మృత్యుమార్గాలుగా మలుపులు

ABN , First Publish Date - 2022-02-19T06:09:34+05:30 IST

పట్టణాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు దాటుకుని జాతీయ రహదారి ఎక్కగానే ఎక్సలేటర్‌పై ఒత్తిడి పెరిగిపోతోంది. రహదారుల అభివృద్ధి జోరందుకోవడంతో వాహనాల వేగానికి అదుపులేకుండా పోతోంది. ఎదురుగా వచ్చే వాహనాలు లేకపోవడంతో ప్రమాదకర వేగంతో దూసుకుపోతూ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. జాతీయరహదారుల్లో మలుపులు మృత్యుమార్గాలుగా మారాయి.ఆయా మార్గాల్లో అలవాటుపడ్డ వాహన చోదకులకు పరవాలేదు కానీ కొత్తగా వెళ్లేవారు మలుపుల వద్ద జాగ్రత్తగా వుండాలని గుర్తు పెట్టుకుని ప్రయాణించాలి.అది లేకపోవడం వలనే చంద్రగిరి సమీపం ఐతేపల్లె వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రగాయాలపాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. తమిళనాడు సరిహద్దు గ్రామం సైనిగుంట సమీపంలో శుక్రవారం సాయంత్రం అదుపుతప్పిన ఓ కారు చెట్టును ఢీకొట్టడంతో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

మృత్యుమార్గాలుగా మలుపులు
ఐతేపల్లె వద్ద ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విశాఖవాసులు

జాతీయ రహదారులపై మరణమృదంగాలు


అతి వేగానికి కుటుంబాలకు కుటుంబాలే బలి


పట్టణాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు దాటుకుని జాతీయ రహదారి ఎక్కగానే ఎక్సలేటర్‌పై ఒత్తిడి పెరిగిపోతోంది. రహదారుల అభివృద్ధి జోరందుకోవడంతో వాహనాల వేగానికి అదుపులేకుండా పోతోంది. ఎదురుగా వచ్చే వాహనాలు లేకపోవడంతో ప్రమాదకర వేగంతో దూసుకుపోతూ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. జాతీయరహదారుల్లో మలుపులు మృత్యుమార్గాలుగా మారాయి.ఆయా మార్గాల్లో అలవాటుపడ్డ వాహన చోదకులకు పరవాలేదు కానీ కొత్తగా వెళ్లేవారు మలుపుల వద్ద జాగ్రత్తగా వుండాలని గుర్తు పెట్టుకుని ప్రయాణించాలి.అది లేకపోవడం వలనే చంద్రగిరి సమీపం ఐతేపల్లె వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రగాయాలపాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. తమిళనాడు సరిహద్దు గ్రామం సైనిగుంట సమీపంలో శుక్రవారం సాయంత్రం అదుపుతప్పిన ఓ కారు చెట్టును ఢీకొట్టడంతో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 

 

స్వర్ణాలయానికి బయల్దేరి తిరిగిరాని లోకాలకు...


శోకసంద్రంలో మునిగిపోయిన మృతుల కుటుంబాలు


చంద్రగిరి/గాజువాక, ఫిబ్రవరి 18: ఆ కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. దైవ దర్శనం కాకముందే అతివేగం కబళించింది.చంద్రగిరి మండలం ఐతేపల్లె సమీపంలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి.విశాఖ పట్నం గాజువాక శ్రీనగర్‌ ప్రాంతానికి చెందిన పైడి ప్రేమకుమార్‌ (23), తన అక్క స్వాతి (25), ఆమె కుమార్తె శ్యామార్చిత (2), పాతగాజువాకకు చెందిన స్నేహితులు సునీల్‌కుమార్‌ (25), ఖాదర్‌వల్లి కలిసి తిరుపతి వెళ్లారు.తిరుమల శ్రీవారి దర్శనానికి శనివారం టోకెన్లు దొరకడంతో ఈలోగా గోల్డెన్‌ టెంపుల్‌ చూసొద్దామని ఖాదర్‌వల్లి తిరుపతి స్నేహితుడికి చెందిన కారులో బయలుదేరారు.ఐతేపల్లె వద్ద జరిగిన ప్రమాద సమాచారం అందడంతో శ్రీనగర్‌లో వుంటున్న కుటుంబ సభ్యులు భోరున విలపించారు. చేతికి అందివచ్చిన కుమారుడితో పాటు కుమార్తెను, మనవరాలిని రోడ్డు ప్రమాదం పొట్టనబెట్టుకోవడాన్ని ప్రేమకుమార్‌ తల్లిదండ్రులు పైడి చంద్రరావు, సంధ్యారాణి జీర్ణించుకోలేకపోయారు.ఆటోడ్రైవర్‌గా బతుకు బండి ఈడుస్తున్న తనకు కుమారుడు అండగా నిలిచేవాడని చంద్రరావు గుండెలవిసేలా రోదించారు.ప్రేమ్‌కుమార్‌ గాజువాకలోని ఓ బంగారు ఆభరణాల దుకాణంలో పనిచేస్తుండగా, సునీల్‌కుమార్‌ సెల్‌ రిపేర్‌ షాప్‌ నిర్వహిస్తున్నాడు.స్నేహితుడికి సహాయంగా వెళ్తానంటే సరేనన్నామని, ఇలా తమను విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతాడని ఊహించలేదని  అతడి తల్లిదండ్రులు గోపి, సూర్యలక్ష్మి భోరున విలపించారు.కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్న కుటుంబానికి సెల్‌ రిపేర్‌ షాప్‌ పెట్టి అండగా నిలిచిన కుమారుడి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. 
పెళ్లింట విషాదం


ఆటో ఢీకొని వధువు తండ్రి మృతి


మరో ఇద్దరికి తీవ్రగాయాలు


మదనపల్లె క్రైం, ఫిబ్రవరి 18: ఆటో ఢీకొని పెళ్లికుమార్తె తండ్రి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం కురబలకోట మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు... పెద్దమండ్యం మండలం వెలిగల్లుకు చెందిన చలపతి కుమార్తె అరుణ వివాహం శుక్రవారం వెలిగల్లులో మదనపల్లెకు చెందిన యువకుడితో జరిగింది. ఈనేపథ్యంలో వివాహ అనంతరం నూతన వధూవరులు కారులో మదనపల్లెకు బయలుదేరారు. ఈక్రమంలో వీరి వెనుకనే చలపతి, మల్లమ్మ దంపతులు ద్విచక్రవాహనంలో వెళ్తుండగా మార్గమధ్యంలోని కురబలకోట మండలం రామక్కచెరువుకట్టపై ఆటో ఢీకొంది. ప్రమాదంలో దంపతుల సహా అంగళ్లుకు చెందిన ఆటోడ్రైవర్‌  నాగార్జున తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చలపతి పరిస్థితి విషమంగా మారడంతో తిరుపతికి తరలిస్తుండగా మృతిచెందాడు.  సమాచారం అందుకున్న ముదివేడు పోలీసులు ఆస్పత్రికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.


చెట్టును ఢీకొన్న కారు


తమిళనాడు సరిహద్దులో రోడ్డుప్రమాదం 


గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడి కుమారుడు, బావమరిది మృతి 


పలమనేరు, ఫిబ్రవరి 18 : పలమనేరు నుంచి గుడియాత్తం వెళ్లే రహదారిలో తమిళనాడు సరిహద్దు గ్రామం సైనిగుంట సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పలమనేరులో నివాసముంటున్న జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్‌ కృష్ణమూర్తి గౌడ ఏకైక కుమారుడు జయసింహ(24), బావమరిది ఉపేంద్ర(50), చిన్న అల్లుడు వంశీ(32), లోకేష్‌కుమార్‌(35), మహేష్‌(26) శుక్రవారం మధ్యాహ్నం పలమనేరు నుంచి గుడియాత్తంకు కారులో వెళ్తుండగా సైనిగుంట సమీపంలో అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈప్రమాదంలో జయసింహ, ఉపేంద్ర అక్కడికక్కడే మృతిచెందారు. వంశీ, మహేష్‌, లోకేష్‌కుమార్‌లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని గుడియాత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గుడియాత్తం సీఐ, ఎస్‌ఐ, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం కోసం గుడియాత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున వేలూరు సీఎంసీకి తరలించారు. గుడియాత్తం పోలీసులు  కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Read more