-
-
Home » Andhra Pradesh » Chittoor » Student dies in road accident-NGTS-AndhraPradesh
-
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
ABN , First Publish Date - 2022-08-31T07:14:34+05:30 IST
పరీక్ష రాయడానికి వెళుతున్న ఓ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు.

భాకరాపేట/బి.కొత్తకోట, ఆగస్టు 30: పరీక్ష రాయడానికి వెళుతున్న ఓ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ దుర్ఘటన మంగళవారం భాకరాపేట ఘాట్‌లో జరిగింది. భాకరాపేట ఎస్‌ఐ ప్రకాశ్ కుమార్ తెలిపిన వివరాల మేరకు.. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం గుమ్మసముద్రం పంచాయతీ కొండకిందపల్లెకు చెందిన నాగరాజు కుమారుడు నితీశ్(22), తన స్నేహితుడైన సందీ్‌పతో కలిసి ద్విచక్రవాహనంలో తిరుపతిలో డిప్లొమా పరీక్షలు రాయడానికి బయల్దేరాడు. మార్గమధ్యంలోని భాకరాపేట ఘాట్‌లోకొచ్చేసరికి తిరుపతి నుంచి పీలేరువైపు వస్తున్న మరో ద్విచక్ర వాహనం వీరి వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో నితీశ్ అక్కడికక్కడే మృతి చెందగా, సందీ్‌పకు తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని 108 వాహనంలో తిరుపతి రుయాస్పత్రికి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నితీశ్ మృతి చెందాడని తెలియడంతో కొండకిందపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న అతడి తల్లిదండ్రులు నాగరాజు, కళావతి కన్నీరుమున్నీరుయ్యారు. వీరిని ఓదార్చడం గ్రామస్తులకు సాధ్యపడలేదు.