ఆపరేషన్‌ కేసులకూ కరోనా పరీక్షల నిలిపివేత

ABN , First Publish Date - 2022-01-23T06:34:37+05:30 IST

కరోనా పరీక్షలు తగ్గించేందుకు రోజుకో సాకు పుట్టుకొస్తోంది. ఎక్కడచూసినా ఇబ్బడి ముబ్బడిగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న తరుణంలో అత్యవసర కేసులు, ఆపరేషన్‌ బాధితులు, గర్భవతులకు కరోనా నిర్ధారణ పరీక్షలు అవసరం లేదంటూ అధికారులు ఆదేశించినట్లు తెలిసింది.

ఆపరేషన్‌ కేసులకూ కరోనా పరీక్షల నిలిపివేత

శ్రీకాళహస్తి, జనవరి 22: కరోనా పరీక్షలు తగ్గించేందుకు రోజుకో సాకు పుట్టుకొస్తోంది. ఎక్కడచూసినా ఇబ్బడి ముబ్బడిగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న తరుణంలో అత్యవసర కేసులు, ఆపరేషన్‌ బాధితులు, గర్భవతులకు కరోనా నిర్ధారణ పరీక్షలు అవసరం లేదంటూ అధికారులు ఆదేశించినట్లు తెలిసింది. రెండేళ్ల నుంచి కరోనా వ్యాప్తితో గర్భవతులు, ఆపరేషన్‌ కేసులకు మందస్తుగా కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేసేవారు. ఆపరేషన్‌ థియేటర్లలో వైద్యసిబ్బందికి కరోనా వ్యాపించకుండా ముందస్తు నిర్ధారణ ఎంతగానో ఉపయోగపడేది. చాలా సందర్భాల్లో ముందస్తు నిరాఽ్ధరణ లేక పలు ఆపరేషన్‌ కేసులు వాయిదా పడ్డాయి కూడా. ఈసారి ఆపరేషన్‌ కేసులకు కరోనా నిర్ధారణ అవసరం లేదంటూ ఆదేశాలు వెలువడ్డాయి.దీంతో శనివారం జిల్లా ప్రధాన వైద్యశాలల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు లేకుండానే ఆపరేషన్లు నిర్వహించారు. శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు గర్భవతులకు కోవిడ్‌ పరీక్ష చేయకుండానే ఆపరేషన్‌ ద్వారా కాన్పు చేశారు. అదే విధంగా ఒక డీఎన్‌పీ మరొక గర్భసంచి తొలగింపు ఆపరేషన్‌ కూడా పరీక్ష లేకుండానే చేశారు. ఇలా చేయడం వల్ల వైద్యసిబ్బంది ఎక్కువగా కరోనా బారిన పడే ప్రమాదమున్నట్లు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానానికి ప్రైవేటు వైద్యశాలలు సహకరిస్తాయా అన్నదే ప్రశ్నార్థకం. ప్రైవేటు వైద్యశాలల్లో కరోనా పరీక్షలు లేకుండా శస్త్రచికిత్సలు చేయకపోతే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వ కేంద్రాల్లో కిట్ల కొరతను చూపుతుండడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.దీన్ని అవకాశంగా తీసుకుని ప్రైవేటు ల్యాబ్స్‌  దండుకునే అవకాశముంది. మొత్తమ్మీద అధికారులు రోజుకో మార్గదర్శకాన్ని ముందుకు తెస్తుండడం ప్రజలను గందరగోళానికి గురి చేస్తోంది. దీనిపై అధికారుల వివరణ కోరగా ఐసీఎంఆర్‌, ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచనల మేరకు కేవలం కరోనా లక్షణాలున్నవారికి మాత్రమే పరీక్షలు చేస్తున్నామని చెబుతున్నారు.

Updated Date - 2022-01-23T06:34:37+05:30 IST