదుల్లా డ్రైనేజీ పైపులు, గోడలు, తలుపులపై ఎక్కడపడితే అక్కడ నాటు తుపాకీతో కాల్చేసి వెళ్లిపోయారు. సోమవారం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు పరిస్థితిని చూశాక పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఎస్‌ఐ గిరిబాబు వెంటనే పాఠశాలకొచ్చి పరిసరాలను పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే.. విద్యార్థులను భయబ్రాంతులను చేయడానికి డమ్మీ తుపాకీని వాడినట్లు కొందరు చెబుతుండగా.. మరికొందరేమో డమ్మీ తుపాకీతో ఇనుప వస్తువులు సొట్టలు పడవని అంటున్నారు. వాస్తవాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. అదేసమయంలో కుప్పంబాదూరు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బడిలో చొరబడ్డారన్న ప్రచారమూ జరుగుతోంది. 

Updated Date - 2022-09-13T06:31:13+05:30 IST