డాక్టర్ల ఊరు

ABN , First Publish Date - 2022-09-11T07:49:09+05:30 IST

285 గడపలున్న పల్లెలో 26 మంది డాక్టర్లుండడం అరుదు. ఆ ఊరి పేరు జీలపాటూరు.

డాక్టర్ల ఊరు

దేశ, విదేశాల్లో జీలపాటూరు రైతు బిడ్డలు 

ప్రతి ఏడాదీ మెడిసిన్‌లో ఒకరో ఇద్దరికో సీట్లు


పెళ్లకూరు: ఒక ఊరిలో ఒకరో ఇద్దరో డాక్టర్లుంటే గొప్ప. అటువటింది.  285 గడపలున్న పల్లెలో 26 మంది డాక్టర్లుండడం అరుదు. అద్భుతం. తాజాగా నీట్‌లో ర్యాంకు దక్కించుకున్న మరొకరు డాక్టర్‌ చదువుకు సిద్ధం కావడం విశేషం. ఆ ఊరి పేరు జీలపాటూరు. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో ఇటీవల దాకా సరైన దారి కూడా లేని పల్లె అది. చిన్నా చితకా రైతులూ, రైతు కూలీలు ఉండే ఆ పల్లె జనాభా 1350.  ఎలాగో గానీ ఊరికి సరైన దారిలేని ఆ పల్లె  చదువుల దారి పట్టింది. ఒకరిని చూసి ఒకరు పోటీలు పడి చదవడం మొదలు పెట్టారు. పిల్లల శ్రద్ధ చూసి కష్టం జేసే తల్లిదండ్రులు కూడా ముచ్చట పడ్డారు. పొలం పనులకు పరిమితం చేయకుండా, అప్పోసప్పో చేసి చదివిస్తున్నారు.  ప్రతి ఏడాదీ ఒకరికో ఇద్దరికో వైద్య కళాశాలల్లో అవకాశం లభిస్తోంది. గురువారం వచ్చిన నీట్‌ ఫలితాల్లో ఇదే గ్రామానికి చెందిన ఆరూరు శ్రుతి 555 మార్కులు సాధించింది. ఈమె తండ్రి ఆరూరు మోహన్‌ చిన్న రైతు. తన రెక్కల కష్టంతోనే బిడ్డను చదివించాడు. 


సీతారామం మాటల రచయితది ఈ ఊరే

సినిమా రచయితగా ఇటీవల ప్రసిద్ధుడైన రాజ్‌కుమార్‌ది కూడా జీలపాటూరే. సీతారామం సినిమాకు ఆయన మాటలు రాశారు. పాటలు కూడా రాస్తున్నారు. బీటెక్‌ చేసిన రాజ్‌కుమార్‌ సినిమా మీద ఇష్టంతో ఆ రంగంలో అడుగుపెట్టి ప్రతిభావంతుడిగా నిరూపించుకున్నారు. 


వీరంతా వైద్యులే

జీలపాటూరు శ్రమజీవుల్లో 26 మంది ఇప్పటికే తెల్లకోట్లు ధరిస్తున్నారు. 17 మంది డాక్టర్లు అయ్యి వైద్యం చేస్తున్నారు. వీరిలో ఒకరు లండన్‌లో, ఒకరు అమెరికాలో ఉన్నారు. మరో తొమ్మిది మంది ఎంబీబీఎ్‌సలోనూ, పీజీలోనూ ఉన్నారు. జీలపాటూరుకి చెందిన డాక్టర్‌ పి.గోపాల్‌రెడ్డి చెన్నై విజయా హాస్పిటల్‌లో చేశారు. ఆర్థో నిపుణడు డాక్టర్‌ శ్రావణ్‌ చెన్నైలోనూ, అనస్థీషియా వైద్య నిపుణుడు డాక్టర్‌ శివప్రసాద్‌ సేలంలోనూ, ఏ ప్రవీణ్‌ విశాఖలోనూ వైద్య సేవలు అందిస్తున్నారు. జీలపాటూరు బిడ్డలుగా వివిధ వైద్య విభాగాల్లో ఇంకా ఎందరో సేవలందిస్తున్నారు. చిన్నపిల్లల వైద్య నిపుణులుగా డాక్టర్‌ మునిమోహన్‌, డాక్టర్‌ మహేంద్రరెడ్డి, గర్భకోశ వ్యాధి నిపుణులుగా డాక్టర్‌ తనూజ, డాక్టర్‌ ఉషా, ఫిజీషియన్లుగా డాక్టర్‌ డాక్టర్‌ రేవంత్‌, ఏ అనిల్‌, సర్జన్‌గా డాక్టర్‌ సుజిత, చర్మవాధి నిపుణులుగా డాక్టర్‌ రూప వైద్యరంగంలో ఉన్నారు. డాక్టర్‌ మునిప్రసాద్‌ ప్రకాశం జిల్లాలో వైద్యాధికారిగా పనిచేస్తూ మరణించారు. ఇంకా అన్వేష్‌, నిఖిల, దినేష్‌లు ఎంబీబీఎస్‌ పూర్తి చేసి.. పీజీ చేస్తున్నారు. జశ్విత, చేతన, వంశీ, దీపక్‌నాథ్‌ వైద్య విద్య అభ్యసిస్తున్నారు. అరవింద్‌ పీజీకి సిద్ధమవుతున్నారు. 


డాక్టర్ల ఊరిలో ఆస్పత్రి లేదు

ఇంత మంది డాక్టర్లకు పురుడుపోసిన జీలపాటూరులో వైద్యశాల లేదు. వైద్యం కోసం నాలుగు కిలోమీటర్ల దూరంలోని పెళ్లకూరు మండల కేంద్రానికి పరుగులు తీయాలి. మరీ నలతగా ఉంటే 13 కిలోమీటర్ల దూరంలోని నాయుడుపేటకు గానీ, 15 కిలోమీటర్ల దూరంలోని శ్రీకాళహస్తికి గానీ వెళ్లాల్సి వస్తోంది. దేశవిదేశాల్లో వివిధ స్థాయిల్లో ఉన్న ఈ ఊరి విద్యావంతులు పూనుకుంటే జీలపాటూరులో ఆస్పత్రి మొదలవడం పెద్ద కష్టం కాదు. 


దేశదేశాల్లోనూ ఎందరో

చదువుల్లో పోటీలు పడే జీలపాటూరు యువత ఇతర రంగాల్లోనూ రాణిస్తోంది. ఇంజనీరింగ్‌ పూర్తి చేసుకున్న    36 మంది ఉద్యోగాల్లో ఉన్నారు. ఎంటెక్‌ చేసిన వంశీకృష్ణ లండన్‌లో స్థిరపడ్డారు. ఎంటెక్‌ చేసిన సంపత్‌ కుమార్‌, బీటెక్‌ చేసిన వినయ్‌, శ్రీకాంత్‌, ఇలుపూరు రామ్‌ప్రసాద్‌లు అమెరికాలో ఉన్నారు. ఎంఎస్‌ చేసిన అనిల్‌కుమార్‌, గీత లు కూడా అమెరికాలోనే మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, ఢిల్లీల్లోనూ పలువురు మంచి స్థానాల్లో ఉన్నారు. 


చదువుల్లో ఆదర్శ పంచాయతీ మాది

మా పిల్లలు కష్టపడి చదువుకుని రాణిస్తున్నారు. వీళ్లను చూసి అందరం గర్వపడుతుంటాం. చుట్టుపక్కల గ్రామ యువకులు కూడా మా గ్రామ యువతను ఆదర్శంగా తీసుకుని చదువులో ముందుకెళ్తున్నారు.


మా ఇంట్లో నలుగురు డాక్టర్లు

వ్యవసాయంపై ఆధారపడి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. అలాంటి పరిస్థితులు మా బిడ్డలకు వద్దనుకున్నాం. బిడ్డల చదువు మీదే దృష్టి పెట్టాం. మా అబ్బాయి మహేంద్రరెడ్డి కష్టపడి చదివి డాక్టరయ్యాడు. నా కోడలు తనూజ కూడా డాక్టరే. వారి కుమారుడు అన్వేష్‌, ఆయన భార్య జస్విత కూడా డాక్టర్లే.  మా ఆయన పాలూరు సుందరరామిరెడ్డి రెక్కల కష్టమే ఇదంతా. 


మా కష్టం వృథా కాలేదు

మాకున్నది కొద్ది భూమే. రాత్రిపగలు కష్టపడి వ్యవసాయం చేసి బిడ్డలను చదివించాం. అమ్మానాయనల కష్టం అర్థం చేసుకున్న బిడ్డలు చదువులో ముందే నిలిచారు. మా పెద్దబ్బాయి స్విమ్స్‌లో జనరల్‌ మెడిసిన్‌లో పీజీ పూర్తిచేశాడు. చిన్నబ్బాయి అఖిల్‌ తిరుపతి ఎస్వీ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ పూర్తిచేసి, గేట్‌ పరీక్షలు రాసి 53వ జాతీయ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం విమానయాన సంస్థలో తిరుచ్చిలో పనిచేస్తున్నాడు.

Updated Date - 2022-09-11T07:49:09+05:30 IST