కరోనాకన్నా హీనమైన పాలన ఇది

ABN , First Publish Date - 2022-08-31T05:36:16+05:30 IST

రాష్ట్రంలో కరోనాకన్నా హీనమైన దుర్మార్గమైన పాలన నడుస్తోందని టీడీపీ నాయకులు విమర్శించారు. కరోనా ఎలా మనుషులను చంపి, విలయం సృష్టించిందో అంతకంటే దుర్మార్గంగా మనుషులను హింసించి వైసీపీ నేతలు వేడుక చూస్తున్నారని ధ్వజమెత్తారు.

కరోనాకన్నా హీనమైన పాలన ఇది
కూలిన అన్న క్యాంటీన్‌ షెడ్డును పరిశీలిస్తున్న మునిరత్నం తదితరులు

టీడీపీ విమర్శ


కుప్పం,ఆగస్టు  30: రాష్ట్రంలో కరోనాకన్నా హీనమైన దుర్మార్గమైన పాలన నడుస్తోందని టీడీపీ నాయకులు విమర్శించారు. కరోనా ఎలా మనుషులను చంపి, విలయం సృష్టించిందో అంతకంటే దుర్మార్గంగా మనుషులను హింసించి వైసీపీ నేతలు వేడుక చూస్తున్నారని ధ్వజమెత్తారు. కుప్పం ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట అన్న క్యాంటీన్‌ కూల్చివేతకు నిరసనగా టీడీపీ శ్రేణులు మంగళవారం ధర్నా చేశాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికేసులు పెట్టినా వైసీపీ దౌర్జన్యాలకు భయపడేది లేదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని, ఇది కేవలం ఇక ఒక ఏడాదే ఉంటుందన్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేన్నారు. అప్పుడొచ్చే అంబేద్కర్‌ పాలనలో కేసులనుంచి బయటపడి స్వచ్ఛంగా వెలికి వస్తామన్నారు. ఒక జిల్లా మంత్రిని అడ్డంపెట్టుకుని దాడులకు తెగబడుతున్నారని, రేపు ఒక ముఖ్యమంత్రే తమకు అండగా ఉండబోతున్నారని, ఇంతకుఇంతా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వంపై పేదలకు కక్ష ఎందుకని ప్రశ్నించారు. కూటికి గతిలేని నిరుపేదలు అన్న క్యాంటీన్‌లో దాతల సహకారంతో భోజనం పెడుతున్నామన్నారు. అటుంటి పేదల భోజనశాలను కూల్చడం తీవ్రమైన కర్కశత్వానికి నిదర్శమన్నారు. ఎస్పీ ఎస్టీ మైనారిటీ, బడుగు, బలహీన వర్గాలంటే జగన్‌రెడ్డికి ఏమాత్రం పట్టదని, వారిపైన దాడులు, దౌర్జన్యాలతో విరుచుకుపడుతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రజలు ఎప్పుడెప్పుడా అని కాచుకున్నారని, గద్దె దిగే రోజు దగ్గరలోనే ఉన్నదని స్పష్టం చేశారు. టీడీపీ నియోజకర్గ ఇన్‌ఛార్జి పీఎస్‌.మునిరత్నం ఆధ్య్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కుప్పం రూరల్‌ మండల అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌, తెలుగుయుత నియోజకవర్గ అధ్యక్షుడు మణి, మాజీ ఎంపీపీ సాంబశివం, గంగమ్మ గుడి మాజీ ఛైర్మన్‌ బీఎంకే.రవిచంద్రబాబు, మురుగేశ్‌తోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 కొనసాగిన అన్నదానం

 పట్టణంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ షెడ్డును గుర్తు తెలియని దుండగులు కూల్చివేసినా, మంగళవారంనాటి అన్నదానం మాత్రం ఆగలేదు. ధర్నా విరమించిన అనంతరం ఒక మొబైల్‌ వ్యాన్‌లో భోజనం తెచ్చిన టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుటే అన్నదానం చేశాయి. టీడీపీ నియోజకర్గ ఇన్‌ఛార్జి పీఎస్‌.మునిరత్నం స్వయంగా భోజనం వడ్దించారు. క్యాంటీన్‌ నిర్వాహకుడు, గంగమ్మ గుడి మాజీ ఛైర్మన్‌ బీఎంకే.రవిచంద్రబాబుతోపాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


 

Updated Date - 2022-08-31T05:36:16+05:30 IST