పర్యాటక విభాగం పనితీరు డొల్ల

ABN , First Publish Date - 2022-09-27T07:36:50+05:30 IST

పర్యాటక వారోత్సవాలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. అయితే కార్యక్షేత్రం మాత్రం వెలవెలబోతోంది.

పర్యాటక విభాగం పనితీరు డొల్ల

తిరుపతి (కల్చరల్‌), సెప్టెంబరు 26 : పర్యాటక వారోత్సవాలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. అయితే కార్యక్షేత్రం మాత్రం వెలవెలబోతోంది. కొత్తగా ఏర్పాటైన తిరుపతి జిల్లా పర్యాటకపరంగా రాష్ట్రంలోనే కీలకప్రాంతం. పైగా పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా. తిరుపతి జిల్లా ఏర్పడి ఆరు నెలలైనా, ఇంత వరకూ జిల్లా వెబ్‌సైట్‌  https://tirupati.ap.gov.in/లో పర్యాటక రంగానికి చెందిన వివరాలు సమగ్రంగా లేవు.గత బుధవారం తిరుపతిలో 2కె రన్‌ ప్రాంరంభించిన కలెక్టర్‌ పర్యాటక కేంద్రంగా ఉన్న జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లాకు  వున్న సముద్ర తీరం అదనపు ఆకర్షణ అన్నారు. కానీ జిల్లా వెబ్‌సైట్లో తీరప్రాంతం ఊసే లేదు. కొత్త జిల్లాలో ఏముందో బయటివారు ఎలా తెలుసుకుంటారు? ఇక  పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రత్యర్ధులను తిట్టడానికే ఎక్కువ సమయం ఉపయోగిస్తున్నారు తప్ప తన శాఖ కార్యక్రమాలకు సంబంధించి ఏమీ మాట్లాడరన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. 


లోపాలపుట్ట...

రిలిజియస్‌ టూరిజం పేరుతో ఉన్న పుటలో తిరుపతి, తిరుచానూరు, శ్రీకాళహస్తి, అప్పలాయగుంట, కపిలతీర్ధం ఆలయాలు మాత్రమే ఉన్నాయి. జిల్లాకు చెందిన తక్కిన ప్రముఖ ఆలయాల వివరాలు ఎందుకు లేవో అధికారులకే తెలియాలి.తిరుపతి జంతుప్రదర్శన శాల గురించి, విజ్ఞానదాయకమైన సైన్స్‌ సెంటర్‌ గురించి కనీస ప్రస్తావన కూడా లేదు.అత్యంత పురాతనమైన, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఏర్పేడు మండలంలోని గుడిమల్లం పరశరామేశ్వరాలయం గురించీ కూడా ఈ వెబ్‌పుటలో కనిపించదు.ఇటీవల ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన వకుళమాత ఆలయం ప్రస్తావన కూడా వెబ్‌సైట్లో లేదు. 


ఎకో టూరిజంలో...

పులికాట్‌ సరస్సు, పెంచలకోన మాత్రమే ఉన్నాయి. తలకోన ఏం పాపం చేసిందో తెలియదు. మామండూరు పేరు కూడా లేదు. అనేక అభయారణ్యాలున్న జిల్లాలో వివరాలు అసమగ్రం. కనీసం జిల్లా చీఫ్‌ ప్లానింగ్‌ అధికారి రూపొందించిన హ్యాండ్‌బుక్‌లోని వివరాలు పొందుపరిచి ఉన్నా కొంత బాగుండేదేమో.  


ఇంజనీరింగ్‌ టూరిజం ...

ఈ పుటలో శ్రీహరికోట వివరాలు స్ధూలంగా ఉన్నాయి. దేశ రక్షణ వ్యవస్థకు, ఉపగ్రహ ప్రయోగ కేంద్రంగా అత్యంత భద్రత కలిగిన ఈ ప్రదేశంలోకి వెళ్లడానికి అందరికీ అనుమతి ఉండదు. కనుక పర్యాటకులు ఎవరి నుంచీ అనుమతి తీసుకోవాలో వివరాలు ఏవీ లేవు. శ్రీహరికోట సందర్శన వేళలు, సెలవు దినాల వివరాలు ఏమీ లేవు. 


ఫారెస్ట్‌ టూరిజం 

ఈ విభాగంలో తలకోన వివరాలు క్లుప్తంగా ఉన్నాయి. ఫొటో కనిపించడంలేదు. తిరుమల గిరులలోని జలపాతాలు, అక్కడికి వెళ్లే ట్రెక్కింగ్‌ వివరాలు ఏమీ లేవు. అలాగే చిన్నారులను ఆకర్షించే నేలపట్టుగాని, జంగిల్‌ బుక్‌ ప్రస్తావన కానీ జిల్లా అధికారిక వెబ్‌ పేజీల్లో కన్పించదు. 


అనువాదం ఘోరం

తిరుపతి జిల్లా వెబ్‌సైట్లో ఇంగ్లీషుకు  చేసిన అనువాదం దారుణంగా ఉంది. ఫారెస్ట్‌ టూరిజం అంటే అటవిక పర్యాటకం అని పెట్టారు. ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్న చంద్రగిరి కోట, ముక్కోటి గుడి, కల్యాణి డ్యాం, శ్రీసిటీ, సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయం, వెంకటగిరి కోట, నారాయణవనం, వేయిలింగాలకోన వంటి చాలా పర్యాటక ప్రాంతాల వివరాలు లేవు. ఈ పర్యాటక వారోత్సవాలవేళ జిల్లాలో కార్యక్రమాలు ఏమీ లేవట.ఆప్‌కమింగ్‌ ఈవెంట్స్‌ అనే పుటలో వివరాలు ఏమీ లేవు సారీ అని రాసిపెట్టేసారు మన సార్లు. పైగా తిరుపతి ఎన్జీవో  కాలనీ లోని ఓ ప్రైవేటు ఆలయానికి ప్రచారం కలిగిస్తూ.. ఆ ఆలయం చిత్రాన్ని వెబ్‌ పేజీలో ప్రముఖంగా ప్రచురించడం విశేషం. Read more