స్విమ్స్‌ ఓపీ ఫీజు పెంచేశారు!

ABN , First Publish Date - 2022-09-19T06:41:19+05:30 IST

సామాన్యుడికి గుండె ధైర్యంగా ఉన్న స్విమ్స్‌ ఆస్పత్రి ఇకపై కార్పొరేట్‌ ఆస్పత్రుల వలె ఫీజులు వసూలు చేసేందుకు సిద్ధమైంది. జబ్బు చేస్తే జేబులో వేల రూపాయలు లేకపోయినా దర్జాగా కార్పొరేట్‌ వైద్యం చేసుకోవచ్చన్న ధీమా ఇకపై స్విమ్స్‌లో కనిపించకుండా పోయే పరిస్థితి వస్తోంది. రెండు దశాబ్దాలకుపైగా రూ.50 ఫీజుతో ఓపీ చూసే స్విమ్స్‌లో సోమవారం నుంచి నాలుగు రెట్లు పెంచి రూ.200 వసూలు చేయనున్నారు. ఆమేరకు స్విమ్స్‌లోని మెడికల్‌ రికార్డ్సు విభాగానికి సర్క్యులర్‌ వెళ్లింది. ఓపీతోపాటు కొన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షల ఫీజులు కూడా పెంచుతున్నట్టు సమాచారం.

స్విమ్స్‌ ఓపీ ఫీజు పెంచేశారు!

రూ.50నుంచి రూ.200కి పెంపు

నేటినుంచి అమల్లోకి..

సామాన్యుడికి గుండె ధైర్యంగా ఉన్న స్విమ్స్‌ ఆస్పత్రి ఇకపై కార్పొరేట్‌ ఆస్పత్రుల వలె ఫీజులు వసూలు చేసేందుకు సిద్ధమైంది. జబ్బు చేస్తే జేబులో వేల రూపాయలు లేకపోయినా దర్జాగా కార్పొరేట్‌ వైద్యం చేసుకోవచ్చన్న  ధీమా ఇకపై స్విమ్స్‌లో కనిపించకుండా పోయే పరిస్థితి వస్తోంది. రెండు దశాబ్దాలకుపైగా రూ.50 ఫీజుతో ఓపీ చూసే స్విమ్స్‌లో సోమవారం నుంచి నాలుగు రెట్లు పెంచి రూ.200 వసూలు చేయనున్నారు. ఆమేరకు స్విమ్స్‌లోని మెడికల్‌ రికార్డ్సు విభాగానికి సర్క్యులర్‌ వెళ్లింది. ఓపీతోపాటు కొన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షల ఫీజులు కూడా పెంచుతున్నట్టు సమాచారం. 

- తిరుపతి, ఆంధ్రజ్యోతి 

రాయలసీమలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఉండాలన్న ఉద్దేశంతో 1986 ఏప్రిల్‌ 18న అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు స్విమ్స్‌కు పునాదిరాయి వేశారు. 1993లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా రూపాంతరం చెందింది. ఆరు సూపర్‌ స్పెషాలిటీ విభాగాలు, 200 పడకలతో ప్రారంభమైన స్విమ్స్‌ వైద్య ప్రస్థానం దశలవారీగా పెరుగుతూ వచ్చింది. 1995లో డీమ్డ్‌ వర్సిటీగా గుర్తింపు తెచ్చుకుంది. పారా మెడికల్‌ కోర్సుల నుంచి పీహెచ్‌డీ వరకు విస్తరించింది. మహిళా మెడికల్‌ కళాశాల కలిగి దేశంలోనే రెండో వైద్య సంస్థగా ఉండటం స్విమ్స్‌ ప్రత్యేకత. 2019 అక్టోబరులో టీటీడీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిమ్స్‌ తరహాలో అభివృద్ధి చేసి మరింత మెరుగైన వైద్యసేవలందించేందుకు వీలుగా స్విమ్స్‌ ఆస్పత్రిని టీటీడీ ఆధీనంలోకి తీసుకునేందుకు పాలకమండలి ఆమోద ముద్ర వేసింది. విలీనం కాకముందు కూడా స్విమ్స్‌కు అవసరమైన భవనాలు మౌలిక వసతులతోపాటు ఏటా రూ.50 కోట్ల వరకు టీటీడీ నిధులు ఇస్తోంది. టీటీడీ పరిధిలోకి వెళ్లిన స్విమ్స్‌లో బర్డ్‌ ఆస్పత్రివలె ఉచితంగా వైద్యం అందిస్తారని భావిస్తే ధరలు పెంచుకుంటూ పోవడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పైగా రాష్ట్ర విభజన అనంతరం మనకు మిగిలిన అన్ని వసతులున్న ఏకైక సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి స్విమ్స్‌. ఇక్కడ కూడా ప్రైవేట్‌ ఆస్పత్రిలాగా ధరలు పెంచుకుంటూ పోవడాన్ని తప్పుబడుతున్నారు. 

లోటు పూడ్చుకోవడానికేనా?

స్విమ్స్‌లో 1547 (650 పడకల మెడికల్‌ కాలేజ్‌ అనుబంధ ఆస్పత్రితో కలిపి)పడకలు ఉండగా.. రోజుకు సరాసరి 1,800 మంది ఓపీకి వస్తుంటారు. అదేవిధంగా 110 వరకు అడ్మిషన్లు జరుగుతుంటాయి. స్విమ్స్‌ టీటీడీలో విలీనం కాకముందు సుమారు హాస్పిటల్‌ రెవెన్యూ  రూ.85.13 కోట్లు, యూనివర్సిటీ రెవెన్యూ రూ.17.79 కోట్లు, టీటీడీ, ప్రభుత్వ నిధుల ద్వారా రూ.19.43 కోట్లు మొత్తం బడ్జెట్‌ రూ.152.5 కోట్లు కాగా సుమారు రూ.30కోట్ల లోటు బడ్జెట్‌తో నడిచింది. ఈ లోటు బడ్జెట్‌ను పూడ్చుకునేందుకు టీటీడీ చేస్తున్న ప్రయత్నంగా తెలుస్తోంది. ఈనిర్ణయంపై ప్రజాసంఘాల స్పందన ఏవిధంగా ఉంటుందో చూడాలి. 

Read more