చిత్తూరులో దొంగలు పడ్డారు!

ABN , First Publish Date - 2022-12-10T00:12:19+05:30 IST

చిత్తూరు శివారులో గురువారం రాత్రి ఓ దొంగల ముఠా తన ప్రతాపాన్ని చూపింది. చవటపల్లెలో ఆరు, పక్కనే ఉన్న సంతపేటలో రెండు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడింది. ఈ ఎనిమిది ఇళ్లకు గాను రెండు ఇళ్లల్లో మాత్రమే దొరికిన బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్ళారు

చిత్తూరులో దొంగలు పడ్డారు!
దొంగలు పగుల గొట్టిన బీరువా

\చిత్తూరు, డిసెంబరు 9: చిత్తూరు శివారులో గురువారం రాత్రి ఓ దొంగల ముఠా తన ప్రతాపాన్ని చూపింది. చవటపల్లెలో ఆరు, పక్కనే ఉన్న సంతపేటలో రెండు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడింది. ఈ ఎనిమిది ఇళ్లకు గాను రెండు ఇళ్లల్లో మాత్రమే దొరికిన బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్ళారు. అదే ముఠా ఎస్‌ఆర్‌పురం మండలం క్షీరసముద్రంకు చెందిన సీనియర్‌ టీడీపీ నేత ఇంట్లోనూ చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికులు, చిత్తూరు తాలూకా, రెండో పట్టణ పోలీసులు తెలిపిన ప్రకారం.. చిత్తూరుకు కూతవేటు దూరంలోని చవటపల్లెలో గ్రామదేవత ఆలయం, సచివాలయ కార్యాలయం ఉండే వీధిలో రమేష్‌, సుబ్రహ్మణ్యం, తులసమ్మ, లోకేష్‌ కుమార్‌, భాస్కర్‌ తదితరుల గృహాలున్నాయి. పెళ్లి ముహుర్తాలు ఉండటంతో కొంతమంది బయటకు వెళ్ళిపోగా.. ఉద్యోగరీత్యా ఒకరిద్దరు బయటి ప్రాంతాల్లో ఉన్నారు. ఇళ్ళల్లో ఎవరూలేరని గుర్తించిన దొంగల ముఠా గురువారం రాత్రి దొంగతనానికి పాల్పడింది. ముఠాసభ్యులు ఏకకాలంలో చవటపల్లెలో ఆరు ఇళ్ల తాళాలను పగులగొట్టారు. ఐదు లోపల గదుల్లో ఉన్న బీరువా, సేఫ్టీ లాకర్లను పగులగొట్టి చూడగా... ఏమీ కనపడకపోవడంతో దుస్తులు, ఇతర వస్తువులను చిందరవందరగా పడేసి వెళ్ళిపోయారు. బెంగుళూరు ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసే లోకేష్‌కుమార్‌ ఇంటి బీరువాలో ఉన్న 246 గ్రాముల బంగారం, 400 గ్రాముల వెండి, రూ.8వేలు నగదు, కొన్ని పట్టుచీరలను ఎత్తుకెళ్ళారు. ఇక, సంతపేటలో రెండు ఇళ్లల్లో తాళాలను పగులగొట్టారు. శివకుమార్‌ ఇంట్లో పది గ్రాముల బంగారు, రెండు లక్షల నగదు అపహరించుకు వెళ్లారు. మరో ఇంట్లో ఏమీ దొరకలేదని సమాచారం. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాలూకా, రెండో పట్టణ ఎస్‌ఐలు రామకృష్ణ, మల్లికార్జున్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గురువారం రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం ఉదయం 4 గంటల మఽధ్యలో దొంగలు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. క్లూస్‌ టీము సభ్యులు కూడా సంఘటనాస్థలానికి చేరుకుని వేలిముద్రలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఓ ముఠా సభ్యుడిపై అనుమానం

ప్రకాశం జిల్లాకు చెందిన దొంగల ముఠాపై పోలీసులకు అనుమానం వచ్చింది. గతంలో బంగారుపాళ్యం మండలంలోనూ ఇదే తరహాలో ఇంటి తాళాలను పగులగొట్టి బంగారు ఆభరణాలను తీసుకెళ్ళగా.. పోలీసులు నిఘా ఉంచి పట్టుకున్నారు. ఈ ముఠాలోని ఓ వ్యక్తికి బంగారుపాళ్యం మండలంలో బంధువులు ఉన్నారని, అక్కడకు వచ్చి కొన్ని రోజుల పాటు వివిధ కాలనీలు, పట్టణాల్లో రెక్కీ నిర్వహించిన తర్వాతే ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతుంటాడని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. రెండుమూడు రోజుల్లోనే దొంగల ముఠాను పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

క్షీరసముద్రంలో టీడీపీ నేత ఇంట్లో చోరీ

ఫ రూ. 30లక్షల విలువైన బంగారు, నగదు, వెండి వస్తువులు ఎత్తుకెళ్లిన దొంగలు

శ్రీరంగరాజపురం: శ్రీరంగరాజపురం మండలం క్షీరసముద్రం గ్రామానికి చెందిన టీడీపీ నేత గంధమనేని రాజశేఖర్‌ నాయుడు ఇంట్లో దొంగలు పడ్డారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాలిలా ఉన్నాయి. చిత్తూరులో జరిగిన క్షీరసముద్రం గ్రామానికి చెందిన తన సమీప బంఽధువు పెళ్లికి రాజశేఖర్‌ నాయుడు కుటుంబ సమేతంగా వెళ్లారు. ఈ క్రమంలో ఇంటి దగ్గర ఓ వ్యక్తిని కాపలాగా ఉంచారు. శుక్రవారం ఉదయం ఆ వ్యక్తి తాను ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్లిపోయారు. పెళ్లి పనులు ముగించుకుని శుక్రవారం ఉదయం పది గంటలకు ఇంటికి వచ్చారు. ఇంటి ముందు తలుపులు, లోపల బీరువాను పగులగొట్టి ఉండటం చూశారు. దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. కార్వేటీనగరం సీఐ చంద్రశేఖర్‌ తన సిబ్బందితో కలసి రాజశేఖర్‌ నాయుడు ఇంటిని పరిశీలించారు. చిత్తూరు క్లూస్‌టీమ్‌ వేలిముద్రలు సేకరించింది. శుక్రవారం ఉదయం దుండగులు మామిడి తోపులో కమ్మీలను కత్తిరించి, ఇంట్లో ఉన్న సీసీ పుటేజీలపై స్ర్పే ఉపయోగించి, ఇంట్లోకి చొరబడినట్లు భావిస్తున్నారు. ఇంట్లో ఉన్న రూ.9లక్షల నగదు, 95 సవర్ల బంగారం, 5 కేజీల వెండి వస్తువులు కలిపి.. మొత్తం రూ.30 లక్షల సొత్తు అపహరణకు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు సీఐ చంద్రశేఖర్‌ తెలిపారు.

Updated Date - 2022-12-10T00:12:22+05:30 IST