‘రేషన్‌’ విభజన లెక్క తేలింది

ABN , First Publish Date - 2022-03-16T06:05:07+05:30 IST

జిల్లాల పునర్విభజన నేపథ్యంలో రేషన్‌ షాపులు, కార్డులు, ఎంఎల్‌ పాయింట్ల విభజన లెక్క తేలింది.

‘రేషన్‌’ విభజన లెక్క తేలింది

చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 15: జిల్లాల పునర్విభజన నేపథ్యంలో రేషన్‌ షాపులు, కార్డులు, ఎంఎల్‌ పాయింట్ల విభజన లెక్క తేలింది. ఇప్పటి వరకున్న 19600 టన్నుల సామర్థ్యం కలిగిన 28 మండల స్థాయి స్టాకు(ఎంఎల్‌) పాయింట్లు, 1148313 కార్డులు, 2901 చౌకదుకాణాలను మూడు జిల్లాల పరిధిలోకి విభజన పూర్తి చేశారు. 

చిత్తూరు జిల్లా: పది వేల టన్నుల సామర్థ్యంతో 15 ఎంఎల్‌ పాయింట్లు కొనసాగుతాయి. ఇవి చిత్తూరు, జీడీ నెల్లూరు, పూతలపట్టు, బంగారుపాళ్యం, పుత్తూరు, కార్వేటినగరం, నగరి, పచ్చికాపల్లం, రొంపిచెర్ల, సదుం, పుంగనూరు, పలమనేరు, వి.కోట, శాంతిపురం, కుప్పం ఎంఎల్‌ పాయింట్లు ఉంటాయి. 33 మండలాల పరిధిలోని 560338 రేషన్‌కార్డుదారులకు 1500 చౌకదుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తారు. 

శ్రీ బాలాజీ జిల్లా: తిరుపతి కేంద్రంగా ఏర్పాటు కానున్న శ్రీ బాలాజీ జిల్లా పరిధిలో 5200 టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, పిచ్చాటూరు, పాకాలలోని (ఆరు) ఎంఎల్‌ పాయింట్లు ఉంటాయి. వీటి పరిధిలో 760 చౌకదుకాణాల ద్వారా 329826 రేషన్‌ కార్డులు ఉంటాయి. నెల్లూరు జిల్లా నుంచి మరో ఆరు ఎంఎల్‌ పాయింట్లు కలుస్తాయి. 

అన్నమయ్య జిల్లా: ఈ జిల్లాకు 4400 టన్నుల సామర్థ్యం కలిగిన మదనపల్లె, బి.కొత్తకోట, తంబళ్లపల్లె, వాయల్పాడు, కలకడ, పీలేరు, కలికిరి (ఏడు)లోని ఎంఎల్‌ పాయింట్లు కలుపుతారు. 641 చౌకదుకాణాల ద్వారా 258149 రేషన్‌కార్డుదారులకు సరుకులు అందిస్తారు. 


ఏప్రిల్‌ పంపిణీ పాత పద్ధతిలోనే

ఏప్రిల్‌ 2 నుంచి కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్నా ఆ నెల కోటాను పాత పద్ధతిలోనే పంపిణీ చేస్తారు. చిత్తూరు జిల్లా ద్వారానే ఈ నెల 31వ తేదీలోగా రేషన్‌ సరుకులు సరఫరా అవుతాయి. మే నుంచి కొత్త జిల్లాల వారీగా రేషన్‌ కోటా విడుదలవుతుంది. 

Read more