దొంగతనం అనుమానంతో పనిమనిషిని చితగ్గొట్టేశారు

ABN , First Publish Date - 2022-01-23T06:27:57+05:30 IST

‘దొంగతనం చేశావు కదా.. చెప్పు.. అంటూ లాఠీలతో ఒళ్లంతా బాదేశారు. బూటుకాళ్లతో తన్నారు. చెడ్డ మాటలన్నీ అన్నారు. నొప్పితో బాధతో మొత్తుకుంటున్నా కనికరించలేదు. ఒక పగలంతా ఒళ్లు హూనం చేసి పోలీసు అధికారి ముందుకు తీసుకువెళ్లారు. ఆయనేమో.. నువ్వు చెయ్యలేదు. వాళ్ల దగ్గరే పొరపాటు జరిగింది. డబ్బున్నోళ్ల ఇంట్లో పనిచెయ్యబాక.. నీకు వాళ్లతోనే వైద్యం చేయిస్తాం. వాళ్ల దగ్గర నుంచి డబ్బులు ఇప్పిస్తాం.. అని చెప్పి ఆసుపత్రిలో చేర్పించినారు.

దొంగతనం అనుమానంతో  పనిమనిషిని చితగ్గొట్టేశారు

పోలీసులపై దళిత మహిళ ఆరోపణ - విచారణకు ఆదేశించిన డీఐజీ


చిత్తూరు, జనవరి 22: ‘‘దొంగతనం చేశావు కదా.. చెప్పు.. అంటూ లాఠీలతో ఒళ్లంతా బాదేశారు. బూటుకాళ్లతో తన్నారు. చెడ్డ మాటలన్నీ అన్నారు. నొప్పితో బాధతో మొత్తుకుంటున్నా కనికరించలేదు. ఒక పగలంతా ఒళ్లు హూనం చేసి పోలీసు అధికారి ముందుకు తీసుకువెళ్లారు. ఆయనేమో.. నువ్వు చెయ్యలేదు. వాళ్ల దగ్గరే పొరపాటు జరిగింది. డబ్బున్నోళ్ల ఇంట్లో పనిచెయ్యబాక.. నీకు వాళ్లతోనే వైద్యం చేయిస్తాం. వాళ్ల దగ్గర నుంచి డబ్బులు ఇప్పిస్తాం.. అని చెప్పి ఆసుపత్రిలో చేర్పించినారు. అక్కడా వైద్యం అందకుండా తొందరగా ఇంటికి పంపేయమన్నారు’’ అంటూ ఒక దళిత మహిళ కన్నీరు మున్నీరయ్యింది.చిత్తూరులో శనివారం మీడియాకు తనకు జరిగిన అన్యాయం వివరించింది. ఆమె కథనం ప్రకారం.. చిత్తూరు నగరం లక్ష్మీనగర్‌కాలనీకి చెందిన ఉమామహేశ్వరి అదే ప్రాంతంలోని మైత్రీ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న జిల్లా జైలు సూపరింటెండెంట్‌ ఇంట్లో ఏడాదిగా పనిచేస్తోంది. ఈ నెల 18న సూపరింటెండెంట్‌ ఇంట్లో రూ. 2 లక్షలు చోరి అయ్యాయి. ఈ విషయంపై జైలు సూపరింటెండెంట్‌ ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విచారణలో భాగంగా పోలీసులు ఉమామహేశ్వరిని తమ పద్ధతిలో విచారించారు. నడవలేని స్థితిలో ఆమె మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సంఘటనపై  డీఎస్పీ సుధాకర్‌రెడ్డిని వివరణ కోరగా..జిల్లా జైలు సూపరింటెండెంట్‌ వేణుగోపాలరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితురాలిని విచారించగా దొంగతనం చేసినట్లు అంగీకరించిందని చెప్పారు. దొంగలించిన డబ్బులను తిరిగి చెల్లించాల్సివస్తుందనే ఆమె పోలీసులపై అసత్య ఆరోపణలు చేస్తోందన్నారు.కాగా ఉమామహేశ్వరి ఆరోపణలపై స్పందించిన డీఐజీ సెంథిల్‌కుమార్‌ ఏఎస్పీ మహేష్‌ను విచారణాధికారిగా నియమించారు.


బాధితురాలికి న్యాయం చేయాలి: టీడీపీ 


దొంగతనం నెపంతో దళిత మహిళపై పోలీసులు దాష్టీకం చేశారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్‌ శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు.ఉమామహేశ్వరిని విచారణ పేరుతో  స్టేషన్‌లో చిత్రహింసలకు గురిచేసి, కనీసం నడవలేని స్థితికి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ ఆమె నేరమే చేసి ఉన్నా శాస్త్రీయంగా నిరూపించి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలేకానీ చిత్రహింసలకు గురిచేయడం ,కులంపేరుతో దూషించడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని తెలిపారు.సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం చేయాలని  కోరారు.


పోలీసులపై చర్యలు తీసుకోవాలి: సీపీఎం 


ఉమామహేశ్వరిని హింసించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్‌ చేశారు.సంఘటనకు కారణమైన జైలు సూపరింటెండెంట్‌ వేణుగోపాలరెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Read more