శోభాయమానంగా తిరుమల

ABN , First Publish Date - 2022-09-27T07:40:04+05:30 IST

శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

శోభాయమానంగా తిరుమల

తిరుమల, సెప్టెంబరు26 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి  బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.విద్యుత్‌, పుష్పాలం కరణలతో ఇల వైకుంఠాన్ని తలపిస్తోంది.సుమారు 10 టన్నుల సంప్రదాయ పుష్పాలతో కొండ మొత్తాన్ని శోభాయమానంగా అలంకరించారు. 4 టన్నులు ఆలయం లోపల, వెలుపల 6 టన్నుల పుష్పాలతో అలంకరించారు. గోపురానికి పుష్పాలతో ఏర్పాటు చేసిన విష్ణుమూర్తి, శంఖుచక్ర, నామాల బోర్డు కనువిందు చేస్తోంది.సుమారు లక్ష కట్‌ ఫ్లవర్స్‌తో ధ్వజస్తంభం, బలిపీఠాన్ని మంగళవారం అలంకరించనున్నారు.భక్తులను ఆకట్టుకునేలా ఎప్పటిలానే కల్యాణవేదికలో ఫలపుష్ప ప్రదర్శనశాలను కూడా సిద్ధం చేశారు.బ్రహ్మలోకం, విష్ణులోకం, కైలాసంతో కూడిన ‘మూడులోకాలు’ భారీ సెట్టింగును హైదరాబాద్‌కు చెందిన 25మంది నిపుణులు వేశారు.నాలుగు యుగాలకు చెందిన సెట్టింగులు కూడా ఆకట్టుకుంటున్నాయి. వేదిక ముందు భాగంలోని ఉడ్‌పెయింటింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.మైసూరుకు చెందిన గౌరి ‘దశావతారాలు’ సైకత శిల్పం అద్భుతంగా రూపొందించారు. వీటితో పాటు నవధాన్యాలతో స్వామి, అమ్మవార్లను తయారుచేశారు. ప్రత్యేకించి మహారాష్ట్ర భక్తులను ఆకట్టుకునేలా భక్తతుకారాం, శివాజీ ప్రతిమలను కూడా ఏర్పాటు చేశారు.మరోవైపు తిరుమల ఎల్‌ఈడీ, పార్కాన్‌ లైట్ల కాంతుల్లో భక్తుల మనుసు దోచుకుంటోంది. శ్రీవారి ఆలయ ప్రాకారానికి ఏర్పాటు చేసిన దశావతారాల విద్యుత్‌ సెట్టింగ్‌ ఈఏడాది ప్రత్యేకం. 


నేటినుంచి వాహనసేవలు

 బ్రహ్మోత్సవాల్లో మంగళవారం నుంచి వాహనసేవలు ప్రారంభం కానున్నాయి.మంగళవారం సాయంత్రం 5.45 నుంచి 6.15 గంటల వరకు మీనలగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్దశేషవాహన సేవ జరుగనుంది.బుధవారం నుంచి ఉదయం,రాత్రి రెండు వాహన సేవలుంటాయి.  


ప్రత్యేక దర్శనాలన్నీ రద్దు

 బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ ప్రత్యేక దర్శనాలన్నీ రద్దు చేసింది. ఉత్సవాలు జరిగే తొమ్మిదిరోజులూ కేవలం సర్వదర్శనాలు మాత్రమే వుంటాయి. స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ దర్శనం ఉంటుంది. 


బ్రహ్మోత్సవాల్లో నేడు  

మధ్యాహ్నం :   3-5గంటల మధ్య ధ్వజపటం ఉరేగింపు

సాయంత్రం :   5.45 - 6.15 గంటల మధ్య 

                         మీన లగ్నంలో ధ్వజారోహణం 

రాత్రి :  8.15 - 9గంటల మధ్య ముఖ్యమంత్రి పట్టువస్త్రాల సమర్పణ

రాత్రి :       9 - 11 గంటల నడుమ పెద్దశేష వాహన సేవ


శాస్ర్తోక్తంగా అంకురార్పణ

తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిదిరోజుల పాటు వైభవంగా జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం రాత్రి శాస్ర్తోక్తంగా అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి 7 నుంచి 8 గంటల నడుమ సేనాధిపతి ఊరేగింపు, వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం జరిపారు.ఆలయంలోని యాగశాలకు సమీపంలో అంకురార్పణ జరిగే ప్రదేశాన్ని ముందుగానే పేడతో అలంకరించారు. ఆ తర్వాత రాత్రి సేనాధిపతి ఊరేగింపు అనంతరం ఆ ప్రదేశంలో బ్రహ్మపీఠాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానించారు.అనంతరం భూమాతను ప్రార్ధిస్తూ అందులో ముందుగానే సేకరించిన మట్టిని కుండలలో వేసి శాలి, వ్రహి, యువ, ముద్గ, మాష, ప్రియంగు వంటి నవధాన్యాలను చల్లి నీరు పోశారు. ఆ పాలికలను నూతన వస్త్రంతో అలంకరించి పుణ్యాహవచనం నిర్వహించారు. తర్వాత సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠించారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తూ మొలకలు వచ్చేలా చర్యలు తీసుకుంటారు. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకుర్పారణ అని సంబోధిస్తారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. శ్రీవారి సేనాధిపతిగా పిలిచే విష్వక్సేనుడు ఆలయ మాడవీధుల్లో తిరుగుతూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. రాత్రి 7 గంటలకు విష్వక్సేనుడు విశేష అలంకరణలో గదతో తిరుచ్చి వాహనంపై ఆలయం నుంచి వెలుపలకు వచ్చారు. మహాద్వారం వద్ద హారతి అందుకుని  మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చాడు. బ్రహ్మోత్సవాల వాహన ఊరేగింపుకు ముందు మొదటి వాహనం కావడంతో భక్తులు ఆసక్తిగా తిలకించారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు మారుతి ప్రసాద్‌, రాములు తదితరులు పాల్గొన్నారు. 

Read more