గోడను పాక్షికంగా తొలగించారు

ABN , First Publish Date - 2022-03-23T07:12:45+05:30 IST

తిరుపతి కేటీరోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌కు చెందిన స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన గోడను కబ్జాదారులే పాక్షికంగా తొలగించారు.

గోడను పాక్షికంగా తొలగించారు

- డాక్యుమెంట్‌ ఉందంటూ మళ్లీ మెలిక!

- పూర్తిస్థాయిలో తొలగించాలంటున్న 

  ఎస్వీ పాలిటెక్నిక్‌ విద్యార్థులు 


తిరుపతి(విద్య), మార్చి 22: తిరుపతి కేటీరోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌కు చెందిన స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన గోడను కబ్జాదారులే పాక్షికంగా తొలగించారు. పాలిటెక్నిక్‌ స్థలం కబ్జాకు గురికావడంపై ‘రాత్రికి రాత్రే గోడ కట్టేశారు!’ శీర్షికన మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ కథనంపై జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. స్థానిక వైసీపీ నేతలు కూడా స్పందించి ఆ గోడను తొలగించాలని ఆక్రమణదారుడు విశ్వనాథనాయక్‌కి సూచించినట్లు తెలిసిందే. దాంతో అతను మంగళవారం ఉదయం 8.30గంటలకు నాలుగు వరుసల గోడలో మూడు వరుసలు తొలగించాడు. విద్యార్థుల ద్వారా విషయం తెలుసుకున్న పాలిటెక్నిక్‌ ప్రిన్సిపాల్‌ ద్వారకనాథరెడ్డి వెళ్లి పరిశీలించారు. అయితే గోడను పూర్తిగా తొలగించకుండా ఇంకా ఒక వరుస రాళ్లను అలాగే ఉంచేయడంపై అలిపిరి సీఐకి సమాచారం ఇచ్చామని చెప్పారు. సీఐ వారితో మాట్లాడగా, డాక్యుమెంట్‌ ఉందని చెబుతున్నారన్నారు. రెండు, మూడ్రోజుల్లో సర్వే జరిపించి గోడను పూర్తిగా తొలగించేలా చర్యలు తీసుకుంటామని సీఐ చెప్పారని పేర్కొన్నారు. త్వరగా తొలగిస్తే అర్ధంతరంగా ఆగిన ప్రహరీ నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటామని ప్రిన్సిపాల్‌ అంటున్నారు. ప్రహరీ లేకపోవడం వల్ల వసతి గృహంలో ఉండే విద్యార్థులకు రక్షణపరంగా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే పొద్దుపోయిన తర్వాత ఆకతాయిలు లోపలికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా నిర్మాణం పూర్తికాని ప్రహరీకి దగ్గరగా బాలికల మేనేజ్‌మెంట్‌ హాస్టల్‌ ఉందని, దీనివల్ల రాత్రిపూట తమ సిబ్బంది కాపలా ఉండాల్సి వస్తుందని వాపోయారు. ఇకనైనా తమ స్థలంలో నిర్మించిన గోడను పూర్తిగా తొలగించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

Read more