ప్రారంభిస్తామని చెప్పి పరిశీలించి వెళ్లారు!

ABN , First Publish Date - 2022-09-17T06:53:54+05:30 IST

దేశంలోనే తొలి లిథియం అయాన్‌ బ్యాటరీ ప్లాంట్‌ ప్రారంభిస్తామని చెప్పి కేంద్రమంత్రి పరిశీలించి వెళ్లారు.

ప్రారంభిస్తామని చెప్పి పరిశీలించి వెళ్లారు!
డిక్సన్‌లో తయారైన ఎల్‌ఈడీ టీవీలను పరిశీలిస్తున్న మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌

ఎలక్ర్టానిక్‌ క్లస్టర్లను సందర్శించిన కేంద్ర మంత్రి

సీఎం జగన్‌ కోసమే వాయిదా వేసినట్టు ప్రచారం


తిరుపతి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ‘ఎలకా్ట్రనిక్‌ ఉపకరణాల తయారీలో దేశాన్ని గ్లోబల్‌ హబ్‌గా మార్చాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ మేకిన్‌ ఇండియా నినాదాన్ని ముందుకు తెచ్చారు. ఆ లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశగా తిరుపతి ఈఎంసీ ప్లాంట్‌ ప్రారంభోత్సవంతో ముందడుగు వేయబోతోంది’...... గురువారం ఢిల్లీలో కేంద్ర ఎలక్ర్టానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖల సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ చేసిన వ్యాఖ్యలు ఇవి.ఏర్పేడు మండలం వికృతమాల రెవెన్యూ పరిధిలో ఏర్పాటైన దేశంలోనే తొలి లిథియం అయాన్‌ బ్యాటరీ ప్లాంట్‌కు మంత్రి చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభోత్సవం జరగబోతోందంటూ కేంద్ర సమాచార శాఖ గురువారం రాత్రి 7గంటలకు ప్రకటన కూడా జారీ చేసింది. ఇంతలో ఏమి జరిగింది ఏమోగానీ అనూహ్యంగా ప్రారంభోత్సవానికి కాకుండా పరిశ్రమ సందర్శనకు మాత్రమే మంత్రి పర్యటన పరిమితమవుతున్నట్లు గురువారం రాత్రి 9గంటల పైన సమాచార శాఖ తన ప్రకటనను సవరించి మీడియాకు విడుదల చేసింది. సీఎం జగన్‌ చేతుల మీదుగా బ్యాటరీ ప్లాంట్‌ను ప్రారంభించాలన్న కారణంతోనే కేంద్ర సహాయ మంత్రి కార్యక్రమానికి బ్రేకులు వేసినట్టు తెలుస్తోంది. సీఎం లేకుండా ఇంతటి ప్రాముఖ్యతగల ఎలకా్ట్రనిక్‌ కంపెనీని ఎలా ప్రారంభిస్తారని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని నిలుపుదల చేసినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో కేంద్ర సహాయ మంత్రి శుక్రవారం నాటి పర్యటన పరిశ్రమల సందర్శనకే పరిమితమైంది. మునోథ్‌ ఇండస్ట్రీ్‌సను పరిశీలించిన అనంతరం మొక్కలు నాటిన మంత్రి మీడియాతో మాట్లాడారు. చెన్నైకి చెందిన మునోథ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ రూ.165కోట్లతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసిందని, 2015లో ప్రధాని మోదీ తిరుపతిలో ప్రారంభించిన రెండు ఎలకా్ట్రనిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్లలో ఇది ఒకటి అన్నారు. 270 మెగావాట్ల తయారీ లక్ష్యంగా రోజుకు 10ఏహెచ్‌ సామర్థ్యం గల 20వేల బ్యాటరీలను ఉత్పత్తి చేయనున్నారని తెలిపారు.  లిథియం అయాన్‌ బ్యాటరీలను ఇప్పటివరకు ప్రధానంగా చైనా, దక్షిణ కొరియా, వియత్నాం, హాంకాంగ్‌ నుండి దిగుమతి చేసుకుంటున్నామని, ఇక ఆ అవసరం లేదన్నారు. కొవిడ్‌ తర్వాత చైనా కన్నా భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారన్నారు.అనంతరం మంత్రి ఈఎంసీ-2లో ఉన్న డిక్సన్‌ టెక్నాలజీస్‌, యునైటెడ్‌ టెలీలింక్స్‌ పరిశ్రమల్లోని సౌకర్యాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మునోథ్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ లాల్‌ చంద్‌ మునోత్‌, వైస్‌ ఛైర్మన్‌ జస్వంత్‌ మునోత్‌, ఎండీ వికాస్‌, డైరెక్టర్‌ శశి తదితరులు పాల్గొన్నారు.  Read more