-
-
Home » Andhra Pradesh » Chittoor » Today is Srivari Garudaseva-NGTS-AndhraPradesh
-
నేడే శ్రీవారి గరుడసేవ
ABN , First Publish Date - 2022-10-01T07:42:54+05:30 IST
బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన గరుడ వాహన సేవ శనివారం రాత్రి జరుగనుంది.

తిరుమలలో పెరిగిన రద్దీ
తిరుమల, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన గరుడ వాహన సేవ శనివారం రాత్రి జరుగనుంది. పెరటాశి రెండవ శనివారం కూడా కలసిరావడంతో భక్తులు భారీగా వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది.ఆలయంలోని మూలవర్లకు అలంకరించే సహస్రనామమాల, లక్ష్మీహారం, మకరకంటి, పచ్చ, సూర్యకఠారి, ప్రభుత్వం సమర్పించిన పట్టువస్త్రాలతో అలంకృతుడై గరుత్మంతుడిని అధిరోహించి మాడవీధుల్లో ఊరేగే మలయప్పను చూసి తరించేందుకు చాలామంది ముందురోజే తిరుమలకు చేరుకోవడం ఆనవాయితీ.ఈ నేపథ్యంలోనే శుక్రవారం మధ్యాహ్నం నుంచే తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో వైకుంఠం క్యూకాంప్లెక్స్ కంపార్టుమెంట్లు భక్తులతో నిండాయి. ప్రత్యేక దర్శనాలన్నీ రద్దు చేసి సర్వదర్శనాలను మాత్రమే అమలు చేస్తున్న క్రమంలో వేగంగా స్వామిని దర్శించుకుంటున్నారు. శుక్రవారం స్వామిని దర్శించుకుంటే శనివారం వాహనసేవలో పాల్గొనవచ్చనే అభిప్రాయంతో చాలా మంది భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. రద్దీ పెరిగిన నేపథ్యంలో భక్తులకు క్యూలైన్ల వద్ద నిరంతరాయంగా అన్నప్రసాదాలు వితరణ చేస్తున్నారు. మరోవైపు శుక్రవారం వేకువజాము నుంచి ఉదయం 11 గంటల వరకు తిరుమలలో చిరుజల్లులు కురిశాయి. చిన్నపాటి వర్షమే కావడంతో కల్పవృక్షవాహన సేవలో భక్తులు చిరుజల్లుల్లో తడుస్తూనే పాల్గొన్నారు. మరికొంతమంది గొడుగుల నీడలో తలదాచుకున్నారు.