గదుల దళారీలపై టీటీడీ ఉక్కుపాదం

ABN , First Publish Date - 2022-08-15T08:21:46+05:30 IST

తిరుమలలో గదుల దళారీలపై టీటీడీ ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది.

గదుల దళారీలపై టీటీడీ ఉక్కుపాదం

బ్లాక్‌లో విక్రయించేందుకు ప్రయత్నిస్తే క్రిమినల్‌ కేసులు

పోలీసు, విజిలెన్స్‌తో ప్రత్యేక నిఘా బృందాల ఏర్పాటు


తిరుమల, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో గదుల దళారీలపై టీటీడీ ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది.గదులు పొంది బ్లాక్‌లో విక్రయించేందుకు ప్రయత్నించే దళారీలపై క్రిమినల్‌ కేసులు పెట్టేలా ప్రణాళికలు రూపొందించుకుంది. కొండపై ప్రస్తుతం భక్తుల రద్దీ అధికంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యమిస్తూ.. టీటీడీ ఇప్పటికే పలురకాల చర్యలు చేపట్టింది. అయితే కొందరు దళారీలు వీఐపీల సిఫార్సు లేఖలు, టీటీడీలో తమకున్న పరిచయాలతో గదులను పొంది అధిక ధరకు బ్లాక్‌లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీన్ని గుర్తించి ఇప్పటికే పలువురు దళారీలతోపాటు అధికారులు, సిబ్బందిపైనా ప్రత్యేక నిఘా పెట్టారు. ఇందులో భాగంగానే దళారీలతో కలిసి దర్శనం, వసతిని బ్లాక్‌లో విక్రయించిన టీటీడీ సూపరింటెండెంట్‌ మల్లికార్జునను కూడా అరెస్ట్‌ చేశారు. గదుల ద్వారా అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు చెక్‌పెట్టి గదుల కేటాయింపులో పారదర్శకత తీసుకొచ్చి సామాన్య భక్తులకే వసతిని కల్పించే దిశగా శుక్ర, శనివారం రిసెప్షన్‌, విజిలెన్స్‌, పోలీసు అధికారులతో ఈవో ఏవీ ధర్మారెడ్డి సమావేశం నిర్వహించారు. సిఫార్సు లేఖలపై గదులు పొంది బ్లాక్‌లో విక్రయించే వ్యక్తులు ఎవ్వరైనా ఉపేక్షించవద్దని, క్రిమినల్‌ కేసులు పెట్టాలని ఆదేశించారు. ఈ మేరకు పోలీసు, విజిలెన్స్‌ అధికారులతో ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశారు. ఆదివారం నుంచే ఈ బృందాలు రంగంలోకి దిగినట్లు సమాచారం. రద్దీ నేపథ్యంలో సామాన్య భక్తుల వసతి కల్పనకు అడ్డుపడేలా గదుల రొటేషన్‌కు పాల్పడే వారిపైనా ఓ కన్నేశారు. దళారీలతో కుమ్మక్కై.. ఏస్థాయి అధికారి, సిబ్బంది తప్పుచేసినా కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దళారీలకు దర్శన, గదులకు సిపార్సు లేఖలు ఇచ్చే ప్రముఖులపైనా చర్యలు తీసుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టు తెలిసింది. మొత్తంమీద కొండపై దళారీలను పూర్తిగా ఏరివేసేలా టీటీడీ పటిష్ఠమైన ప్లాన్‌ సిద్ధం చేసుకుంటోంది.  

Read more