అంతర్జాతీయ సైన్సు ప్రదర్శనకు ఇద్దరి ఎంపిక

ABN , First Publish Date - 2022-09-17T06:43:19+05:30 IST

అంతర్జాతీయ సైన్సు ప్రదర్శనకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులు వెళ్లనున్నారు.

అంతర్జాతీయ సైన్సు ప్రదర్శనకు ఇద్దరి ఎంపిక
షీల్డు, ప్రశంసాపత్రం అందుకుంటున్న చరణ్‌ తేజ్‌

త్వరలో జపాన్‌లోని సకూరాకు వెళ్లనున్న ఉమ్మడి జిల్లా విద్యార్థులు 

పలమనేరు/చిత్తూరు (సెంట్రల్‌), సెప్టెంబరు 16: అంతర్జాతీయ సైన్సు ప్రదర్శనకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులు వెళ్లనున్నారు. దీనికిగాను ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి ‘ఇన్‌స్పైర్‌ మనక్‌-2022’లో వీరి నమూనాలు ఎంపికయ్యాయి. త్వరలో జపాన్‌లోని సకూరాలో జరిగే సైన్సు ప్రదర్శనలో వీరు పాల్గొననున్నారు. ఢిల్లీలో బుధ, గురు, శుక్రవారాల్లో జాతీయ స్థాయి ఇన్‌స్పైర్‌ ప్రదర్శన నిర్వహించారు. దీనికి ఉమ్మడి చిత్తూరు జిల్లానుంచి బి.సాయికీర్తన (వాల్మీకిపురం పీవీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల), ప్రణయ (గుడిపాల మండలం ఏఎల్‌పురం జడ్పీహెచ్‌ఎ్‌స), పడిగల చరణ్‌ (పీలేరు మండలం జంగంపల్లి జడ్పీహెచ్‌ఎ్‌స), జె.నాగేంద్ర (రేణిగుంట జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల), ఎస్‌.అర్చిత (చిత్తూరు మండలం శెట్టిపల్లె జడ్పీహెచ్‌ఎ్‌స) రూపొందించిన నమూనాలు ఎంపికయ్యాయి. ఢిల్లీలోని జాతీయ స్థాయి ఇన్‌స్పైర్‌లో ప్రణయ, పడిగల చరణ్‌ ప్రదర్శించిన నమూనాలు అంతర్జాతీయ ఇన్‌స్పైర్‌కు ఎంపికయ్యాయి. వీరికి ఢిల్లీలో శుక్రవారం కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్రసింగ్‌, ఇన్‌స్పైర్‌ ప్రోగ్రామ్‌ హెడ్‌ డాక్టర్‌ నమిత గుప్తా, ఎన్‌ఐఎ్‌ఫ డైరెక్టర్‌ డాక్టర్‌ విపిన్‌ కుమార్‌ షీల్డు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఎంపికైన విద్యార్థులను డీఈవో శ్రీరాంపురుషోత్తం, ఎస్‌ఎస్‌ ఏపీసీ వెంకటరమణారెడ్డి, జిల్లా సైన్సు అధికారి రమణ అభినందించారు. వీరిలోని ప్రతిభను వెలికి తీసి ప్రదర్శనల కోసం ప్రాజెక్టుల తయారీకి సహకరించిన గైడ్‌ టీచర్లు శ్రీరంగలక్ష్మి, వి.రేణుకకూ అభినందనలు తెలిపారు. జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయికి మరింత మంది విద్యార్థులు ఎంపిక కావాలని ఆకాంక్షించారు.

ఎంపికైన నమూనాలివీ 

జి.బ్యాగ్స్‌ ఫర్‌ స్మార్టు ప్రిజర్వేషన్స్‌ 

కూరగాయలు కుళ్లిపోకుండా 10నుంచి 15 రోజుల వరకు నిల్వ చేసుకునేలా జి.బ్యాగ్స్‌ నమూనాను గుడిపాల మండలం ఏఎల్‌పురం ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదివే ప్రణయ రూపొందించారు. ప్లాస్టిక్‌ కవర్లకు దీనిని ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. జి.బ్యాగ్స్‌  ఏకో ఫ్రెండ్లీగా ఉంటాయి. ఈ బ్యాగుల్లో కూరగాయలే కాకుండా పప్పుదినుసులనూ పురుగులు పట్టకుండా ఉంచొచ్చు. ఈమెకు బయాలజికల్‌ సైన్స్‌ టీచర్‌ ఆర్‌.శ్రీరంగలక్ష్మి గైడ్‌గా వ్యవహరించారు. 

బ్యాక్‌ రెస్ట్‌ సైడ్‌ సీటెడ్‌ ఫర్‌ ఉమెన్‌

ద్విచక్రవాహనంపై చీరలు ధరించి మహిళలు, వయోవృద్ధులు ఒకవైపు కూర్చోడానికి ఇబ్బందిగా ఉంటుంది. వీరు మోటారు సైకిల్‌లో సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా ఈ సీటును పీలేరు మండలం జంగంపల్లి ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదివే పడిగల చరణ్‌ రూపొందించారు. ఈయనకు సైన్సు టీచరు వి.రేణుక గైడ్‌గా వ్యవహరించారు. 

Updated Date - 2022-09-17T06:43:19+05:30 IST