చల్లనయ్యపై నల్లనయ్య నర్తనం

ABN , First Publish Date - 2022-10-04T06:27:10+05:30 IST

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి చంద్రప్రభవాహనంలో నర్తన కృష్ణుడిగా మలయప్ప దర్శనమిచ్చా రు.

చల్లనయ్యపై నల్లనయ్య నర్తనం

రెండున్నర గంటలకు పైగా చంద్రప్రభ వాహన సేవ

మత్య్సనారాయణుడిగా సూర్యప్రభామధ్యస్తుడై విహారం


తిరుమల, అక్టోబరు3(ఆంధ్రజ్యోతి): శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి చంద్రప్రభవాహనంలో నర్తన కృష్ణుడిగా మలయప్ప దర్శనమిచ్చా రు.గోవిందనామస్మరణలతో భక్తులు కర్పూరహారతులు పట్టారు.వాహనసేవ రాత్రి 7 నుంచి 9 గంటల వరకే అయినప్పటికీ రద్దీ అధికంగా ఉన్న క్రమంలో  అదనంగా 40 నిమిషాల పాటు చంద్రప్రభ వాహనాన్ని మాడవీధుల్లో తిప్పారు. ఆహ్లాదకర వాతావరణంలో కళాబృందాల ప్రదర్శనల నడుమ వాహనసేవ కనువిందుగా సాగింది.పుదుచ్చేరి కళాబృందం ప్రదర్శించిన మహిసాసుర మర్ధిని అంశంతో కూడిన కాళియాట్టం,  రాజమండ్రికి చెందిన బృందం ప్రదర్శించిన చంద్రకుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.సోమవారం మధ్యాహ్నం రంగనాయకుల మండపంలో స్నపన తిరుమంజనం నేత్రానందంగా జరిగింది.అంతకుముందు  ఉదయం మత్స్యనారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు.ఈ వాహనసేవల్లో  జీయర్‌స్వాములు, కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎంపీలు రెడ్డెప్ప, గురుమూర్తి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి,ఈవో ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు రాములు, మారుతీ ప్రసాద్‌, మధుసూదన యాదవ్‌, ప్రశాంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

నేటితో వాహనసేవలకు ముగింపు

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలు మంగళవారం రాత్రి అశ్వవాహన సేవతో ముగియనున్నాయి.ఉదయం మహా రథోత్సవం జరగనుంది.వేకువజామున ఆలయం నుంచి ఉత్సవర్లు ఊరేగింపుగా రథం వద్దకు వేంచేస్తారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికలో ఆశీనులుచేసి పుణ్యాహవచనం, నవగ్రహారాధన, నవగ్రహదానం చేస్తారు. ఆ తరువాత 5.10 - 5.40 గంటల మధ్య కన్యాలగ్నంలో ఉత్సవర్ల ఆరోహణం చేస్తారు.ఉదయం 7గంటలకు రథోత్సవం ప్రారంభం కానుంది.టీటీడీ ఉద్యానవనవిభాగం సిబ్బంది, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నిపుణులు అరటన్ను పుష్పాలతో శోభాయమానంగా రథాన్ని పుష్పాలతో అలంకరించి ఉత్సవానికి సిద్ధం చేశారు.  

 









Updated Date - 2022-10-04T06:27:10+05:30 IST