బీరకుప్పంలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-10-08T05:31:58+05:30 IST

నాగలాపురం మండల పరిధిలోని బీరకుప్పం దళిత వాడలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

బీరకుప్పంలో ఉద్రిక్తత
లలిత మృతదేహంతో రహదారిపై ధర్నా నిర్వహిస్తున్న ఏలుమలై బంధువులు

 మహిళ మృతదేహంతో రోడ్డుపై ధర్నా


నాగలాపురం, అక్టోబరు 7: నాగలాపురం మండల పరిధిలోని బీరకుప్పం దళిత వాడలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.రెండు కుటుంబాల మధ్య తలెత్తిన భూవివాదానికి సంబంధించి గత సోమవారం జరిగిన ఘర్షణలో వైసీపీ నాయకుడు విజయన్‌ వర్గం  జరిపిన దాడిలో ఏలుమలై, అతని భార్య లలిత, కుమారుడు రాంకీ తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే.అదేరోజు ఏలుమలై మృతి చెందగా, తిరుపతిలో చికిత్స పొందుతూ లలిత గురువారం మృతి చెందింది. శుక్రవారం సాయంత్రం ఆమె మృతదేహాన్ని బీరకుప్పానికి కుటుంబీకులు తీసుకొచ్చారు.తమకు న్యాయం చేయాలంటూ ఇంటి ముందరున్న నాగలాపురం-టీపీ కోట- సత్యవేడు రహదారిపై ఉంచి  ధర్నా నిర్వహించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారమందుకున్న అధికారులు అక్కడున్న పోలీసు పికెట్‌కు తోడు మరికొంతమంది పోలీసులను గ్రామంలో మొహరించారు.ఈ సందర్భంగా లలిత చిన్న కోడలైన రత్నకుమారి మాట్లాడుతూ తన సొంత ఊరు కడప అని, తాను వైసీపీ అభిమాని అంటూనే  పార్టీకి ఓటు వేసినందుకు తగిన గుణపాఠం చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ భూ వివాదంలో అత్తను,మామను కోల్పోయానంటూ కంట తడి పెట్టారు. ఈ ఘటనలో తమకు న్యాయం చేయకుండా పోలీసులు, నాయకులు అన్యాయం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబంపై దాడి చేసిన వారిలో మరో ఇద్దరు వైసీపీ నాయకుడు చర్చిల్‌, అడ్వకేట్‌ వేలును కూడా వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే ఆదిమూలం సైతం తమను పలకరించకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇక్కడి నాయకులు పార్టీని చూస్తున్నారే తప్ప సమస్యను పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. ఎమ్మెల్యే సంఘటనా స్థలానికి వచ్చి తమకు న్యాయం చేసేంత వరకు రోడ్డుపైనే బైఠాయిస్తామని తేల్చి చెప్పారు. బాధ్యులపైన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, అంతవరకు సంయమనం పాటించాలని డీఎస్పీ విశ్వనాధ్‌   బాధితులను కోరారు.అయితే శుక్రవారం రాత్రి 11గంటల వరకూ కూడా లలిత మృతదేహాన్ని రోడ్డుపైనే వుంచి కుటుంబీకులు ఆందోళన కొనసాగిస్తున్నారు.

Read more