సరిహద్దుల్లో కొరవడిన నిఘా నేత్రాలు

ABN , First Publish Date - 2022-09-24T06:21:48+05:30 IST

సరిహద్దు ప్రాంతాల్లో నిఘా నేత్రాల పరిశీలన కొరవడడంతో అక్రమార్కులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.

సరిహద్దుల్లో కొరవడిన నిఘా నేత్రాలు
విజయపురం మండలంలోని గాండ్లకండ్రిగ చెక్‌పోస్టు వద్ద పగిలి ఉన్న సీసీ కెమెరాలు

ఇసుక చెక్‌ పోస్టుల వద్ద నిరుపయోగంగా సీసీ కెమెరాలు

నగరి, సెప్టెంబరు 23: సరిహద్దు ప్రాంతాల్లో నిఘా నేత్రాల పరిశీలన కొరవడడంతో అక్రమార్కులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. వాటి కోసం విద్యుత్‌ సర్వీ్‌సను తీసుకున్నారు. ఒక్కో చెక్‌పోస్టు వద్ద రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ కోసం స్పెషల్‌ ఫోర్స్‌ను నియమించారు. ఈ చెక్‌పోస్టుల ద్వారా రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలకుండా చూడాలన్నదే ప్రధాన లక్ష్యం. అయితే, ఈ ఏడాద ఏప్రిల్‌ 30వ తేదీతో సరిహద్దు చెక్‌పోస్టులన్నీ మూసివేశారు. అందులో పని చేస్తున్న స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బందిని తొలగించారు. నాటి నుంచి నేటి వరకు విద్యుత్‌ సర్వీసులకు సంబంధించిన మీటర్లు నిరుపయోగంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పోలీసుశాఖ వారు తీసి వేయగా, మరి కొద్ది చోట్ల పగులగొట్టి ఉండడం కనిపిస్తోంది. విజయపురం మండలంలోని గాండ్లకండ్రిగ సమీపంలో చెక్‌పోస్టు వద్ద సీసీ కెమెరాలను ఆకతాయిలు పగులకొట్టారు. విద్యుత్‌ దీపాలు మాత్రం వెలుగుతూనే ఉన్నాయి. ఈ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాక ఎర్రచందనం, గంజాయి ఇతర అక్రమ రవాణాలను అరికట్టే అవకాశం ఉండేది. తమిళనాడు సరిహద్దు గల విజయపురం మండలంలోని గాండ్లకండ్రిగ వద్ద సరిహద్దు చెక్‌పోస్టు వద్ద గతంలో రెండు సార్లు ఎర్రచందనం పట్టుకోవడం జరిగింది. కానీ నిఘా నేత్రాలు కొరవడడంతో అక్రమార్కులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. సీసీ కెమెరాల పర్యవేక్షణ లేకపోవడంతో పలు చోట్ల అవి పగులకొట్టడమే గాక నిరుపయోగంగా మిగిలాయి. సహజంగా విద్యుత్‌ సర్వీస్‌ పొందాలంటే ఒక్కో సర్వీ్‌సకు రూ.1200 నుంచి రూ.2600 వరకు డిపాజిట్‌ చెల్లిస్తేనే విద్యుత్‌ మీటరు అమర్చడం జరుగుతుంది. అలాంటిది జిల్లాలోని సుమారు 46 ఇసుక చెక్‌పోస్టుల వద్ద విద్యుత్‌ మీటర్లు నిరుపయోగంగా అలాగే ఉన్నాయి.


Read more